‘Cast’ System - Western Christian Foundations |
ఈ వ్యాసం తాలూకూ మొదటి మూడు భాగాలూ గత మూడు వారాలలో ప్రచురితమయ్యాయి. “’కాస్ట్’ వ్యవస్థ – పాశ్చాత్య క్రైస్తవ పునాదులు” వ్యాసంలో ఇది నాల్గవ, చివరి భాగం. పాఠకుల ఆకాంక్ష మేరకు రేపు పూర్తి వ్యాసాన్ని ప్రచురించానున్నాం.
ప్రొటెస్టెంట్ ల అభిప్రాయం :
హిందువులను, వారి హీనమతాన్ని కలిపి ఉంచినదేమిటో క్రైస్తవ మేథావులకు ఒక పట్టాన అర్ధం కాలేదు. ఎట్టకేలకు కలిపి ఉంచింది ‘కాస్ట్’ అని వారు తేల్చారు.
“కాస్ట్” హిందూ వ్యవస్థలో విడదీయరాని అంతర్భాగం. దానిని మతం అని పిలవబడుతున్న దాని నుండి ఏమాత్రం వేరు చేసినా హిందూయిజం ఒక పెద్ద గందరగోళంలోకి నెట్టివేయబడుతుంది. ‘కాస్ట్’ తప్ప హిందువులందరికీ సర్వసాధారణమైన అంశం మరొకటి లేదు కాబట్టి ఈ కీలకమైన వ్యవస్థే లేకపోతే, హిందూమతం దానంతట అదే కుప్పకూలుతుందని వారు భ్రమించారు. ‘కాస్ట్’ అనేది హిందూమతంలో ఒక పవిత్రమైన వ్యవస్థగా వారు భావించారు. దానితో ‘కాస్ట్’ను హిందువుల మత, సామాజిక వ్యవస్థల సహజ లక్షణంగా (Structural Property) వారు పేర్కొనటం మొదలెట్టారు.
క్రైస్తవ దృష్టికోణం ప్రకారం…. మత విధులకు, వ్యవహార విధులకు మధ్య తేడా ఉంది. మతానికి సంబంధించిన విశ్వాసాలు, విధులు దేవుని వల్ల నిర్దేశింపబడితే, వ్యవహారవిధులు మానవులచే నిర్ణయింపబడుతాయి. కనుక మత, వ్యవహార లేక పౌరవ్యవస్థలు వేరు వేరు. క్రైస్తవ సంస్కర్తలు లూథర్, కాల్విన్ ప్రకారం మానవుల అధికారం కేవలం రాజకీయ వ్యవహార విధులకే పరిమితమని, మత విషయాలకు సంబంధించి వారికెట్టి అధికారమూ లేదని చర్చి చట్టాల (Canon Laws)కు ఎట్టి ప్రాముఖ్యతా లేదని సూత్రీకరించారు. చర్చి, దాని అధికారులు భూమి మీద భగవంతుని ప్రతినిధులు కారు కనుక భగవంతుని ఉద్దేశ్యాలకు, లక్ష్యాలకు వారు భాష్యకారులు కాదని, కనుక మతాధికారులు చేసిన చట్టాలకు ఎట్టి విలువా లేదని తేల్చారు.
ప్రొటెస్టెంటు క్రైస్తవ మేధావులు ఈ విమర్శను హిందూమతానికి కూడా వర్తింపజేశారు. ‘కాస్ట్’కు సంబంధించిన వ్యవహార విధులకు (Civil Laws of Caste) భగవదనుమతి ఉందని చెప్పి, బలవంతంగా సంఘం మీద రుద్దారని వారు తేల్చి, ‘కాస్ట్’ కు లేని జవసత్వాలను దానికి కలిగించబడినవని వారన్నారు. అకారణంగా దాని అనైతిక విధినిషేదాజ్ఞల వలన ఎప్పుడో కుప్పకూలవలసిన కాస్ట్ తరతరాలుగా కొనసాగుతుందని వారు సిద్ధాంతీకరించారు.
ప్రొటెస్టెంటు క్రైస్తవ మత ప్రచారకుల ఉద్దేశంలో క్రైస్తవీకరణకు కులం పెద్ద ప్రతిబంధకమైంది. హిందూమతస్థులను కలిపి ఉంచింది. సువార్తను ప్రకటించినప్పటికీ పెద్ద ఎత్తున క్రైస్తవంలోకి ప్రజలను ఆకర్షించలేకపోవటానికి ప్రధాన కారణం కులమని వారు ప్రగాఢంగా అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయమే ‘కులం’ను మతంలో భాగంగా చేయటానికి వారిని పురికొల్పింది. హిందూమతంలో కులం అంతర్భాగమని, విగ్రహారాధకుల హీనమతంలో కులమే ప్రధానమైన అంశమని సిద్ధాంతీకరించటానికి, ప్రచారం చెయ్యటానికి దారి తీసింది.
ప్రొటెస్టెంటు క్రైస్తవశాఖది పైచేయి అయిన తర్వాత, పాశ్చాత్య క్రైస్తవ మిషనరీలు, వలసవాదులు, క్రైస్తవ పండితులు భారత దేశపు సమాజాన్ని అధ్యయనం చేసి, ఒక కొత్త భావ సముదాయానికి రూపకల్పన చేశారు. అదే “కాస్ట్ సిస్టమ్”. హిందువుల గురించిన వివిధ భావనల సమగ్ర సముచ్ఛయమది. దాని ప్రకారం హిందువుల జాతి యూదు జూతియొక్క రూపాంతరం తప్ప వేరుకాదు; బ్రాహ్మణ పురోహితవర్గం, వారి పద్ధతులు అసత్యమతానికి సంకేతాలు; వారి పద్ధతులు, సంప్రదాయాలు ఇతర అసత్యమతాలైన కాథలిక్, యూదు మతాలను పోలి ఉన్నాయి; వారిచే కల్పించబడి, అనుసరింపబడుతున్నవన్నీ దైవాజ్ఞల పేరుతో చలామణి అవుతూ విశ్వాసులను మోసం చేస్తున్నాయి; బాహ్య కర్మకాండ, అర్ధంపర్ధం లేని శుచి, అశుచుల చుట్టూ హిందూమతం పరిభ్రమిస్తూంటుంది; మతంలో వాటికే అత్యంత ప్రాముఖ్యత.
బ్రాహ్మణ పురోహిత వర్గం సమాజంలో సర్వోత్కృష్ట స్థానంలో ఉందని వాస్తవాలు పూర్తిగా విచారించకుండానే మిషనరీలు, వలసదారులు ప్రచారం చేశారు. హిందువుల పురోహితవర్గం వారిమత జీవితాన్నే కాక, సామాజిక జీవితాన్ని సైతం తమ గుప్పెట్లోకి తెచ్చుకోగలిగారని, పౌరస్మృతులు అంటే సామాన్యప్రజలు నిత్యజీవితంలో పాటించవలసిన విధి నిషేధాలను మోసపూరితంగా దైవాదేశాల పేరుతో సంఘం మీద రుద్ది మత జీవితానికి, ప్రజలనిత్య జీవితానికి మధ్య తేడా లేకుండా చేశారని వారు ఆరోపించారు. దీనినే వారు “స్కీమ్ ఆఫ్ కాస్ట్” అన్నారు. పౌర చట్టాలను (Civil laws) మతాన్ని కలగాపులం చేసి దేవుడే స్వయంగా చెప్పాడని ప్రచారం చేసి, ప్రాబల్యం సంపాదించుకొన్నారని నిందించారు. 1850లో జరిగిన మద్రాసు మిషనరీ కాన్ఫరెన్సు వారు కులం గురించి దశాబ్దాలపాటు కొనసాగిన వివాదానికి ముగింపు పలుకుతూ ఈ క్రింది తీర్మానం చేసింది.
“హిందువుల ప్రత్యేకత అయిన కాస్ట్ పుట్టుక పవిత్రత, అపవిత్రత (Birth Purity and Impurity) మీద ఆధారపడింది. ఇది నూటికి నూరుపాళ్ళూ మతానికి సంబంధించిన వ్యవస్థ. అంతేకానీ కేవలం లౌకిక భేదంకాదు. మనువు, ఇతర ధర్మశాస్త్రాల ప్రకారం ప్రజలను నాల్గు విభాగాలుగా విభజింపబడటాన్ని దైవనిర్ణయంగా భావించారు. ఈ కాలపు హిందువులు తమ కాస్ట్ ను కోల్పోవటం, కాపాడాలనుకోవటం మీదే ఆధారపడి తమ భవితవ్యం ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు.”
ప్రొటెస్టెంటు క్రైస్తవం వ్యాప్తి చెందాక విశ్వాసులు తమ పాత మత, కుల చిహ్నాలను పూర్తిగా వదిలి పెట్టాలని తీర్మానించారు. 1850ల నాటికి దేశంలో ప్రొటెస్టెంటు క్రైస్తవ మిషనరీలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. పాత మత సంప్రదాయలతో పాటుగా, కులాచారాలు, కట్టూబొట్టును పూర్తిగా వదలి వేసినప్పుడే, క్రీస్తు పట్ల విశ్వాసం ప్రకటించినట్లుగా భావించాలని తీర్మానించారు. దానితో ప్రొటెస్టెంటు మతంలో చేరిన వారు తమ కట్టుబొట్లు తీసివేయవలసి వచ్చింది. కాథలిక్కులకు అట్టి పట్టింపు లేదు కనుక వారు వాటిని నిలుపుకోగలిగారు.
హిందువులది మతంకాదు:
మిషనరీల దృష్టిలో హిందువుల మతానికి మతం అనే పేరుకే అర్హత లేదు. వీరు అనుసరిస్తున్న ఒక పెద్ద గందరగోళ విధానాన్నే వారు మతం అని అనుకుంటున్నారని మిషనరీలు అభిప్రాయపడ్డారు. మతానికి ఉండవలసిన ప్రాథమిక లక్షణాలు – ఒక ప్రవక్త, ఒక ఉమ్మడి దైవగ్రంథం, మతస్థులకు మార్గదర్శనం చేసే ఒక మతాధికారుల వ్యవస్థ హిందూ మతానికి లేవు. భిన్నభిన్న సంప్రదాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు సంప్రదాయాలతో ఎవరికి తోచిన విధంగా వారు నడుచుకొనే స్వేచ్ఛ ఇచ్చినది మతం ఎలా అవుతుందన్నది వారి ప్రశ్న. హిందువుల మతం పాశ్చాత్యులు నిర్వచించిన మతానికంటే విస్తృతమైనదన్న ఆలోచన వారికి రాలేదు. ఇతరమతాలు – ఇస్లాం, క్రైస్తవం, జూడాయిజం వారి నిర్వచనానికి లోబడి ఉన్నాయి. వారి దృష్టి కోణం నుంచే హిందువుల ఆరాధనా పద్ధతులను చూసి, హిందువులది మతం కానే కాదని తీర్మానించటమే కాక హిందువులను అవహేళన చేశారు. అవమానపరచారు. భారతదేశం విగ్రహారాధకులుండే దేశంగానూ, వారి జాతిని ‘Nation of Castes’ గాను అభివర్ణించారు.
హిందువులు ఆచరిస్తున్న మతం వారిదృష్టిలో మతం కాకపోయినప్పటికీ, ఎన్నో వేల సంవత్సరాల నుండి అప్రతిహతంగా సాగుతున్నది. ‘మతాని’కి ఉండవలసిన ప్రాథమిక లక్షణాలు లేకపోయినప్పటికీ, కాలానికి తట్టుకొని హిందూ విశ్వాసాలు, ఆరాధనాపద్ధతులు సజీవంగా నిలిచి ఉన్నాయి. కనుక లోతుగా అధ్యయనం చేసినట్లుయితే హిందువులను ఒక జాతిగా కలిపి ఉంచినదేమిటో వారికి అవగతం అయ్యేది. కానీ వారి లక్ష్యం అదికాదు. క్రైస్తవాన్ని హిందూ దేశంలో వ్యాప్తి చెయ్యటమే వారి ఉద్దేశ్యం. ‘విగ్రహారాధకుల హీనమతం’ స్థానే క్రీస్తుమతస్థాపనే లక్ష్యంగా వారి అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయి. వారి అవగాహన లోపంవల్ల హిందూ సంఘంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని, హిందువులకు తాత్విక చింతన లేదని వారు అనుకున్నారు. వారి అవగాహన లేమిని హిందువులపైకి నెట్టారు. వారి నిర్వచనాలకు లొంగలేదు కాబట్టి హిందువులది మతమే కాదు పొమ్మన్నారు. వారియొక్క ఆ దృష్టికోణము, అభిప్రాయమే వారు హిందువుల మతాన్ని “ఒక పెద్ద గొందరగోళంగా” “ఒక పెద్ద కీకారణ్యంగా”, “ఒక పెద్ద మర్రిచెట్టుగా” అభివర్ణించటానికి దారి తీసింది.
‘కాస్ట్’ వ్యవస్థ గురించి ఈ ప్రొటెస్టెంట్ల భావనలే నిలిచాయి తప్ప ఇతరుల భావనలకు తగినంత ప్రాచుర్యం లభించలేదు. ‘కాస్ట్’ వ్యవస్థ గురించి ఈనాటికి కూడా చర్చంతా క్రైస్తవ మేథావులు, మత ప్రచారకులు ప్రతిపాదించిన సిద్ధాంతాల చుట్టే పరిభ్రమించటం విచారకరం. ఈ దురుద్దేశపూరిత సిద్ధాంతాలను ప్రశ్నించవలసిన సమయం వచ్చింది. స్వతంత్ర అధ్యయనాల ద్వారా మన సమాజంలోని వివిధ వ్యవస్థలను భారతీయకోణం నుంచి పరిశీలించటానికి తగినంత కృషి జరగాలి. మన భారతీయ మేథావులు పాశ్చాత్య మేథావులను గ్రుడ్డిగా అనుకరించటం మాని స్వతంత్రంగా పరిశోధనలు చేసి వాస్తవాలను వెలికి తీయాలి.
– డాక్టర్ బి. సారంగపాణి - విశ్వసంవాద కేంద్రము