మన భారతీయ సనాతన సంస్కృతిలో, మానవ జీవన ప్రయాణంలో సాధన ఒక నావ. యోగ సాధన చుక్కాని. మనిషిలోని మానవత్వం ద్వారా ప్రక్షిప్తంగా ఉన్న దైవత్వాన్ని అభివ్యక్తం చేయడమే యోగ సాధన. మనిషిలోని మంచితనమే దైవాంశ. ప్రతి వ్యక్తిలోని మంచి గుణాలని పెంపొందించడానికి ఉపయోగపడటం మన సామాజిక జీవన లక్ష్యం. గృహస్థులు వారి వారి పనులను బాధ్యతాయుతంగా నిర్వహించడం వారి కర్తవ్యం. అదే వారి జీవన ప్రయాణంలో సాధన.
మన సంస్కృత వాఙ్మయంలో కోకొల్లలుగా ఉన్న ఉదాహరణలలో వాల్మీకి మహర్షి జీవితంలోని ఘటన చిరస్మరణీయం. కుటుంబ పోషణలో భాగంగా రత్నాకరుడు ఎంచుకున్న జీవనోపాధి హింసాత్మకం, సంఘ వ్యతిరేకం, అసమంజసం. బాటసారులను ఆపి భయపెట్టి సర్వస్వాన్ని దోచుకోవడం అతని వృత్తి. ఎదిరించే వాళ్ల ప్రాణాలు సైతం పోయేవి. అలాంటి వృత్తి ద్వారా కుటుంబాన్ని పోషించేవాడు. అతని సంపాదన మీద ఆధారపడి పూట గడుపుకోవడం రత్నాకరుని కుటుంబానికి అలవాటు. కుటుంబ పెద్ద ఏ విధంగా సంపాదిస్తున్నాడో వాళ్లకి తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు. కాలగమనంలో ఒకనాడు అటుగా వెళుతున్న నారద మహర్షిని ఆపి దోచుకొనే ప్రయత్నం చేశాడు. సర్వసంగ పరిత్యాగి అయిన నారద మహర్షి అతడి ప్రవృత్తికి కారణం తెలుసుకుని, అది అధర్మం, అన్యాయమని నచ్చజెప్పాడు. ఈ వృత్తి ద్వారా అతడికి సంక్రమించే పాప ఫలితం పంచుకోవటానికి అతనిపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు అంగీకరిస్తారో లేదో తెలుసుకు రమ్మని పంపించాడు. రత్నాకరుడు ఇంటికి వెళ్లి నారద మహర్షి అడగమన్న ప్రశ్న అడిగాడు. అందుకు వాళ్లంతా, నువ్వు ఎలా సంపాదిస్తున్నావో మాకనవసరం! అది నీ బాధ్యత, కర్తవ్యం. అలా అని ఆ వృత్తితో నీకు సంక్రమించే పాపఫలం మేమెవ్వరం పంచుకోం. ఆ పాపం నీదే. నీవు చేసే కర్మఫలాలు నువ్వే అనుభవించు అని చెప్పేశారు. భార్యాపిల్లలూ, తల్లిదండ్రులూ, ఆధారపడి ఉన్న వాళ్లందరూ తను చేస్తున్న పాపకార్యాల ఫలితంగా వచ్చే పాపఫలం పంచుకోవటానికి నిరాకరించడం రత్నాకరునికి కనువిప్పు.
జిజ్ఞాసతో అతని జీవితం మారి, మలుపు తిరిగింది. ఆ మలుపుకి కారణం నారద మహర్షి. సర్వస్వాన్ని త్యజించి ‘రామ’ నామ జప యోగసాధన చేయ మన్నప్పుడు, రామనామాన్ని పలకలేక పోయాడు. యుక్తంగా, ముక్తికై ‘మరా’ అని పలుకుతూ జపించమన్న నారద మహర్షి ఉపదేశాన్ని అనుసరించి, అనుష్టించి తనలోని వాల్మీకిని సాక్షాత్కరించుకొని, రత్నాకరుడు వాల్మీకి మహర్షి అయ్యాడు. సరియైన సమయంలో ఉపదేశాన్ని స్వీకరించి అమలులో పెట్టాలి అనేదే దీని సందేశం.
అలా నారద మహర్షి ఉపదేశాన్ననుసరించి జీవితాన్ని మలచుకొన్న రత్నాకరుడే వాల్మీకి మహర్షిగా అవతరించాడు. ప్రపంచంలోనే అమూల్యమైన లోకహితమైన రామాయణ కర్తగా శాశ్వత కీర్తి పొందాడు. జగత్కల్యాణానికి నాంది పలికాడు. అదే బాటలో నూటయిరవై సంవత్సరాల క్రితం వివేకానందుడైన నరేంద్రనాథుడు అపర నారద మహర్షిలా మన జాతిని ఉద్దేశించి ఇచ్చిన సందేశం, ఉపదేశం – యోగ సాధన. ఆయన సముద్రాలని దాటి పాశ్చాత్య దేశాలలో యోగా శంఖారావాన్ని పూరించారు. సృష్టిలోనే దైవత్వాన్ని దర్శించి అభివ్యక్తం చేసే సులువైన మార్గమూ పద్ధతీ యోగ. ప్రపంచంలోని సర్వ దుఃఖ నివారిణి యోగ మాత్రమే.
పాశ్చాత్య దేశాలలో యోగ సందేశాన్ని ప్రాచుర్యం పొందేలా చేసి మన జాతి, మన సంస్కృతుల గౌరవాన్ని పదింతలు చేసిన ఘనత స్వామి వివేకానందులదే. విశ్వ సమాజానికి యోగా మన భారతీయ సనాతన ధర్మ సంస్కృతి ఇచ్చిన అమేయ బహుమానం. ఆ మహామనీషి వివేకానందుని సందేశాలు భారతీయులనీ, భారతీయ తనీ వెన్నుతట్టి లేపాయి. అంధకారంలో, స్వార్ధంలో మునిగి తేలుతున్న భారతజాతిని కార్యోన్ముఖులయ్యేలా చేసిన ఆ అపర నారద మహర్షికి జోహార్లు. మనలో అవ్యక్తంగా మిగిలిన దైవశక్తికి ఊపిరి పోసి అప్పటి సాంఘిక, సామాజిక సమస్యలను ఎదుర్కొనే ధైర్యసాహసాలను అందరికీ అందించిన నూతన సామాజిక యోగం అది. నిర్భీకతను వెలికి తెచ్చి నిర్బలతని రూపుమాపే కర్తవ్యయోగమది. మనిషి దుఃఖాలకి సమాధానంగా వివేకానందుడు తన రాజయోగంలో యోగసాధనని ప్రస్తావించారు.
స్వామి వివేకానందుని స్ఫూర్తితో భారతీయ యోగ తత్త్వాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించి యోగ సాధనని విశ్వమానవాళికి చేరువ చేసిన ఘనత; సరళ, సులభ పద్ధతికి శ్రీకారం చుట్టిన కీర్తి మన ప్రధాని నరేంద్ర మోదీదే. యోగ అంటేనే భారతదేశం. భారత దేశానికీ యోగాభ్యాసానికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని చాటి చెప్పిన ప్రధాని నిత్యజీవితంలో యోగాభ్యాసం చేస్తూ మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఎక్కడ ఉన్నా, ఎన్ని ఒత్తిడులు ఉన్నా కొంత సమయం యోగా చేయడమన్నది ఆయన నిష్ట. అదే మనందరికీ సందేశం, ఆదర్శం.
నిత్యం ఉదయం లేదా సాయం సంధ్య వేళల్లో వీలయినంత వరకూ సూర్య నమస్కారాలు, సులభమైన ఆసనాలు, ప్రాణాయామాలతో పాటు కొంతసేపు ధ్యానంలో కూర్చోవడం మనం కచ్చితంగా అలవరచుకోవాలి. ఎవరి వయసుకి సరిపోయే ఆసనాలను వారు నేర్చుకోవాలి. యోగాభ్యాసం చేయడానికి అనువైన పద్ధతులు నేర్చుకుని వాటిని జీవితంలో భాగం చేసుకోవాలి. అదే మనల్ని, నేటి భయంకరమైన సమస్యల నుంచి బయటపడేసే మార్గం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి మర్చిపోవద్దు!
ప్రపంచ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా మనమందరం మన ప్రధాని బాటలో నడవడానికి పునరంకితమవుదాం. నారద మహర్షి ఉపదేశాన్ని, స్వామి వివేకానందుని సందేశాన్ని, నరేంద్ర మోదీ మార్గదర్శకత్వాన్ని అనుసరించవలసిన అవసరాన్ని గుర్తించి యోగాభ్యాసం చేస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. ఇందుకోసం ఆయుష్ మంత్రాలయం తయారు చేసిన యోగా ప్రోటోకాల్ చాలా అద్భుతమైన పద్ధతి. తక్కువకాలంలో సరళ యోగాభ్యాసాన్ని చేస్తూ అధిక లబ్ధిని పొందవచ్చు. ఈ ప్రోటోకాల్‌ని క్రమబద్ధీకరించిన వారు ప్రాజ్ఞులు, యోగ నిపుణులు డాక్టర్ హెచ్‌ఆర్ నాగేంద్ర. వారి నిశిత నిర్వహణా సామర్ధ్యంతో యోగాభ్యాసానికి ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రచారం లభించింది.
డాక్టర్ కంభంపాటి సుబ్రహ్మణ్యం, 9741011833
ప్రో ఛాన్స్‌లర్, స్వామి వివేకానంద యోగ అనుసంధాన సంస్థ (SVyasa), బెంగళూరు.