- రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఉమా మహేశ్వరరావు
భాగ్యనగరం: ఈ కాలపు యువత అసలైన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్రం(కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు అభిప్రాయ పడ్డారు. అప్పుడే సమాజంలో చోటు చేసుకొంటున్న అంశాలపై స్పష్టమైన అభిప్రాయం ఏర్పడుతుందని వివరించారు.
చరిత్ర పుస్తకాల్లోని వక్ర రీతులను సరిచేస్తూ విద్యాభారతి, చిన్మయ మిషన్ సంయుక్తంగా ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం రేడియేంట్ భారత్ పేరుతో పుస్తకాలను రూపొందించాయి. చిన్మయ యువకేంద్రం డైరెక్టర్ స్వామి అనుకూలానంద, విద్యాభారతి తమిళనాడు అధ్యక్షులు క్రిష్ణ చెట్టి తదితరులతో కలిసి డాక్టర్ ఉమామహేశ్వరరావు ఈ పుస్తకాలను విడుదల చేశారు. ఈ పుస్తకాల రచనలో పాలు పంచుకొన్న అధ్యాపకులను అభినందించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత్ కేంద్రిత విద్యా వ్యవస్థ ఏర్పడాలని ఎందరో మేధావులు, విద్యావేత్తలు కలలు కంటూంటారని వివరించారు. ఇటువంటి పుస్తకాల ద్వారా అటువంటి వ్యవస్థ సాకారం అవుతుందని అభిలషించారు.
దేశ వ్యాప్తంగా విద్యాభారతి స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న సేవలను డాక్టర్ ఉమా మహేశ్వరరావు వివరించారు. 26వేలకు పైగా పాఠశాలలు, లక్షన్నర మంది ఆచార్యుల ద్వారా సుమారు 34 లక్షలమందికి విద్యను అందించటం జరుగుతోందని పేర్కొన్నారు. ఇటువంటి విద్యాభారతిలో సేవలు అందిస్తున్న వారిని అభినందించారు.
Source: VSK Telangana