Western Christian foundations |
నాలుగు భాగాలుగా రానున్న “‘కాస్ట్’ వ్యవస్థ – పాశ్చాత్య క్రైస్తవ పునాదులు” వ్యాసంలో ఇది మూడవ భాగం. గత రెండు వారాలలో మొదటి రెండు భాగాలనూ ప్రచురించాం. ఇదే విధంగా వరుసగా వారానికి ఒక భాగం ప్రచురింపబడుతుంది. పాఠకులు గమనించ ప్రార్థన.
క్రైస్తవంలో కులాచారాలకు అనుమతి :
19వ శతాబ్ది మొదటి దశాబ్దంలో ‘కాస్ట్’ వ్యవస్థ ‘అనైతికతను’ బయటపెడ్తూ అనేక రచనలను వెలువరించారు. ఛార్లెస్ గ్రాంట్ ఇలా వ్రాశాడు “నిరంకుశత్వం హిందూస్థాన్ ప్రభుత్వాలకే పరిమితంకాలేదు. అది అక్కడి సమాజపు మౌలిక, మూలాధారమైన, తిరుగులేని లక్షణం కూడా. అసహ్యకరమైన ఆ ప్రాణాంతకవ్యాధి ప్రభావంతో నాలుగు వర్ణాలకు చెందినవారు పనికిరాని వారుగా, దయనీయులుగా మారిపొయ్యారు. హిందూసమాజం అనైతిక సూత్రాలపై నిర్మాణం చెయ్యబడ్డది. కాస్ట్ వ్యవస్థ న్యాయానికి సంబంధించిన ప్రతి సూత్రానికీ వ్యతిరేకం. దాని నియమనిబంధనలు అమానుషమైనవి. అధర్మమైనవి. అన్ని రకాల సహోదరత్వ, ఉదార సంవేదనలను అది చంపివేస్తుంది”.
భారతదేశంలోని సామాజిక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, అసత్యమతం హిందువుల జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తున్నదని, కాస్ట్ ను సత్యమతమైన క్రైస్తవవ్యాప్తి ద్వారా నిర్మూలించకపోతే, హిందువులకు ఉపశమనం కలగదని మత ప్రచారకులు, ఈస్టిండియా కంపెనీకి చెందిన మతోన్మాదులు పదేపదే విజ్ఞాపనలు పంపారు. అయితే భారతదేశం పట్ల కొంత సానుభూతిగల కొందరు మేధావులు, ఉద్యోగులు క్రైస్తవ మతవ్యాప్తి ద్వారా భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను ధ్వంసం చేయవద్దని హితవు చెప్పారు. దురదృష్టవశాత్తు వారి మాట చెల్లుబాటు కాలేదు.
‘కాస్ట్ వ్యవస్థ’ను అమానుషమైనదని వారు ఖండించినా ‘కాస్ట్’ భేదాలు, హెచ్చుతగ్గుల, అనైతిక విగ్రహారాధకవ్యవస్థ క్రైస్తవంతో పొసగదని వారు ఏనాడూ అనుకోలేదు. వాస్తవానికి వారు ఖండించిన అనేక పద్ధతులను భారతీయ క్రైస్తవసమాజంలోనూ, చర్చిలలోనూ ప్రవేశపెట్టటానికి వారికి అభ్యంతరం లేకపోయింది. ఉదాహరణకు కులాల వారీగా చర్చిలలో కూర్చోవటానికి, దైవపీఠం (Lord’s Table) దగ్గరకు వెళ్ళటానికి అనుమతించారు. 18వ శతాబ్దంలో ప్రసిద్ధి పొందిన మిషనరీలు ఎవరూ ‘కాస్ట్’ భేదాలను అంగీకారం కాదని ఎప్పుడూ ఖండించలేదు. అంతేకాక ‘కాస్ట్’ ఆచారాలను అనుసరించటాన్ని తప్పుపట్టలేదు కూడా.
కలకత్తాలో ఆంగ్లికన్ చర్చి రెండవబిషప్, 1859లో ఏమంటున్నాడో చూడండి. “ఐరోపాలో కాస్ట్ లేదా? అమెరికాలో కాస్ట్ లేదా? ఇంగ్లీషు చర్చిలలో గొప్పవారు, తక్కువవారు వేరువేరుగా కూర్చోవటం లేదా? మంచి దుస్తులు ధరించిన, ఎక్కువ కాస్ట్ కు చెందిన మనవాళ్ళు దైవపీఠం లేదా బలిపీఠం దగ్గఱకు వెళ్ళి ప్రార్ధన చేయటానికి ముందుకు వెళ్ళటం లేదా? మనదేశంలో ఉన్నవారు, లేనివారు వెళ్ళే పాఠశాలలు వేరువేరుగా లేవా? మనలో ‘పరియా’లు లేరా? ఇతర నాగరిక దేశాలలో కాస్ట్ లేకపోయినా, కాస్ట్ లతో వచ్చే హెచ్చుతగ్గభావనలు లేవా?
బిషప్ తన వాదన కొనసాగిస్తూ దేవుని దృష్టిలో అందరూ సమానమే అయినా, మనిషి దృష్టిలో ఖచ్చితంగా మానవులందరూ సమానంకాదని, ప్రతిసమాజంలోనూ హెచ్చు తగ్గులు ఉంటాయని, అంతేకాక అందరూ మానవులూ సమానంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడనేది ఒక సముచితమైన అభిప్రాయం అయినప్పటికీ, సామాజిక అంతరాలు ఉంటాయని, కనుక కాస్ట్ తేడాల గురించి పట్టింపులు అవసరంలేదని అన్నాడు.
17వ శతాబ్దంలో మలబార్ తీరంలో ఒక వివాదం చెలరేగింది. మతం మారినప్పటికీ కొన్ని కులాల వారు జంధ్యం ధరించటం, పిలక పెట్టుకోవటం, గంధం బొట్టు పెట్టుకోవటం మానలేదు. వాటిని మతాచారాలుగా భావించి, అనుమతి నిరాకరించాలా లేక కులాచారాలుగా భావించి అనుమతించాలా అన్న వివాదం చెలరేగి, పోప్ 15వ జార్జి వరకూ వెళ్ళింది. విచారణ చేసి భారతీయ క్రైస్తవులు తమ కులాచారాలు పాటించవచ్చని జంధ్యం, బొట్టు తీసివేయవలసిన అవసరం లేదని ఆయన తీర్పు ప్రకటించాడు. హిందూమతానికి సంబంధించి అవి అంత ప్రాముఖ్యంలేని అంశాలుగా పరిగణించటం వలననే పోప్ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు మార్చుకోవలసిన అవసరం లేదని చెప్పాడు. అందుకే ఈనాటకీ మన దేశంలో కాథలిక్ మతస్థులు బొట్టుపెట్టుకుంటారు. మంగళసూత్రం, మెట్టెలు ధరిస్తారు.
క్రైస్తవానికి వివిధ దేశాలలో ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. కొత్తగా క్రైస్తవ్యం స్వీకరించిన వారు విగ్రహారాధన చెయ్యకుండా ఉంటే చాలునని మతాధికారులు అభిప్రాయపడేవారు. క్రైస్తవం తొలినాళ్ళలో రోమన్ సామ్రాజ్యంలోనూ వారికి ఈ సమస్య ఎదురయింది. కొత్తగా మతం మారిన వారు తమ పాత పద్ధతులను, పాటించే వారు. తమ పాత దేవీ దేవతలకు మొక్కేవారు. అసత్య దేవుళ్ళను
పూజించటం అనేది రోమన్ సామ్రాజ్యం అంతటా ధృడంగా పాతుకొని పోయిందని క్రైస్తవ మతాధికారులు వాపోయేవారు. విగ్రహారాధన కొనసాగటం వారికి మింగుడు పడలేదు. అయినప్పటికీ ప్రయత్నపూర్వకంగా ఆ అలవాటును మాన్పించటం కోసం వారు కొత్త విశ్వాసులను భయపెట్టేవారు. విగ్రహాలను, దేవాలయాలను పగులగొట్టేవారు. క్రైస్తవమత పెద్దలు కొత్తవిశ్వాసులు తప్పనిసరిగా క్రైస్తవ దేవుని ప్రార్ధనా సమావేశాలకు హాజరుకావాలని ఆజ్ఞాపించేవారు. వారం వారం క్రమం తప్పకుండా క్రొత్త విశ్వాసులు చర్చి ప్రార్ధనలకు హాజరయ్యేలా చూసేవారు. ఏ రూపంలోనూ విగ్రహారాధనను అనుమతించేవారు కాదు. సహించేవారు కాదు. కానీ మిగిలిన విషయాలలో కొత్త విశ్వాసులకు స్వేచ్ఛను యిచ్చారు. చర్చి ప్రార్ధనలకు హాజరు అవటం, విగ్రహారాధన చెయ్యకపోవటం విశ్వాసులు తప్పని సరిగా చెయ్యవలసిన విధులు. ప్రపంచంలో మిగిలిన దేశాలలోనూ వారు యించుమించి ఇవే పద్ధతులను అమలుచేశారు.
– డా. బి. సారంగపాణి - (విశ్వసంవాద కేంద్రం) (full-width)