|
VHP |
హిందూ దేవీ దేవతలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు హిందూ వ్యతిరేక బోధనలు చేస్తున్న ఉపాధ్యాయుడు మల్లికార్జున్లను వెంటనే అరెస్ట్ చేయకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని విశ్వహిందూ పరిషత్ (VHP) హెచ్చరించింది. సోమవారం కోఠిలోని వీహెచ్‌పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, రాష్ట్ర ప్రచార్ ప్రముఖ్ పగడాకుల బాలస్వామి ప్రసంగించారు. మనకు ప్రభుత్వాలు, పోలీసులు, చట్టాలు ఉన్నప్పటికీ రెంజర్ల రాజేష్, మల్లికార్జున్ల వారిపై చర్యలు తీసుకోకుండా, నిరసన చేస్తున్న విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అత్యాధునిక టెక్నాలజీ ఉన్నదని చెప్పుకుంటున్న తెలంగాణ పోలీసులు రెంజర్ల రాజేష్ ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోతున్నారని, ఒక్క సాధారణ వ్యక్తిని అరెస్ట్ చేయలేనివాళ్ళు తీవ్రవాదులను ఏం పట్టుకోగలుగుతారని విమర్శించారు. రాజేష్ పై పీడీ యాక్ట్ పెట్టాలి, లేకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. మతం మారి కూడా ఎస్సీ అని చెప్పుకుంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్న మల్లికార్జున్ కులధ్రువీకరణ పత్రం రద్దు చేసి, అతడిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ విద్యాశాఖకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
Source : Vsk Telangana