Netaji |
‘ఆజాద్ హింద్’తో నేతాజీ మన్ కీ బాత్
సమాచార విప్లవం తొలితరం పక్రియలలో ముందున్న రేడియో కేవలం వినోద, విజ్ఞాన, సమాచార సాధనంగానే కాకుండా జాతి చైతన్యానికి, ప్రజాసంక్షేమ కార్యక్రమాల వ్యాప్తికి ఆలంబనగా ఉంటోంది. ప్రజలలో స్వరాజ్య కాంక్షను రగుల్కొల్పిన నాటి నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, తమ ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న సంక్షేమ పథకాలు, వివిధ అంశాలను విశ్లేషిస్తూ నేటి ప్రధాని నరేంద్రమోదీ దీనిని వేదికగా చేసుకున్నారు. ఇద్దరి శీర్షిక ఒక్కటే… అదే ‘మన్ కీ బాత్’ (మనసులోని మాట).
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ (మనసులోని మాట) ఆకాశవాణిలో ప్రతి నెల చివరి ఆదివారం హిందీలోనూ, వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమం. ఆయన ప్రధాన మంత్రిగా మొదటిసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం కింద తొలిభాగం (ఎపిసోడ్) 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రసారమైంది. వారం వారం నిరాటంకంగా సాగుతూ వస్తున్న ఈ కార్యక్రమం కింద ఆయన అనేక అంశాలను ప్రస్తావిస్తూ, వాటిపై ప్రజలలో మరింత అవగాహన పెంచడంతో పాటు జనచైతన్యానికి చేయూతనిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా టాంజానియా తోబుట్టువులు ‘కిలీపాల్, నిమా’ భారత జాతీయ గీతాన్ని ఆలపించినందుకు మోదీ వారిని అభినందించడం అందులో ఒక భాగం.
దేశీయులలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చేం దుకు దశాబ్దాల క్రితమే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ మన్ కీ బాత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వరాజ్య సాధనలో భాగంగా, తమ రేడియో ప్రసంగాల ద్వారా ‘వేయిసార్లు అపజయాన్ని చవి చూసినప్పుడు మరోసారి ప్రయత్నించాలన్న ఆశయాన్ని పదేపదే గుర్తుంచుకోండి’ లాంటి సందేశాలను ఇచ్చారు. ‘దేశం కోసం చావడానికి సాహసం చేయకపోతే దేశంలో బ్రతికే హక్కు ఎక్కడిది?’ అని ప్రశ్నించారు.
రేడియో తరంగాలను వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టంగా మార్చడానికి కావలసిన మొదటి ఉపకర ణాన్ని గూగ్లెల్మొ మార్కొని తయారు చేశారు. రెజినాల్డ్, ఎపిస్పెండన్ వైర్లెస్ టెలిఫోన్ పంపిన మొదటి వ్యక్తి కాగా, క్రిస్మస్ ఈవ్ 1906లో పబ్లిక్ వైర్లెస్ ప్రసారాన్ని చేసిన మొదటి వ్యక్తి అయ్యాడు. ఇలా 1910 నాటికి వివిధ వైర్లెస్ సిస్టంలు రేడియోగా వ్యవహారంలోకి వచ్చాయి. భారత జాతీయ ఉద్యమంతో పాటు, అంతర్జాతీయ యుద్ధాల విశేషాలు తెలుసుకునేందుకు రేడియో ప్రధాన సాధనంగా నిలిచింది. చరిత్రకారిణి దియా గుప్తా వ్యాఖ్యానించినట్లు (‘రాజ్ ఇన్ రేడియో వార్స్’) రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రేడియో ప్రసారం అంతర్జాతీయ ప్రచారానికి ఒక సాధనంగా మారింది.
భారతీయులను స్వరాజ్య దిశగా ప్రోత్సహించ డానికి నాజీ జర్మనీలో ఆడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలో 1942 జనవరి 7న రేడియో సేవలను నేతాజీ ప్రారంభిం చారు. దాని ప్రధాన కార్యాలయాన్ని జపాన్ ఆక్రమిత సింగపూర్‌కు, ఆగ్నేయ ఆసియాలో యుద్ధం తరువాత ఒక రహస్య ప్రదేశానికి మార్చారు. నేతాజీ ఆగ్నేయ ఆసియాకు బయలుదేరిన తరువాత జర్మనీ కార్యకలాపాలు ఏసీఎన్ ద్వారా కొనసాగాయి. జర్మనీలోని ఇండియన్ లెజియన్, ఆగ్నేయ ఆసియాలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ కోసం పంజాబీ, పెర్షియన్, ఇంగ్లీష్, హిందీ, తమిళ, బెంగాలీ, మరాఠా భాషలలో వార్తలు ప్రసారం అయ్యేవి.
బెర్లిన్ నుండి చేసిన ప్రసారాలలో బ్రిటిష్ భూభాగాలపై జపాన్ విజయాలను, మన దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం గురించి బోస్ ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. ఆయన నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయాక (1944)కూడా ఏడాది పాటు జర్మనీ, ఆగ్నేయాసియా ప్రసారాలను కొనసాగించారు.
ఆజాద్ హింద్ రేడియో, మిత్ర రాజ్యాల రేడియో స్టేషన్ల ప్రసారాలను ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆజాద్ హింద్ రేడియోను బోస్ బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్‌గా, బ్లఫ్ అండ్ బ్లస్టర్ కార్పొరేషన్‌గా, అల్ ఇండియా రేడియోను యాంటీ ఇండియన్ రేడియోగా పేర్కొన్నారు.
నేతాజీ 1942 ఫిబ్రవరి 28వ తేదీన ఆజాద్ హింద్ రేడియోలో ప్రసంగిస్తూ ‘భారతదేశం స్వాతంత్య్రం పొందే వరకూ బ్రిటిష్ సామ్రాజ్య వాదంతో పోరాడుతూనే ఉంటాం. ప్రపంచ చరిత్రలోని ఒక కూడలిలో నిలబడి భారతదేశం లోనూ, విదేశాలలోని స్వాతంత్య్ర ప్రియుల తరపున ఇలా గంభీరంగా ప్రకటిస్తున్నాను’ అని చెప్పారు.
తెల్లదొరల కబంధ హస్తాల నుండి భారత మాతకు విముక్తి కలిగించేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన మహానేత నేతాజీ ‘పిరికి మాటలు మాట్లాడకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకాలవుతాయి. ఎదుటి వారికి పిరికితనం నూరిపోస్తే మీరు పిరికివారవుతారు’ అని ఉద్బోధించారు. ‘మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. స్వేచ్ఛను ఎవరు ఇవ్వరని, మనకు మనమే తీసుకోవాలని కర్తవ్య బోధ చేశారు.
‘స్వేచ్ఛలోని ఆనందాన్ని, స్వాతంత్య్రపు ప్రశాంతతను అభిలషిస్తున్నావా? అయితే నీవు వాటి ఖరీదు (బాధ, త్యాగం) చెల్లించవలసిందే. స్వేచ్ఛ కోసం నీవు చెల్లించవలసిన మూల్యం ఇవే’ అన్నారు.
‘సిద్ధాంతం కోసం ఒక మనిషి తన ప్రాణాన్ని కోల్పోవచ్చు. అయితే ఆ సిద్ధాంతం అతడి మరణం తరువాత వేలాది మందిలో స్ఫూర్తిని నింపుతుంది. కోట్లాదిమంది ప్రజానీకానికి మేలు చేస్తుంది’ అనేవారు వారు నేతాజీ.
అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందన్న నమ్మకంతో గాంధీజీ మొదలయిన నాయకులు పోరాటం సాగించగా, సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుండి తరిమి కొట్టవచ్చని ప్రగాఢంగా విశ్వసించిన బోస్ తమ వ్యూహాన్ని ఆచరణలో పెట్టారు. రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షునిగా ఎన్నికైన ఆయన, గాంధీజీతో సిద్ధాంత పరమైన విభేదాల కారణంగా ఆ పదవికి రాజీనామా చేశారు. 1939లో మొదలైన రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆంగ్లేయులను దెబ్బ తీయడానికి సువర్ణావకాశంగా భావించారు. వారిని ఎదిరించేందుకు కూటమిని ఏర్పాటు చేసేందుకు రష్యా, జర్మనీ, జపాన్ దేశాలు పర్యటించారు. జపాన్ సహాయంతో భారతీయ యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు
జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక ఆర్ధిక, దౌత్య సహకారంతో సింగపూర్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బోస్ రాజకీయ అభిప్రాయాలను, జర్మనీ, జపాన్‌తో ఆయన అనుసరించిన మిత్రత్వంపై చరిత్రకారుల్లో భిన్నాభి ప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే మరికొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోస్‌ను అభిమానిస్తారు.
కటక్‌లో 1897 జనవరి 23న జన్మించిన నేతాజీ మరణం వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారని బ్రిటిష్‌వారు ప్రకటించి నప్పటికీ ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లారని అనేకులు నేటికీ నమ్ముతారు. ఆ తారీఖున తైవాన్‌లో విమాన ప్రమాదం జరగలేదని తైవాన్ ప్రభుత్వం ప్రకటించింది.
కటక్‌లోని ఆయన పూర్వీకుల ఇంటిని ‘నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మ్యూజియం’గా మార్చారు. అందులో బోస్ రేడియో పునర్మితమైంది. దాని కార్యక్రమాలు, ఆయన చేసిన ప్రసంగాలు ప్రసార మవుతున్నాయి. ఈ ప్రదర్శన శాల పునః సృష్టి మంచి ప్రయత్నమని రంగూన్ మ్యూజియం క్యూరేటర్‌గా చేసిన జేపీ దాస్ అభివర్ణించారు.
నేతాజీ చివరి రోజులను కుట్ర సిద్ధాంతాలు కప్పివేసినా ఆయనకు ఒకే ఒక కల ఉండేది, అదే ‘‘ఆజాదీ’’.
ఆధారం:
‘‘రాజ్ ఇన్ రేడియో వార్స్’’ పేపర్ ప్రజంటేషన్ బై దియా గుప్తా
– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు