Secularism |
How secularism came into our constitution
ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రగతిశీలమైన రాజ్యాంగం మనదేశ రాజ్యాంగం. దీన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే నవంబర్ 26. 1949 నవంబర్ 15న రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు డా. బి. ఆర్ అంబేద్కర్. ఆ మరుసటి రోజున రాజ్యాంగ సభ రాజ్యాంగ ప్రతికి ఆమోదం తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నవంబర్ 19, 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి అధికారికంగా 2015 నుంచి నవంబర్ 26ను సంవిధాన్ దివస్ గా అధికారికంగా జరుపుకుంటున్నారు.
మన దేశం ముందు నుంచి మతప్రమేయం లేనటువంటి దేశంగానే ఉంది. హిందుత్వం అనేది ఒక మతం కాదనీ, అది భారతీయుల జీవన విధానమని సుప్రీంకోర్టు కూడా అభివర్ణించింది. ప్రపంచంలో మరే దేశానికి కూడా లేనటువంటి విభిన్నమైన జాతీయత మన దేశానికి ఉంది. మన సనాతన ధర్మంలో వైష్ఞవం, శైవం, శాక్తేయం, జైనం, బౌద్ధం మొదలైన అనేక మతాలు, సంప్రదాయాలు ఉన్నా కూడా, ఎవరికి వారు వారివారి మతాభిప్రాయాలను గౌరవిస్తారు.. భారతీయ సమాజాన్ని గౌరవిస్తూ… మేము భారతీయులము అని గర్వంగా చెబుతుంటారు. అందువల్ల లౌకికవాదం, సామ్యవాదం అనే పదాలతో ప్రమేయం లేకుండానే రాజ్యాంగాన్ని తదనుగుణంగా రాజ్యాంగం ఏర్పరచుకున్నాం. కానీ ఆ తర్వాత కాలంలో జరిగిన కొన్ని స్వార్థ రాజకీయాల పరిణామల కారణంగా మన రాజ్యాంగంలో లౌకికత్వం, సామ్యవాదం అనేపదాలు చేరాయి.
నిజానికి మొదటిసారి జరిగిన రాజ్యాంగ సభలోనే ఈ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. అప్పటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఫ్రొఫెసర్ కెటీషా రాజ్యాంగంలో లౌకిక, సమాఖ్య, సామ్యవాద లాంటి పదాలను చేర్చాలని మూడుసార్లు సభలో ప్రతిపాదించారు. మొదటి సారిగా 1948 నవంబర్ 15న, రెండవ సారి 1948, ఇక మూడవసారి డిసెంబర్ 3న ప్రతిపాదించాడు. అయితే మూడుసార్లుకూడా రాజ్యాంగ పరిషత్ ఆ పదాలను చేర్చడాన్ని తిరస్కరించింది
సామ్యవాదిగా, లౌకికవాదిగా చెప్పుకునే జవహర్ లాల్ నెహ్రూ కూడా ఆ పదాలను వ్యతిరేకించాడు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా సుముఖత వ్యక్తం చేయలేదు.. దాంతో భారత్ ను అప్పుడు సర్వసత్తాక, ప్రజాస్వామిక రిపబ్లిక్ గా మాత్రమే పిలుస్తూ రాజ్యాంగ పీఠికలో రాశారు. భారతీయ తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకసారి లౌకికవాదంపై మాట్లాడుతూ.. ‘లౌకికవాదం అంటే మతరహిత సమాజం కాదు. మత వ్యతిరేకం కాదు. ప్రాపంచిక సుఖాలు అంతకంటే కాదు. విశ్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక విలువలను విభిన్న మార్గాల్లో అన్వేషించడమే’నని పేర్కొన్నారు.
అయితే ఆ తర్వాత ఎమర్జెన్సీ సమయంలో 1976 జనవరి 3న 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ లో ఎలాంటి చర్చ లేకుండానే, ప్రతిపక్షనాయకులందరూ జైలులో ఉన్నప్పుడు లౌకికవాదం, సామ్యవాదం అనే పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చారు. దాంతో అప్పటి నుంచి భారత్ ను సర్వసత్తాక, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక రిపబ్లిక్ అని పేర్కొంటున్నారు.
ఆ తరువాత క్రమంలో మైనారిటీలు, మెజారిటీలుగా ప్రజలను విడదీశారు. ఆ తరువాత మెజారిటీలను కులాల ప్రాతిపదికన వేరుచేశారు. మైనారిటీలను ఓటుబ్యాంకు రాజకీయం కోసం మతం పేరుతో ఏకంచేశారు. 1993 సంవత్సరంలో ఏకంగా లౌకికత్వాన్నికాపాడటంకోసం మైనారిటీహక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగవిరుద్ధమైన మైనారిటీ కమీషన్ను కూడా స్థాపించారు. రాజ్యాంగం ప్రకారం హిందువులుగా పరిగణింపబడే సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలను మైనారిటీల జాబితాలో చేర్చి`సెక్యులర్ పార్టీ’లు తమ లౌకికత్వాన్నిచాటుకున్నాయి.
అయితే ఈ పదాలు దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలకు తప్ప దేశ మౌలిక అంశాలు కాలేవని ఆ సమయంలో చాలా మంది నిపుణులు తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నేడు ఖలీస్థాన్ రూపంలోనైనా, మిషనరీల రూపంలో అయినా, లేక ఆచారాల ఆధారంగా తాము హిందువులం కాదని ప్రకటించే వివిధ కులస్తులకు సంబంధించిన వివాదాలైనా… వాటన్నింటికీ ఉత్ప్రేరకంగా సెక్యులర్ పదం మారింది. దాని పరిణామాలను నేడు యావత్ భారతదేశం అనుభవిస్తోంది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పదాలను తొలిగించాలంటూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ కార్యరూపం మాత్రం దాల్చలేదు. ఇక ఈ విషయంపై తాజాగా బలరాం సింగ్, కరుణేష్ కుమార్ శుక్లా, విష్ణుశంకర్ జైన్ అనే వ్యక్తులు రెండు సంవత్సరాల క్రితం పిటిషన్ వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం భారతీయులు ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరిస్తే అందులో లౌకికవాదం పదాలు ఎందుకనేది వీరి ప్రశ్న. లౌకికవాదం అనేది రాజ్యాంగ మౌలికభావన ఎలా అవుతుందని వారు తమ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ విషయంపై కోర్టు ఎప్పుడు స్పందిస్తుందో వేచి చూడాలి.
__Vishwa Samvada Kendram