సామాజిక సమరసత ! |
సామాజిక సమరసత ఉపన్యాసాలతో వచ్చేది కాదు....
(నాగపూర్ నాగరిక సహకారీ బ్యాంక్ ఆధ్వర్యంలో బాళాసాహెబ్ దేవరస్ శతజయంతి సందర్భంగా ఫూజనీయ మోహన్ భాగవత్ ఉపన్యాసం 16-12-2015)
మనదేశంలో సామాజిక అసమానతలను రూపుమాపాలనే ప్రయత్నాలు గతకొన్ని దశాబ్బాలనుండి జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్రం పూర్వంనుండి అనేకమంది వ్యక్తులు, సంఘసంస్కర్తలు, ఆలోచనాపరులు, సామాజిక కార్యకర్తలు, తత్త్వవేత్తలు గట్టి ప్రయత్నమే చేశారు. అయితే వారి కృషి పూర్తిగా ఫలించిందని చెప్పలేము. కులవైషమ్యాలు తగ్గి, ఏ మాత్రమూ వివక్షలేని సమాజంగా మన సంఘం రూపాంతరం చెందిందని గట్టిగా చెప్పలేము. గణనీయమైన మార్పు వచ్చినమాట వాస్తవం. ఇంకా చేయవలసింది, సాధించవలసింది చాలా ఉంది.
సామాజిక సమరసత ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. ఏదేశమైనా అత్యున్నతస్థాయికి చేరుకోవాలంటే ముందుగా కావలసింది ఆ దేశపు ప్రజలలో ఐక్యత. ఐకమత్యమే బలం. ఐకమత్యంతోనే ప్రగతి సాధ్యం. ప్రజలమధ్య సామరస్యం ఉంటే ఐకమత్యం దానంతట అదే నెలకొంటుంది. కనుక సామరస్యం ముందుగా సాధించవలసిన అత్యంత అవసరమైన అంశం. అసమానతలతో, అంతరాలతో ఛిన్నాఖిన్నమయిన సమాజం ఎన్నటికీ ప్రగతిమార్గాన పయనించలేదు. పూర్వవైభవాన్నిపొందలేదు. అందుకే సామాజిక సమరసతకు అంత ప్రాముఖ్యం. ఈ సందర్భంగా అబ్రహాం లింకన్ మాటలను మనం గుర్తుచేసుకోవాలి " A house divided aganist itself cannot stand".
నూటికి నూరుపాళ్ళు సమానత్వం సాధించటం ఏ సమాజంలోనైనా సాధ్యంకాదు. ఎందుకంటే ప్రతిభాపాటవాల్లో వ్యక్తివ్యక్తికి తేడాలుంటాయి. ప్రత్యేకమైనవాడే. శక్తియుక్తులలో కొట్టవచ్చినట్లు కన్పించే తేడాలు సహజసిద్ధంగానే ఉండేవి. ఆ తేడాలవల్ల ఏర్పడే అసమానతలుగురించి మనం ఎక్కువ ఆందోళన చెందవలసిన పనిలేదు. పుట్టుక కారణంగా, సామాజిక నేపథ్యం కారణంగా మన సమాజంలో కొనసాగుతున్న సామాజిక అసమానతలగురించే మన ఆందోళన, ఆవేదన అంతా.
వివిధత్వంలో ఏకత్వం-భారతదేశపు విశేష లక్షణం
అటువంటి అసమానతలను, అంతరాలను రూపుమాపటానికి మనం చేయవలసిన మానవ ప్రయత్నమంతా తప్పక చేయాలి. మనం చేస్తున్న ఈ కృషిలో మనం తప్పక విజయం సాధించాలి. మన సంకల్పం కారణంగా, కృషి కారణంగా సామాజిక అసమానతలు తగ్గినప్పుడే మనదేశం ఆర్థికంగా, సామాజికంగా ముందడుగు వెయ్యగల్గుతుంది. సుసంపన్నదేశంగా, దృఢమైన సమాజంగా వెలుపటి సవాళ్లను లోపటి సవాళ్లను ఎదుర్కొనగల్గుతుంది. అయితే సామాజిక అసమానతలను, రూపుమాపటం అంత తేలికైన విషయంకాదు. ఎంతో పెద్ద దేశం మనది. ఎంతో వైవిధ్యంగల దేశం కూడా. సహజసిద్ధంగా ఏర్పడే అసమానతలతోపాటు, భిన్నత్వం కారణంగా కూడా ఎన్నో అసమానతలు నెలకొన్న దేశం మనది.
మన కుటుంబాలనే తీసుకోండి. కుటుంబంలోని అందరు సభ్యులూ ఒక్కలా ఉండరు. ఒకేలా ఆలోచించరు. కొందరికి చదువు బాగా వస్తుంది. కొందరికి బాగా సంపాదించే సత్తా ఉంటుంది. మరికొందరు ఇతరులమీద ఆధారపడేవాళ్ళుగా ఉంటారు. అయినా అందరిమధ్య ప్రేమాభిమానాలు ఉంటాయి. వారిమధ్య ఉండే స్వల్పమైన తేడాలకు వారు విలువయివ్వరు. తేడాలు ఉన్నా ఒకే మాటమీద ఉంటారు. ఒకే బాటలో నడుస్తారు. ఒకే కుటుంబానికి చెందినవారమనే భావనతో కుటుంబ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారు జీవనం కొనసాగిస్తుంటారు. సమానత్వం ఆధారంగానే కుటుంబ సభ్యులమధ్య సంబంధబాంధవ్యాలు నెలకొని ఉంటాయి.
వెల్లివిరిసే సమత, మమతలే ఒక సంతోషకర కుటుంబంయొక్క కీలకబలం. అలాంటి కుటుంబంలో సభ్యులమధ్య భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ప్రతివారికి కనీన అవనరాలు ఉంటాయి. ఆకాంక్షలు ఉంటాయి. కాని అందరూ కుటుంబ శ్రేయస్సుకోసమే పనిచేస్తుంటారు. బరువు బాధ్యతలను ఉమ్మడిగా భరిస్తారు. పరస్పర సమరసతతో, సహకారంతో ఒకరికోసం అందరూ, అందరికోసం ఒక్కరూ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు.
భిన్నత్వం మరియు ఐక్యత
వైవిధ్యానికి మారుపేరు మనదేశం. భాషలో, సంప్రదాయాల్లో, రుచుల్లో, అభిరుచుల్లో, ఆహారపు అలవాట్లలో, వాతావరణ పరిస్థితులలో, సామాజిక పరిస్థితులలో, దైవారాధన పద్ధతులలో అంతా వైవిధ్యమే. అంతా భిన్నత్వమే. మరే ఇతర దేశంలోనూ ఈ స్థాయిలో వైవిధ్యం ఉండదు. ఈ వైవిధ్యాన్ని మనం కాపాడుకోవాలి. వైవిధ్యం ఒకరకంగా మనకు దేవుడిచ్చిన వరం. అయితే వైవిధ్యం ఐకమత్యాన్ని దెబ్బతీయకూడదు. ఐకమత్యాన్ని దెబ్బతీయాలనుకొనే శక్తులు వైవిధ్యాన్ని ఆధారంగా చేసుకొని వేర్చాటువాదనలు చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టుతున్నారు. భాషపేరుతోనో, కులంపేరుతోనో, మతంపేరుతోనో, సాంప్రదాయంపేరుతోనో వేర్చాటుభావనలను రెచ్చగొట్టి మన భిన్నత్వంలోని ఏకత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. వారిపట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. మన వైవిధ్యాన్ని కాపాడుకోవటానికి, సమాజాన్ని ఐక్యంగా ఉంచటానికి మనం చేస్తున్న కృషిని కొనసాగించాలి. ఎదుటివారి ఆచార్యవ్యవహారాలను, సాంప్రదాయాలను జీవనసరళిని, అవి మనకు భిన్నంగా ఉన్నప్పటికీ, గౌరవించటాన్నీ మనం నేర్చుకోవాలి. సమానత్వం ప్రాతిపదికగా ప్రతి వ్యక్తి ఎదుటివ్యక్తులను గౌరవించటం, వారి ఆకాంక్షలను, ఆశలను అర్ధంచేసుకోవటం చాలా అవసరం.
మనదేశంలో విభిన్న కులాలు ఉన్నాయి. ప్రతి కులంలోనూ అనేక ఉపకులాలు ఉన్నాయి. కులవివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాజిక సమరసత సాధనదిశగా కుల వివక్షను రూపుమాపటం అనేది మనముందు ఉన్న పెద్ద సవాలు, కులవివక్ష పెద్దపెట్టున ఉన్న విషయం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవగతం అవుతుంది. అయితే చాలామంది ఈ వాస్తవాన్ని చూడటానికి నిరాకరిస్తున్నారు. నిరాకరణ, తిరస్కారం సమస్యను దాటవేసే ధోరణే తప్ప సమస్యకు పరిష్కారంకాదు. కులవివక్ష ఉంది కాని, తీవ్రమైన స్థాయిలోలేదని కొందరు అంటుంటారు. అయితే అలాంటి ఆలోచనాధోరణులు (నిరాకరణ, తిరస్మరణ ధోరణులు) అనారోగ్యకరమైనవి. అలాంటి ధోరణులవలన సామాజిక అసమానతలకు, కులవివక్షతకు సమర్ధకులుగా మనకు ముద్రవడుతుంది. కొద్దిమంది దాటవేసేవారివల్ల, అనలు నమస్యే లేదనే తిరస్కారవాదులవలన సమస్య తీవ్రతను అర్ధం చేసుకోలేకపోవటమూ జరుగుతుంది. అంతేకాక కొందరు రాజకీయనేతలు సమస్యను తమ స్వప్రయోజనంకోసం వాడుకొని ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టుతున్నారు. నమస్యను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో తీవ్రమైన కృషి జరగనప్పుడు, కులవివక్షవలన బాధితులైనవారు మిగిలిన సమాజంపట్ల తీవ్ర ఆగ్రహవేశాలను వ్యక్తపరుస్తుంటారు. వారి ధర్మాగ్రహానికి అర్థమూ. ఉంది. ఆధారమూ ఉంది.
ప్రాధమ్మాలలో తేడాలు
స్వాతంత్ర్యోదమకాలంలో కొందరు నాయకులు రాజకీయ స్వాతంత్రానికే ప్రాధాన్యం యిచ్చారు. రాజకీయంగా స్వేచ్చ లభిస్తే మిగిలిన సమస్యలను ఆ తర్వాత పరిష్కరించవచ్చునని వారు భావించారు. మరికొందరు మతం, సంప్రదాయం ఆధారంగా అసమానతలను సమర్థించే ప్రయత్నం చేశారు. మరికొందరికి అప్పటి పరిస్థితి అనుకూలంగా ఉండి యథాతథవాదులుగా ఉండిపోయారు. కుల సమస్యను పరిష్కరించాకే స్వాతంత్ర్యంగురించి ఆలోచిద్దామని అన్నవారూ ఉన్నారు. అయితే మన ఆధ్యాత్మిక సిద్ధాంతాలను, ఆచార్యుల ప్రవచనాలను, భాగవతాది గ్రంథాలను పరిశీలిస్తే కులవివక్షకు ఎలాంటి ఆమోదం లేదని తెలుస్తుంది. అద్వైతం పుట్టిన భూమిలో అసమానతలకు తావులేదు. కులాలు, వాటి కారణంగా ఏర్పడిన హెచ్చుతగ్గులూ కొందరు. స్వార్ధవరులు సృష్టించి నమాజంమీద రుద్దినవే. స్వప్రయోజనపరులు మతంపేరుతో ఎప్పటికప్పుడు అసమానతలను సమర్థిస్తూ వచ్చారు. వాటికి కొత్తఊపిరిని పోస్తూ వచ్చారు. తమ భావాలను స్మృతులలో చొప్పించి, వాటి ఆధారంగా, అసమానతల కొనసాగింపుకు తగిన ఉటంకింపులను యిస్తూ వచ్చారు. దేనికైనా ధర్మమే గీటురాయి.
ధర్మాన్ని అనుసరించే అన్నీ నడవాలి. ధర్మం అంటే ఏమిటని ఆంబేడ్మర్ వ్రశ్నించారు. ధర్మానికి మూలం ఏమిటి? ధర్మానికి, సంప్రదాయాలకు తేడా ఉంది. మన జీవనానికి అవసరమైన మౌలిక సూత్రాలు ధర్మమయితే, కాలానుగుణంగా మార్చుచెందే స్మృతులు ఆధారంగా ఏర్పదేవే సంప్రదాయాలు. మౌలికసూత్రాలకు విరుద్ధంగా ఉండేదంతా. అధర్మమేనని అంబేత్కర్ చెప్పాడు. ఆయన హితోపదేశాన్ని స్వీకరించటానికి ఆనాటి స మాజం సిద్ధంగాలేదు. ఆయన మాట విని ఉంటే ఈనాడు మనం చూస్తున్న సామాజిక రుగ్మతలు, సామాజిక అసమానతలు ఈపాటికి సమసిపోయి ఉండేవి. భారతదేశపు అత్యున్నత ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఒక సాధారణ లక్షణం కన్పడుతుంది. సత్యాన్వేషణ వాటి లక్ష్యం. సత్యం చుట్టూనే అవి తిరిగాయి. మూలం ఒక్కటే అయినా వేరువేరు మార్గాల ద్వారా ఆ మూలాన్ని చేరుకోవటానికి అవి గట్టి పునాదులు వేశాయి. దేవుడు, ఆత్మ, పునర్జన్మ గురించి ఒక్కో సంప్రదాయం ఒక్కోరకంగా చెప్తుంది. కాలక్రమంలో సత్యాన్వేషణ స్థానంలో మిగిలిన విషయాలు ప్రధానమైనాయి. బుషులు చూపిన మార్గాన్ని విడనాడి, సిద్ధాంత రాద్ధాంతాలు పెరిగాయి. ప్రగతినిరోధక భావాలు సంప్రదాయాల రూపంలో
తిష్టవేయసాగాయి.
"వసంతవ్యాఖ్యానమాలి" ఉపన్యాసంలో పూ. బాళాసాహబ్ స్పష్టీకరణ
మన సంప్రదాయాలను, పద్ధతులను విశ్లేషించి శాస్త్రీయ, హేతుబద్ధ కొలమానాలకు నిలిచే వాటిని మాత్రమే అట్టిపెట్టుకొని అనుసరించాలని, మిగిలినవాటిని, గంగలో కలిపివెయ్యాలని స్వామి వివేకానంద అనేక సందర్భాలలో మార్గదర్శనం చేశారు. పూర్వ సర్‌సంఘచాలకులు పూజనీయ బాలాసాహెబ్ దేవరస్ అంటరానితనం పాపమనీ, అది పాపం కాకపోతే, మరేది పాపం కాదని, అలాంటి అమానవీయ పద్ధతులకు సమూలంగా స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారని మీఅందరికీ జ్ఞప్తి ఉండి ఉంటుంది.
మతంపేరుతో మనదేశంలో రెండువేల సంవత్సరాలకుపైగా అనుసరిస్తున్న పద్ధతులకు ఎలాంటి శాస్త్రీయతలేదు. హేతుబద్ధతాలేదు. సనాతన ధర్మానికి పూర్తిగా వ్యతిరేకమయినవి, భిన్నమయినవి మతంపేరుతో చలామణీ అవుతున్నాయి. కులవివక్ష అలాంటిదే. మన సంఘంలో పెద్ద అంతర్భాగమైనవారిని, వ్యవసాయం మరియు ఇతర ఉత్పత్తి, ఉత్పాదన కార్యక్రమాల్లో పెద్ద భాగస్వాములైనవారిని, మన ధనమానప్రాణాల రక్షణకై మనతరవున నిలబడి పోరాడినవారిని సుదీర్హకాలం తక్కువవారుగా, అంటరానివారుగా చూశాము. దళితులను సంఘ బహిష్కృతులను చేశాము. ఎంతో అమానుషమైన, గర్హనీయమైన మన ప్రవర్తనను ఏ విధంగా సమర్థించుకొంటాం? అనాగరికమైన, అమానుషమైన ఈ చర్యలు పూర్తిగా ధర్మ విరుద్ధమైనవి. ధర్మానికి వ్యతిరేకంగానే మిగిలిన సమాజం వారిపట్ల ప్రవర్తించింది. సామాజిక వివక్షను సమర్థించటానికి కొన్ని స్మృతులను ఆధారం చేసుకొన్నాం. స్మృతులు అనేవి సర్వకాలాలకు వర్తించేవికావు. కాలానుగుణంగా స్మృతులను సవరిస్తూ ఉందాలి. కాలంచెల్లిన స్మృతులను పట్టుకొని, సాటి మానవులను హీనంగా చూపే అధర్మవర్తనకు ఒడిగట్టాం. కొన్ని తరాల క్రితం ఈ ఆమానుషధోరణి మొదలైంది. అది కొనసాగింది. సంప్రదాయమైంది. సంప్రదాయమైంది కనుక ఈ చర్యలను సమర్థించకూడదు. సంప్రదాయాలు ప్రళ్నించటానికి, ధిక్కరించటానికి వీలుకానివి ఏమీకావు. సంప్రదాయంగా ఏదైతే వస్తున్నదో అదంతా మంచికాదు. 'కొత్తవన్నీ తప్పు. పాతవన్నీ ఒప్పు అని భావించకూడదు. కొత్తవైనా, పాతవైనా ధర్మానికి అనుగుణంగా ఉండేవాటినే స్వీకరించాలి. సామాజిక వివక్ష అనేకరూపాల్లో కొనసాగుతున్నది. సహేతుకంగాని, ఏరకం గాను, సమర్థనీయంకాని ఈ అమానుష పద్ధతులను ఇకపై కొనసాగనివ్వకూడదు. చర్చలు, వ్యాఖ్యానాలు, విశ్లేషణలు, ప్రసంగాలవల్ల పరిస్థితులు చక్కబడవు. చర్చలుమాని చర్యలు చేపట్టాలి. ఉపన్యాసాలకంటే ఉపయోగపడే పనులు చెయ్యాలి.
ఎలాంటి చర్యలు చేపట్టాలి?
మన హృదయాలనుండి, ఆలోచనలనుండి ఎక్కువ, తక్కువ అనే భావనలను తుడిచివెయ్యాలి. కులాలు ఉన్నమాట నిజం. కాని వాటి అవసరంలేదు. కులం ఆధారంగా ఎలాంటి వివక్షకు మనం పాల్పడకూడదు. మనమందరం భారతమాత బిడ్డలం. ఆ తల్లి బిడ్డ్దలందరూ ఆతల్లి దృష్టిలో, దైవందృష్టిలో సమానులే. ఎవ్వరూ ఎక్కువకాదు. ఎవ్వరూ తక్కువకాదు. జన్మ కారణంగా అధికులు, అల్పులు ఎవ్వరూ లేరు. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో జన్మిస్తాడు. అతను ఫలానా కుటుంబానికి చెందినవాడని గుర్తింపు వస్తుంది. అంతకుమించి ఆ కుటుంబ సామాజిక వర్గంతో ఆవ్యక్తి అస్తిత్వం ముడిపడి ఉండకూడదు. మనందరం ఒక్కటే. మనందరం సమానులమే. ఎందుకంటే మనందరం మానవులం కనుక. సమానత్వానికి ఇంతకంటే ఏం ప్రాతిపదిక కావాలి? అది అంత చిన్న విషయం.
మనం చెయ్యవలసిందల్లా ఆ రకమైన భావనలను వ్యాప్తిచెయ్యాలి. ఈ మేలుకొలుపు ముందు మన ఆలోచనలలో, ప్రవర్తనలో, సాటివారితో మన సంబంధాల్లో కన్పించాలి. ఉపన్యాసాలు, చర్చలవల్ల మార్పు రాదు. ఆ కోణంనుంచి చూస్తే నా ప్రసంగం కూడా వ్యర్థమే. కొన్ని దశాబ్దాల క్రితం పూజనీయ బాలాసాహెబ్ దేవరస్‌గారు ఈ విషయమై ప్రసంగిస్తూ చాలా చక్కటి విశ్లేషణ చేశారు. ఒకటి రెండు గంటలు మనం ఆ ప్రసంగపాఠాన్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నంచేస్తే సామాజిక సమరసత సాధించటానికి మనం ఎలాంటి చర్యలు చేపట్టాలో తేటతెల్లమవుతుంది. సామాజిక సమరసతను సాధ్యమైనంత త్వరగా సాధించాలి. వివక్షను రూపుమాపాలి. ఈ రెండు లక్ష్యాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. వివక్ష పోతే ఐకమత్యం ఏర్పడుతుంది. ఐక్యత సమరసతకు దారితీస్తుంది. అయితే ఈ లక్ష్యాలు మనం సాధించటం ఎట్లా? కులం తనపట్టును క్రమేపి కోల్పోతున్నది. ఇంకో శతాబ్దకాలంలో కులం తన ్రాధాన్యమును పూర్తిగా కోల్పోతుంది. కాని అంతవరకు మనం ఎదురుచూస్తూ కూర్చోకూడదు. సమీప భవిష్యత్తులోనే కులంగాడిని పూర్తిగా నిర్వీర్యుత్ని చెయ్యాలి. మనందరికి తెలిసిన విషయమే. గుణకర్మలుబట్టి వర్ణాలు ఏర్పడ్డాయి. వర్జాలనుండి కులాలు వచ్చాయి. గతంలో కులాలకు, వృత్తులకు సంబంధం ఉండేది. ప్రస్తుతకాలంలో చేసే వృత్తులకు, కులాలకు సంబంధం తెగిపోయింది. చేసే వృత్తులకు, పుట్టిన కులాలకుమధ్య సంబంధంలేనప్పుడు కులాలు ఎందుకు? కుల వివక్ష ఎందుకు? నిమ్నకులాలకు చెందిన అనేకమంది వారి వృత్తులు కారణంగానే ఆర్ధికంగా, సామాజికంగా, విద్యా విషయకంగా వెనుకబడ్డారు. వారు గతంలో చేసిన వృత్తులు, సేవల కారణంగా వారిని చిన్నచూపు చూడటం మానివెయ్యాలి.
కులవివక్షకు మూడుస్థాయిలలో నివారణచర్యలు చేపట్టాలి. మొదటిదిగా వ్యక్తిగతస్థాయిలో భావశుద్ధి రావాలి. మన హృదయాలను, ఆలోచనలను పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకు, నేను ఈ విషయమై ప్రస్తుతం మాట్లాడుతున్నాను. త్రికరణశుద్ధిగా నేను నమ్మి ఈ విషయమై మాట్లాడుతున్నానా? లేక ప్రచారం కోసమో, పత్రికలలో పతాక శీర్షికల కోసమో మాట్లాడుతున్నానా? బాలాసాహెబ్‌గారి చారిత్రాత్మక ప్రసంగం (కులవివక్షమీద) తర్వాత సంఘ పరివార్‌లో ఈ అంశంపై అంతర్గతంగా విస్తృతస్థాయిలో చర్చ జరిగింది. మొత్తం హిందూ సమాజానికే వారి ప్రసంగం దిశానిర్దేశనం చేసింది. సంఘ స్వయంసేవకులు లక్ష్యసాధనకై ప్రత్యేకమైన చర్యలు, చేపట్టకపోతే సమాజంలో మార్పురాదు. కుల వ్యవస్థ ఎంత దృధంగా మన సమాజంలో పాతుకుపోయిందో మనందరికి తెలుసు. అందువలన ఎంతో గట్టి ప్రయత్నం, అదీ వ్యూహాత్మకంగా కృషిచేస్తేనేగాని కులవ్యవస్థను దెబ్బతీయలేము.
సంఘ కార్యకర్తలు వివిధ కులాలకు చెందినవారిని కలుపుకొనిపోవాలి. అయితే అది అంత తేలికైన విషయంకాదు. కులవివక్షకు గురి అయిన వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలి. వారి సమస్యలను సావధానంగా విని, సానుభూతితో అర్థంచేసుకోవాలి. వారికి జరుగుతున్న దురన్యాయాలకు వ్యతిరేకంగా వారితరపున నిలబడాలి.
మన ఆచరణ ఎట్లా ఉంటున్నది?
సంఘ కార్యకర్తలు సంఘ విస్తరణలో భాగంలో దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు అణచివేతకు, వివక్షకు గురిఅయిన ప్రజలయింట ఆతిథ్యం తీసుకోవాలి. మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో ఇది పెద్ద సమస్యకాదు. కొన్ని ఇతర ప్రాంతాల్లో, అంతగా. అఖభివృద్ధిచెందని గ్రామప్రాంతాల్లో, కొన్ని కులాలవారితో భోజనంచెయ్యటం మిగిలినవారు హర్షించరు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు, వాటిని యుక్తిగా అధిగమించాలి. ఇతరులకు మనం ఉదాహరణగా నిలవాలి. మన ప్రాంతకార్యదర్శి ఒకరు కులవివక్ష తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో దళితుల ఇంటనే ఆయన ఆతిథ్యం తీసుకొంటున్నారు. ముందుగా ఆయనను ఆక్షేపించినవారే ఇప్పుడు ఆయనను. అనుసరిస్తున్నారు. ఆయన అలా చెయ్యటం ఆయనతల్లికి కూడా ఇష్టంలేదు. అయినా ఆయన కొనసాగించారు. ఇప్పుడు ఆయనతల్లి అతడు చేస్తున్న పనికి తన హర్షామోదాలను వ్యక్తపరుస్తున్నారు. ఆయన తన అనుభవాన్ని పంచుకొన్నారు. మొదటిముద్ద తింటున్నప్పుడు కొంచెం కష్టంగా అన్పించిందట. మానసికంగా సిద్ధంగా లేకపోవటం ఒక కారణం. అయితే, రుచులతేదా మరొక కారణం కావచ్చు. రెండు మూడు ముద్దలు తినగానే అన్ని సంకోచాలు ఎగిరిపోయ్యాయి. వందల సంవత్సరాల అలవాట్లు, అభిరుచులు, అభిప్రాయాలు అంత తేలికగా మారవు. కాని మార్చుకోవాలన్న సంకల్పం ఉంటే అవే మారుతాయి. సహజహితమే లక్ష్యమైనప్పుడు మనలోనే ఆ మార్చు వస్తుందని ఆయన అన్నారు.
మనలను మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. హిందూ సంఘంలో అన్ని సామాజిక వర్గాలనుండి మనకు స్నేహితులున్నారా? అందరితోనూ మనం కలిసిమెలసి ఉంటున్నామా? లేక మన కులానికి చెందిన వారితోనే ఎక్కువ సన్నిహితంగా. ఉంటున్నామా! దళితులతో స్నేహసంబంధాలు కల్లి ఉన్నామా? సహజంగానే వారితో స్నేహంచేస్తున్నామా? లేక స్నేహంగా ఉండాలి కాబట్టి ఉంటున్నామా? దళిత స్నేహితులు మనయిళ్ళకు తరుచూ వస్తున్నారా? మనం వారి ఇళ్ళకు వెళ్ళి, పర్వదినాలలో వారి సంతోషాన్ని పంచుకుంటున్నామా? వారియింట ఎటువంటి సంకోచం లేకుండా మెలుగుతున్నామా?
మార్పు మననుంచే మొదలు కావాలి. మనమే ఆచరణలో చూపించాలి. మీఅందరికి చైతన్యస్థాయి తక్కువేమీ కాదు. దాన్ని ఆచరణలోకి తీసుకొనిరావటమే ఈనాడు చేయవలసింది. మన ఆలోచనలలో, మాటల్లో, చర్యల్లో కులవివక్షకు తావు ఉండకూడదు. మాటల విషయమై జాగ్రత్తపడాలి. ప్రతిప్రాంతంలో కొన్ని సామెతలు ఉన్నాయి. ఇందులో కొన్ని కులపరమైననవి. కుల స్వభావాన్ని తెలియజేసేవి. కొన్ని కులాలను కించవర్చేవి. అలాంటివాటిని మనం ఎట్టివరిన్ఫితిలోనూ ఉపయోగించకూడదు. వాస్యానికైనా వాటిని ఉటంకించకూడదు. ఇతరులను, కులపరంగా దూషించకూడదు. కులపరంగా ఇతరులను బాధపెట్టే, కించపరచే పదప్రయోగం చేయకూడదు.
కొందరిని సంబోధించేటప్పుడు పూజనీయులని, గౌరవనీయులని, మహాత్మా అని సంబోధిస్తుంటాం. కాని దళితవర్గాలనుండి పైకివచ్చిన నేతల, రచయితల, కళాకారులగురించి అలాంటి విశేషణాలను మనం వాడుతున్నామా? మన ప్రతి సంబోధన, ప్రతి మాటను గమనించే వాళ్ళకు మనం అనాలోచితంగా చేసే పొరపాట్లు సైతం పెద్దవిగా కనబడుతుంటాయని, వారు బాధపడతారని గుర్తించుకోండి. మనతో ప్రారంభమై, మన కుటుంబ సభ్యులలోనూ ఈ రకమైన పరివర్తన రావాలి. కుటుంబము, పరివారము అంటూ నేను రెండు శబ్దాలను ఉపయోగిస్తున్నాను. చాలామందికి రెండూ ఒకటే గదా అనిపించవచ్చు. రక్తసంబంధము, బంధుత్వమూ ఉన్నవారివరకే పరిమితమైనది కుటుంబంకాగా, కుటుంబంయొక్క దైనందిన వ్యవహారాలలో ఎవరెవరి సహకారం ఉంటుందో, ఎవరు దాదాపుగా ప్రతిరోజూ మన ఇంటికి వస్తారో వారందరినీ కలుపుకొని పరివారం అనుకోవచ్చు. మన కుటుంబంలోను, పరివారంలోకూడా పరివర్తన తీసుకొనిరావాలి. ముందుగా మనలో, ఆ తర్వాత మన రక్తసంబంధీకులలో, ఆపైన మన దగ్గరి బంధువులలో, మన పరివారంలో పరివర్తన దిశగా అడుగులు పడాలి. మనయింట్లో పనిచేసే పనిమనుషులను మనం ఎట్లా చూస్తున్నాం? వారికి జీతం ఇస్తున్నాం. పనిచేయించుకుంటున్నాం. అంతకుమించి వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నామా? వారితో అత్మీయతతో మెలగుతున్నామా? సమరసత అంటే
మనస్సులో సంవేదన కల్గి ఉండటం. వారికి తగిన గౌరవాన్ని ఆదరణను మనం చూపించగల్లాలి. పండుగలు, శుభకార్యాలు వచ్చినపుడు బంధువులను పిలిచి, సంతోషాన్ని పంచుకొనేరీతిలో వీరితోకూడా అలా మెలగగల్గుతున్నామా? మన కార్యకర్త ఒకరు కొత్తగా ఇల్లుకట్టకొని గృహప్రవేశం చేశారు. విందు ఎప్పుడిస్తున్నావు, ఎంతమందిని పిలున్తున్నావు అంటూ అందరూ అడుగ నారంఖించారు. కార్యకర్తలందరినీ ఇంకో రోజున పిలుస్తాను-ఇప్పుడు సంఘచాలక్‌గారికి, మా బంధువులకూ పరిమితం అన్నాడతడు. విందు కార్యక్రమం అయిన తర్వాత సంఘచాలక్‌గారు చెప్పారు. ఆ గృహస్థు తన బంధువులందరినీ ఆహ్వానించటమేగాక, తమ కుటుంబ సభ్యులకు సేవలందించే ఇస్త్రీ చాకలిని, క్షురకుని కూడా సకుటుంబంగా రావాలని ఆహ్వానించాడు. గృహనిర్మాణంలో భాగస్వాములైన తాపీపనివారు, వడ్రంగులు వారినీ కుటుంబసమేతంగా రావలసిందని ఆహ్వానించాడు. బంధువులందరికీ ఏవిధంగా. కూర్చోబెట్టి, వడ్డించి భోజనం చేయించాడో, ఆ కుటుంబాలవారినీ కూర్చోబెట్టి భోజనం చేయించాడు. ఇటువంటి అనుభవాన్ని మనమూ మన సమాజానికి చూపించగలమా? కుటుంబానికి ఇచ్చే ఆత్మీయతను పరివారంవరకూ విస్తరింపజేయగలమా?
మన యిళ్ళలో కొందరికి కొన్ని గదులవరకే ప్రవేశం ఉంటుంది. కొందరికి ముందుగదివరకే ప్రవేశం. మరికొందరికి వంటగదివరకు, ఇంకొందరికి పూజగదివరకు. ఇందుకు మనం చాలాకాలంనుండి అనుసరిస్తున్న కట్టుబాట్లు, నియమాలు కారణం. కులం కారణంగా ఏ ఒక్కరినీ నివాసగ్భహాల్లో పరిమితులతో కూడిన ప్రవేశానికి లోనుచేయకూడదు. అందరికీ అన్నీ గదుల్లోకి ప్రవేశం ఉండాలి. ఉడిపిలో జరిగిన పీఠాధిపతుల సమావేశంలో చాలాకాలం క్రిందటే కులవివక్షకు, అంటరానితనానికి హిందూమతంలో తావులేదని కులవివక్షకు పాల్పడవద్దని తీర్మానం చేశారు. 1969లో జరిగిన ఈ తీర్మానం తర్వాత అప్పటి సర్ సంఘచాలకులు పరమపూజనీయ శ్రీగురూజీ “తీర్మానం అయింది కనుక, ఆచరించటమే ఇక మిగిలింది” అని సూర్యనారాయణరావుగారికి వ్రాసిన లేఖలో పేర్కొన్నారు. మన ఆచరణద్వారా స్వయంసేవకులు ఇతరులకు ఆదర్శంగా మెలగాలి. సామాజిక సామరస్యం మన ఆచరణద్వారానే వస్తుంది.
రాబోయేతరాన్ని కులాతీతంగా పెంచగలమా? చిన్ననాటినుండే అందుకు పునాది. వెయ్యాలి. యశ్వంతరావు కేల్కర్ అనే కార్యకర్త పిల్లలు, పాఠశాలనుండి వచ్చి తాము ఏకులానికి చెందిన వాళ్ళమని తండ్రిని ప్రశ్నించారు. ఏదో దరఖాస్తులో కులం ఏమిటో వ్రాయవలసి వచ్చింది. అంతవరకు వారికి కులం ఏమిటో తెలియదు. కేల్కర్ దంపతులు పాఠశాలకు వెళ్ళి ప్రధానోపాధ్యాయుడ్ని కలిసివచ్చారు. మరి కులంపేరు వ్రాయకుండా. ఉండేందుకు మినహాయింపును ఆ పాఠశాల యిచ్చిందో లేదో తెలియదు.
'కంచంపొత్తు', మంచంపాొత్తు గురించి తరచూ వింటుంటాం. దీనినే హిందీలో “రోటీ వ్యవహార్, 'బేటీ వ్యవహార్' అని అంటారు. మొదటిది సహపంక్తి భోజనాల గురించి, రెండవది కులాంతర వివాహాల గురించి అన్న విషయం ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. అన్ని కులాలవారితో కలిసి ఇప్పుడు హోటళ్లలో, ధర్మసత్రాలలో, దేవాలయాలలో, వివాహాలలో, అన్న సంతర్పణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే కులాంతర వివాహాల సమస్య సహపంక్తి భోజనాల సమస్య కంటే జటిలమైనది. ఇరువురి హృదయాలు కలవాలి. అందుకు ఇరుపక్షాల పెద్దల అంగీకారం అవసరం. కేవలం చట్టంద్వారా మార్పురాదు. కులాంతర వివాహాలను సమాజం ఇంకా పూర్తిగా అంగీకరించటంలేదు. అయితే కులాంతర వివాహం జరిగినపుడు మనం ఎవరిపక్షం వహించాలి అన్నది అలాంటి సంఘటన జరిగిన ప్రతిసారీ ఎదురవుతున్న ప్రశ్న వేగంగా మారుతున్న జీవనశైలితోపాటు, వివాహ వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయి. యువతీయువకుల అఖభిరుచుల్లోనూ మార్పులు వేగంగా వస్తున్నాయి. 1942లో ఒక కులాంతర వివాహం జరిగినప్పుడు పూజ్యశ్రీ గురూజీ వారిని అభినందించటమేకాక వధూవరులు సమాజంముందు ఒక ఆదర్శం ఉంచారని వ్యాఖ్యానించారు.
అనేకరకాల అంతరాలు వున్న నిచ్చెనమెట్ల సమాజంలో అసమానతలు ఆధారంగా. ద్వేషభావాన్ని రెచ్చగొట్టేవారు ఎప్పుడూ ఉంటారు. రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించాలి. భావోద్వేగాలకు లోనుకాకుండా మనం కులతత్వానికి, కులవివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యాలి. కులవివక్షకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవాళ్ళు ఎవరైనా వారికి మన మద్దతు ప్రకటించాలి. కులాలవారీగా సంఘం విడిపోకూడదు. అందుకే కులవివక్షకు, కులతత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారందరికీ బేషరతుగా మన మద్దతు ఉంటుంది.
కులప్రాతిపదిక రిజర్వేషన్లు
కులప్రాతిపదికన నడుస్తున్న రిజర్వేషన్లు గురించి మాట్లాడటం చాలా సున్నితమైన అంశం. నేను మాట్లాడే ప్రతిమాటను పత్రికలవారు జాగ్రత్తగా వింటారు. అందులోంచి. ఏదో వివాదాన్ని సృష్టించటానికి ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు నేను ఈ అంశంపై మాట్లాడినప్పుడు కూడా నేను ఏం మాట్లాడానో పూర్తిగా అర్ధం చేసుకోకుండానే వార్తాకథనాలు వ్రాశారు. నేను ఇప్పుడు కొత్తగా ఏమీ చెప్పటంలేదు. సంఘానికి ఈ సమస్యమీద ఒక దృఢమైన అభిప్రాయం ఉంది. ఎంతో విశ్లేషణచేసి ఈ అభిప్రాయానికి సంఘం వచ్చింది. అసమానతలు ఉన్నంతవరకు, వివక్ష కొనసాగుతున్నంతవరకు కులప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగాలి అన్నది సంఘ నిశ్చిత అభిప్రాయం. తరతరాలుగా వివక్షక్షు గురిఅయినవారే కులవివక్ష పూర్తిగాపోయిందని చెప్పటానికి అర్జులు. వారు అవసరంలేదని చెప్పేవరకు రిజర్వేషన్లు కొనసాగవలసిందే. ఇతరులు ఈ విషయం చెప్పటానికి తగినవారు కాదని నా ఉద్దేశ్యం.
సామాజిక వివక్ష ఇంతకు ముందున్నస్థాయికంటే తగ్గినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉందనే విషయంలో భిన్నాభిప్రాయాలకు ఆస్కారంలేదు. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఉమ్మడివనరులైన దేవాలయాలు, చెరువులు, శృశానాలలో ప్రవేశానికి కొందరికి అనుమతిని ఇవ్వటంలేదు. గ్రామబావులు, చెజువులనుండి నీళ్ళు తెచ్చుకొన్నందుకు, దేవాలయాలలో ప్రవేశించినందుకు, ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. హింసాత్మక సంఘటనల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. నాగరికతకు దూరంగా ఉన్న ప్రాంతాలలోనే కాదు. విశ్వవిద్యాలయాల్లోనూ కులవివక్ష తీవ్రంగా. ఉంది. రాజకీయంగా పలుకుబడి ఉన్న కులాలవారు మిగిలినవారిని ఎదుగనివ్వటం లేదు. విద్యావంతులలో సైతం కులజాడ్యం విరివిగా ఉంది. స్వకులంవారిని అభిమానించటం, ఇతరులను చిన్నచూపుచూడటం, హేళనచేయటం, కుల సంఘాలు పెట్టి స్వకులం వారి ప్రయోజనాలకే పనిచేయటం విద్యాధికుల్లోనూ కన్ఫడుతున్నది. ఇవన్నీ గర్జించదగ్గ చర్యలు. ఈ ఆలోచనాధోరణులను, ప్రవర్తనాతీరును నిరసించాలి. సామాజిక సమరసతకు ఇవి ప్రతికూల అంశాలు.
కులవివక్ష స్మృతులవల్ల, గ్రంథాలవల్ల రాదు. సంకుచిత ఆలోచనాధోరణులవలన, కరుడుగట్టిన జాత్యహంకారంనుండి ఉద్భవిస్తుంది. సంకుచిత మనస్తత్వాలవలననే సామాజిక కట్టుబాట్లలో సడలింపులకు, సవరణలకు జనం ముందుకురారు. కాని ఈ ఆలోచనాధోరణులు ఆమోదయోగ్యం కావు. పైపెచ్చు అవి మానవధర్మానికి వ్యతిరేకం. కులంతో నిమిత్తం లేకుండా దేవాలయ ప్రవేశాలకు, ఉమ్మడివనరులను ఉపయోగించుకోవటానికి ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు. మిగిలినవారికి వాటిని ఉపయోగించుకోవటానికి ఎంత హక్కుజందో, నిమ్నవర్గాల వారికీ అంత హక్కు ఉంది.
త్యాగం-సహనం ఈనాటి అవసరం
రిజర్వేషన్లకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో జరిగే చర్చలు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటాయి. రోజులతరబడి అనుకూలంగానో, ్రతికూలంగానో చర్చించవచ్చు. రిజర్వేషన్లవల్ల కొందరు నష్టపోతున్న మాట వాస్తవమే. వారి సంక్షేమమూ ప్రధానమే. అయితే మనమందరం ఒకే సంఘానికి చెందినవారము. ఈ రకంగా మనం ఎందుకు, ఆలోచించకూడదు? వేల సంవత్సరాలపాటు కొన్ని సామాజికవర్గాలు తీవ్రవివక్షకు గురిఅయ్యారు. స్వాతంత్ర్యం తర్వాతే వారి సమస్యలను అర్ధంచేసుకొని, వారికి కొన్ని సదుపాయాలను, సౌకర్యాలను, మినహాయింపులను మన రాజ్యాంగ నిర్దేతలు కల్పించారు. కులవివక్షకు గురిఅయినా, వారు హిందూసంఘంలో భాగంగానే ఉన్నారు. సంఘ అభివృద్ధికి వారివంతు కృషి వారూ చేశారు. దేశంకోసం సైన్యంలో చేరి ప్రాణాలు అర్పించినవారిలో వారిశాతం కూడా తక్కువేమీ కాదు. అలాంటి వారికోసం మిగిలినవాళ్ళం కొన్నాళ్ళపాటు కొంతత్యాగం చెయ్యలేమా?
దీనదయాళీజీ, నానాజీ రాజకీయాల్లోకి రాకమునుపు ఒక సంఘటన జరిగింది. వారిద్దరూ ఒక వీధిలో నడుస్తుండగా దీనదయాళ్‌జీ ఒక గోతిలో పడ్డారు. నానాజీ, ఇతర స్వయంసేవకుల సహాయంతో వారు గోతిలోనుండి పైకి రాగలిగారు. అప్పుడు దీనదయాళ్‌జీ ఈ విధంగా అన్నారు. “నేను పడిపోయినప్పుడు పైకి రావటానికి అన్ని ప్రయత్నాలు చేశాను. మునివేళ్ళమీద నిలబడ్డాను. చేతులు జాపాను. పట్టుకోసం ప్రయత్నించాను. నా ప్రయత్నం నేను చేసాను. కాని నా అంతటనేను పైకి రాలేకపోయాను. గట్టున ఉన్న మీరు వంగి చేయి అందిస్తేనే పైకిరాగలిగాను. మీరు కొంచెం క్రిందకు వంగి నన్ను పైకి లాగారు. అది మీ బాధ్యతగా మీరు అనుకున్నారు.” అభివృద్ధిచెందినవాళ్లు కొంచెం గొప్పమనసుతో వెనుకబడిన తమ సోదరులకు చేయూతనివ్వాలి. వారి ఆకాంక్షలను సానుభూతితో అర్ధంచేసుకోవాలి. ఎవరైతే అణచివేతకు గురిఅయ్యారో, వివక్షకు గురిఅయ్యారో వారు పైకి రావాలని అనుకొంటున్నారు. వారికోసం మనం చెయగల్లిన త్యాగాలను ఇష్టపూర్వకంగా చేద్దాం. ఇదే ధర్మం. ధర్మానికి, సత్యం, (ప్రేమ, దయ, న్యాయం మూలస్తంభాలు. వాటి ఆధారంగానే మనం ప్రవర్తించాలి. ధర్మానికి అనుగుణంగా ఉంటేనే సంప్రదాయాలను గౌరవించటమూ, పాటించటమూ. లేకుంటే వాటిని ధిక్కరించవలనిందే, అతిక్రమించవలసిందే. ధర్మానికి అనుగుణంగానే కులవివక్షకు వ్యతిరేకంగా మనం కృషిచేద్దాం.
సరిగా అర్థం చేసుకోవాలి. తగినట్లుగా వ్యవహరించాలి.
మహాత్ముల, జాతీయనాయకుల జన్మదిన ఉత్సవాలను ఎంతో స్ఫూర్తివంతంగా జరుపుకోవాలి. కాని ప్రస్తుతం వారినికూడా కులాలవారీగా విభజించాం. ఏ కులంవారు ఆ కులానికి చెందిన నాయకుల జన్మదిన ఉత్సవాలను చేస్తున్నారు. జాతీయ నాయకులు ఏ కులానికీ చెందరు. వారు కులనాయకులుకారు. మొత్తం జాతికే నాయకులు. ఎంత సంకుచితంగా మనం ్రవర్తిస్తున్నాం? మహానాయకులందరూ మనకోసం వారి శక్తియుక్తులను ధారపోశారు. మనకోసం సమస్తమూ త్యాగం చేసినవారిపట్ల మనం ఎంత అమర్యాదగా ్రవర్తిస్తున్నాం? వారిని కులాలకు ప్రతినిధులుగా భావించటం ఎంత అన్యాయం? అందరం కలసి చేసుకోవాల్సిన జన్మదినాలను, వేడుకలను, సంస్మరణలను ఎలా చేసుకుంటున్నాం? వాల్మీకి జయంతిని ఎవరు. చేసుకుంటున్నారు? వాల్మీకులే చేస్తున్నారు. వాల్మీకి కులస్థులు లేని బస్తీలలోనూ వాల్మీకి జయంతి జరపాలి. మన జీవితాలకు దివ్య ఆదర్శాలను నిలిపి రఘురాముని చరిత్రను మొత్తం మానవాళికి అందించిన ఆ మహనీయుని జన్మదినం సైతం అందరం కలిసిచేసుకొటానికి మనం ముందుకు రాకపోవటం మనలో సంకుచితత్త్వంతో ఏ స్థాయికి దిగజారామో తెలియజేస్తుంది. మహనీయులను, వారు స్వాతంత్ర్య సేనానులైనా, విప్లవకారులైనా, కళాకారులైనా, శాస్త్రవేత్తలైనా, భక్తజన ్రేష్టులైనా, సంఘసంస్కర్తలైనా, లాజ్యాంగ నిపుణులైనా వారిని కులం కోణంలోంచి చూడటం వారిపట్ల, వారి మేధస్సు, త్యాగం, సేవానిరతి, సృజనాత్మకత, దేశభక్తిపట్ల తీవ్రమైన అపరాధం, అపచారం.
ఉద్రిక్తతలను పెంచేందుకో, ప్రచారంకోసమో మనం పనిచేయకూడదు. భావోద్వేగాలను రెచ్చగొట్టటం మనపనికాదు. ఉద్రిక్తతలను, అపోహలను, అపార్ధాలను, అజ్ఞానాన్ని సదలింపుచేసి వాస్తవాలను సమాజంముందు ఉంచటమే మనపని. మొత్తం జాతి జాతే బుణపడి ఉండవలసిన మహనీయులను ఏ ఒక్క వర్గానికో, కులానికో, భాషకో, ప్రాంతానికో పరిమితంచేసే ధోరణికి ముగింపు పలుకుదాం.
తరతరాలుగా వివక్షకు గురయిన వర్గాల ప్రజలకు తీవ్రమైన భావోద్వేగాలు ఉండటం సహజం. వారు పొందిన అవమానాలు, క్లేశాలు, ఒంటరితనం అందుకుకారణం; వారి ధర్మాగ్రహాన్ని అర్ధం చేసుకొందాం. వారిని రెచ్చగొట్టే వ్యక్తులు, సంస్థలు ఉన్నాయి. మిగిలినవారితో వారిని కలువనీయకుండా చేసేందుకు కొన్నిశక్తులు ఎప్పుడూ పనిచేస్తుంటాయి. పదేపదే గతాన్ని జ్ఞాపకంచేసి, వర్తమానం లోనూ మిగిలిన సమాజంతో మమేకం కాకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టేవారు దురుద్దేశాలతో ఆపని చేస్తున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎంతో సంయమనంతో మనం పనిచెయ్యాలి.
సమరసతాతత్వపు అనుభూతిని అందరికీ అందించాలి
మనమందరం ఈ దేశానికి చెందిన వారం. ఒకే సాంస్కృతిక సంపదకు వారసులం: మనందరి మూలాలు శాస్త్రపరంగాను, సంస్కృతిపరంగాను ఒక్కటే. ఆ కారణంగామనందరి మధ్య ఒకబంధం, సాన్నిహిత్యం ఉన్నాయి. అయినా ఇంతపెద్ద దేశంలో, ఇంత వైవిధ్యం గల దేశంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. వాటీని గౌరవిద్దాం. ఇతరులపట్ల సహనంతో, సంయమనంతో మెలగుదాం. ఒకసారి ఒక బౌద్ధసన్యాసి ఒకరు నాగపూర్ వచ్చారు. పిల్లలకు ఆయన పాటలు నేర్పుతున్నారు. సంఘం గురించి ఆయనకు తెలుసు. వారి ఉపన్యాసంలో వారొక గొప్పమాట అన్నారు. “సంఘాన్ని అర్థంచేసుకోవటానికి ప్రయత్నించండి. సంఘం అంటే ధర్మమే”.
సమాజంలో మార్పుకోసం మనముందు అనేకమంది పనిచేశారు. వారినుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వారిపనితీరు మనకు భిన్నమైనదిగా ఉండవచ్చు. కాని లక్ష్యం ఒక్కటే, లక్ష్యసాధనకోసం వారు ఏంచేశారో, వారి జీవితకాలాల్లో వారు. ఏమి సాధించారో మనం తెలుసుకోవాలి. దురదృష్టవశాత్తు అలాంటి నాయకుల విషయంలోనూ మనం తగాదా పడుతున్నాం. సత్యంకోసం వారు పాటుపడ్డారు. పోరాటంచేశారు. ఆ సత్యంకోసమే మనమూ పాటుపడాలే తప్ప, నాయకుల భిన్నభిన్న వ్యక్తీకరణల గురించి మనలో మనం దెబ్బలాడుకోకూడదు. మండుటెండలో పాదరక్షలు, లేకుండా ఇసుకలో నడిస్తే పాదాలు కాలి నొచ్చుకుంటాయి. సూర్యుని తాపంకంటే వేడెక్కిన ఇసుక మనలను ఎక్కువ బాధిస్తుంది. మనం సూర్యసమానులు. వారి అనుయాయులమైన మనం ఇసుకరేణువులవంటివారం. మనం ఉద్రిక్తతలకు లోనై ఎదుటివ్యక్తులకు నొప్పి కల్గించకూడదు. నాయకుల సందేశాలను మోనుకొని తిరిగే మనం ఇతరులను మన ప్రవర్తనతో, తీవ్రభావజాలంతో బాధపెట్టకూడదు..
కనుక సామాజిక సమరసత సాధన కేవలం మాటలవల్ల ఒనగూడేదికాదు. ఉవన్యాసాలవల్ల వచ్చేది కాదు. ఉపన్యాసాలు, చర్చలు, వృధాప్రయాస. క్రియాస్వయంవల్లనే మార్పు వస్తుంది. క్రియాస్వయానికి, కార్యకలాపాలకూ. ఉపక్రమించటమే తక్షణ కర్తవ్యం. ఉపన్యాసాలకు, చర్చలకు కొంత ప్రాధాన్యం ఉన్నమాట నిజమే కాని కేవలం వాటివల్లనే సామరస్య వాతావరణాన్ని తీసుకొనిరాలేము.
డా॥ ఆంబేడ్మర్ సామాజిక సమరసత గురించి ఏం చెప్పారో, ఏ సందర్భంలో ఏమి చెప్పారో తెలుసుకోవాలి. ఆయన ఆలోచనా ధోరణులను అర్థం చేసుకోవాలి. తీవ్రమైన అభిప్రాయాలను, పరిష్మారమార్గాలను ఆయన వెలిబుచ్చారు. ఆయనతోపాటు ఆ కాలంలో ఉన్నవారు ఆ అఖిప్రాయాలను ఆయన ఎందుకు చెప్పవలసి వచ్చిందో తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. ఈనాటి పరిస్థితులు వేజు. సమకాలీన పరిస్థితులకు, అనుగుణంగా ఆయన అభిప్రాయాలను ఇప్పుడు అన్వయించుకోవాల్సి ఉంటుంది.
ఆయనకంటేముందు అనేకమంది సామాజిక అసమానతలకు, దురన్యాయాలకు, వ్యతిరేకంగా మాట్లాడారు. పనిచేశారు. వారుచెప్పిన పరిష్కారాలకు సమకాలీనత ఉండకపోవచ్చు. కాని వారి చిత్తశుద్ధిని, సమాజం బాగుపదాలన్న వారి సంకల్పాన్ని మనం శంకించపనిలేదు. మనకంటే దృఢమైన విశ్వాసాలను వారు కల్గిఉన్నారు. స్వామి వివేకానంద అనేక నందర్భాలలో వెలిబుచ్చిన అభిప్రాయాలను ఆ తర్వాతకాలంలో బాబాసాహెబ్‌కూడా చెప్పారు. భాష, వ్యక్తీకరణ వేరు కావచ్చు. లక్ష్యం ఒక్కటే. సామాజిక దురన్యాయాలపట్ల తిరుగులేని పోరాటం. అట్టి వాటిని రూపుమాపాలన్న లక్ష్యం ఒక్కటే పరిస్థితులనుబట్టి. సందర్భాలనుబట్టి వ్యక్తీకరణలు మారుతాయి. మహనీయుల జీవితాదర్శాలను, ఇచ్చిన సందేశాలను, చూపిన పరిష్కారాలను సమగ్రంగా అధ్యయనం చెయ్యాలి. అప్పుడు మాత్రమే ప్రస్తుత సమస్యలకు తగిన పరిష్కారమారాలను పట్టుకోగల్గుతాం.
సామాజిక సమరసత దిశగా ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. కొంతమేర విజయం: సాధించాం కూడా. మన అనుభవాలను, విజయాలను సమాజంతో పంచుకోవాలి. ఇతరులకు తెలియజేసినప్పుడే మరికొందరికి అవి స్ఫూర్తిదాయకం అవుతాయి. ముందు. చెప్పినట్లుగా మనవ్యక్తిగత, సామాజిక జీవితాలను సామాజిక సమరసత సాధన దిశగా ఒక పద్ధతి ప్రకారం మలుచుకోవాలి.
పూజనీయ బాలాసాహెబ్ దేవరస్‌గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రసంగం ఏర్పాటు చేయటం ఎంతో సబబుగా ఉంది. ఈ అంశంపై ఆయన విస్తృతంగా ప్రసంగించారు. ఆయన సందేశాన్ని అర్ధం చేసుకొని సామాజిక సమరసత దిశగా పనిచేద్దాం. నాగపూర్ నాగరిక సహకార బ్యాంకు ప్రజలలో చైతన్యాన్ని తీసుకొని వచ్చేందుకు ఈ ఉపన్యాసాలను ఏర్పరచినందులకు వారికి అభినందనలు.
(తెలుగుసేత : డా! బి. సారంగపాణి)
❇❇❇