మహాత్మా జోతిబా ఫూలే సామాజిక సమతా ఉద్యమానికి అగ్రేసరులు. సావిత్రిబాయి ఫూలే వారి సతీమణి. ఒక పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ తప్పక ఉంటుంది. మహిళలు బయకు వచ్చే స్థితిలేని సమయంలో సావిత్రిబాయి జోతిబా ఫూలేకు సామాజిక కార్యక్రమాలలో అడుగడుగునా అండగా ఉండటంతోపాటు అనేక సామాజిక కార్యక్రమాలను సొంతంగా చేపట్టారు సావిత్రిబాయి ఫూలే. జోతిబా ఫూలే మరణానంతరం కూడా ఆయన స్థానాన్ని ఆమె పూరించింది. అతి శూద్ర ( అస్పృశ్యుల) బాలికల పాఠశాలను నిర్వహించిన తొలి ఉపాధ్యాయినిగా చరిత్రలో స్థిర స్థానం ఏర్పరచుకున్నారు.
మహాత్మా జోతిబా ఫూలే 11 ఏప్రిల్ 1827లో మహారాష్ట్రలోని అత్యంత వెనుకబడిన బి.సి. కులంలో, ఫూలే కులంలో (పువ్వులు అమ్మేకులంలో) జన్మించారు. తండ్రి గోవిందరావుది పూలవ్యాపారం. జోతిబాకు చదువుపట్ల ఆసక్తి మెండు. ఆనాటి ఆచారం ప్రకారం 1840వ సం||లో జోతిబా ఫూలే వివాహం వారి 13వ ఏట జరిగింది. పెళ్ళికుమార్తె సావిత్రిబాయి 1931 జనవరి 3న సతారా జిల్లా నయీగావ్లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు లక్ష్మీభాయి, ఖండోజీలు. సావిత్రీబాయి వారి పెద్దకుమార్తె. పెళ్ళైన రెండుసంవత్సరాలకు సావిత్రీబాయి కాపురానికి వచ్చింది. అప్పటికి జోతిబా విద్యార్ధిగా చదువుకుంటున్నారు.
సావిత్రీబాయిది అత్తగారులేని సంసారం. అనతికాలంలోనే ఆమె ఉమ్మడి కుటుంబంలో కలిసిపోయింది. మామగారు గోవిందరావు సావిత్రిబాయిని చాలా వాత్సల్యంగా చూశారు. అన్నిపనులు త్వరగా నేర్చుకుని ఇంటిలో తలలో నాలుకగా మారింది. గోవిందరావుది పూల వ్యాపారం. మరోప్రక్క పూల తోటల వ్యవసాయం, ఇంటిపనులు చూసుకుని భర్తతో కలిసి పొలంపనులకు సావిత్రిబాయి వెళుతుండేది. పుస్తకాలు చదివే జ్యోతిబాని అతని చేతిలోని పుస్తకాలని ఆపేక్షగా చూసేది. ఆనాడు మహిళలు పాఠశాలకు వెళ్ళి చదువుకునే అవకాశంలేదు. సావిత్రిబాయి కోరికను గమనించి జ్యోతిబా భార్యతో ప్రాథమిక విద్య చదవడం, వ్రాయడం ఇంటిలోనే నేర్పారు.
ఒక కుటుంబం కాని, ఒక కులంకాని వెనుకబడిన తనంనుండి బయటపడి ప్రగతిమార్గాన ముందుకు వెళ్ళాలంటే ఈ వర్గాలకు చదువు అందించాలన్నది జోతిబాఫూలే నిశ్చితాభిప్రాయం. ఇదే విషయాన్ని తరువాత కాలంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానందులు, కందుకూరి వీరేశలింగం పంతులు, భాగ్యరెడ్డి వర్మ, డా॥ అంబేడ్కర్, వేమూరి రాంజీరావు, ఇలా ఎందరో విశ్వసించి నిమ్నవర్గాల విద్యకోసం కృషిచేశారు. వేద కాలంలో తపస్సుచేసి వేదమంత్రాలను దర్శించినవారిలో అన్నివర్గాల మహిళలూ మనకు కనబడతారు. తరువాత కాలంలో కొన్ని కులాలవారికి పాఠశాలలకు వెళ్ళేఅవకాశం లేకుండా పోయింది. దాంతో ఈ కులాలవారు అన్నివిధాలా మరింతగా వెనుకబడ్డారు. మహాత్మా జోతిబాఫూలే ఈ నిమ్నకులాల దుస్థితిని గమనించి ఈ నిమ్నకులాల కొరకు ప్రత్యేక పాఠశాలలు ప్రారంభం కావాలని ఉద్యమించారు. శూద్రులుగా పిలువబడేవారు ఈ వెనుకబడ్డ నిమ్నకులాలలో ఒక పెద్ద భాగం కాగా, అస్పృశ్యులుగా పిలువబడుతున్న మరికొన్ని కులాలవారు ఇంకా ఎంతో వెనుకబడ్డారు. ఈ అస్పృశ్య కులాలవారికి జ్యోతిబా ఫూలే ‘అతి శూద్రులు’ అనే కొత్త నామకరణం చేశారు. జ్యోతిబా ఫూలే గొప్పతనం ఏమిటంటే వారు అత్యంత వెనుకబడిన కులానికి చెందిన శూద్రులు, అతి శూద్రుల ఉన్నతికోసం జీవితాంతం కృషిచేశారు. ఒక ఇంట్లో ఒక మహిళ చదువుకుంటే ఆ ప్రయోజనం ఆ కుటుంబం అందరికీ లభిస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్న సావిత్రిబాయి అతిశూద్ర బాలికల కోసం పాఠశాల నిర్వహించాలని నిర్ణయించుకుంది.
జోతిబా ఫూలే దంపతులు తమ సొంత ఇంటిలోని బావిలో నీటిని వాడుకొనటం కోసం చుట్టుప్రక్కల ఉన్న అతిశూద్రులకు అవకాశం కల్పించారు. ఇది ఆనాడు ఎంతో సాహసోపేత చర్య. ప్రాథమిక విద్య జ్యోతిబా దగ్గర నేర్చుకున్న సావిత్రిబాయి పైచదువులను జోతిబా స్నేహితులయిన కేశవ శివరాం బాల్వార్కర్ జోషి, శివరాం యశ్వంత్ పరంజపేల వద్ద నేర్చుకుంది. ఆ తరువాత అహమ్మద్ నగర్లోని ఫెర్రర్ విద్యాసంస్థల్లోని మిచల్ స్కూల్లో ఉపాధ్యాయ శిక్షణ పొందింది. అతిశూద్ర బాలికలకు పాఠశాలను పెట్టడం మామ గోవిందరావుకు ఇష్టంలేదు. దాంతో జోతిబా, సావిత్రిబాయి ఇంటి నుండి బయటికి వెళ్ళవలసి వచ్చింది.
1851, జులై 3న చిప్లంకర్ వాడలోనూ, 1851, జనవరి17న రాస్తా పేటలోనూ, 1852, మార్చి 15న విఠల్ పథ్ లోనూ ఫూలే దంపతులు మిగిలినవారి సాయంతో మూడు పాఠశాలలను ప్రారంభించారు. చిప్లంకర్ వాడలో ప్రారంభించిన పాఠశాలకు సావిత్రిబాయి ప్రధానోపాధ్యాయురాలు. ఆమెతోపాటు విష్ణుపంత్ మహేశ్వర్, విఠల్ భాస్కర్ సహాయ ఉపాధ్యాయులుగా ఉండేవారు. తొలిరోజు వచ్చిన విద్యార్థులు ఎనిమిదిమంది. క్రమంగా ఈ సంఖ్య 48కి చేరింది.
ఇంటినుండి పాఠశాలకు నడిచి వెడుతున్న సావిత్రిబాయిని ఇళ్ళ అరుగుమీద కూర్చున్న పెద్దకులాల మగవారు అనేక విధాల అవమానిస్తూ మాట్లాడేవారు. పేడను చల్లిన సందర్భాలూ అనేకం. సావిత్రిబాయి స్కూలుకు వెళ్ళే సమయంలో వారి సంచీలో మరొక చీర పెట్టుకుని వెళ్ళేది. పేడమరకలు కల్గిన చీరను స్కూల్లో మార్చుకుని, పాఠశాలలో మరొక చీరను ధరించేది. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ పాతచీరను, పేడ మరకలు గల్గిన చీరను ధరించేది. ఈ అవమానాలను, భయపెట్టడాన్ని ఆమె ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది. ఒకరోజు సావిత్రిబాయి మార్గానికి ఒక గూండా అడ్డుగా నిలిచాడు. అతడి రెండు చెంపలను ఆమె చెళ్ళుమనిపించింది. పాఠశాలకు విద్యార్థినులను రాకుండా చేయటంకోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. అన్ని ప్రతికూలతల మధ్య ఎంతో సంయమనంతో ఆమె వ్యవహరించింది. ఈ పాఠశాల మొదటి సంవత్సరం పరీక్షలు 1852, ఫిబ్రవరి 17 లోనూ, రెండో సంవత్సరాంత పరీక్షలు 1853, ఫిబ్రవరి 12 లోనూ పూణే కళాశాలలో జరిగాయి. పరీక్షలు వ్రాస్తున్న ఆడపిల్లలను చూడడానికి 3000 మందికి పైగా జనం గుమికూడారని ఆనాటి పత్రికలు వ్రాశాయి. ఆ సంవత్సరం పరీక్షలకి 137 మంది బాలికలు హాజరయ్యారు. ఫూలే దంపతుల కృషిని ప్రజలు, ప్రభుత్వము గుర్తించారు. ప్రభుత్వం కూడా ఆర్ధిక సాయం చేయటం ప్రారంభించింది.
పిల్లలు బడికి రావాలంటే తల్లిదండ్రుల్లో ఉత్సాహం కలిగించాలి. అందుకే ముందుగా ఆమె వివాహితులయిన స్త్రీలను కలిసింది. వారికోసం చిన్నచిన్న చేతిపనులు, పరిశుభ్రత మొదలైన అంశాలపై తరగతులు నడిపేది. పెద్దవారికోసం ఫూలే దంపతులు రాత్రి పాఠశాలను ప్రారంభించారు. బడిలో ఉన్న పిల్లలకోసం జాతర, క్షేత్ర (తీర్థాలు, ఉత్సవాలు) యాత్రలు నిర్వహించేవారు. దీనితో విద్యార్థుల్లో చదువుపట్ల ఉత్సాహం పెరిగింది. మధ్యలో పాఠశాల మానివేసే విద్యార్థుల సంఖ్య తగ్గింది.
పూనేలో చదువుకోవడానికి దూరప్రాంతాలనుండి వచ్చే విద్యార్థినులకు ఫూలే దంపతులు తమ ఇంట్లోనే వసతి ఏర్పాటుచేశారు. దాంతో ప్రక్క గ్రామాలనుండి కూడా విద్యార్థినులు ఎక్కువ సంఖ్యలో ఈ పాఠశాలలో చదువుకునే వారు. ప్రథమ ప్రపంచ యుద్ధం కారణంగా ఆంగ్లేయ ప్రభుత్వం ఈ పాఠశాలలకు ఇచ్చే ఆర్థికసాయం తగ్గించి వేసింది. అయినా జోతిబా దంపతులు ప్రజల ఆర్ధిక సాయంతో ఈ పాఠశాలలను కొనసాగించారు.
జోతిబా ఫూలే దంపతులకు పిల్లలు లేరు. దాంతో బంధువులు జోతిబాను మరోవివాహం చేసుకోవలసిందిగా కోరారు. పిల్లలు లేకపోవటానికి లోపం భర్తది కావచ్చు, భార్యది కావచ్చు. అంతమాత్రాన మరో వివాహం చేసుకోవటం తగదని జోతిబా తిరస్కరించారు. ఆ సమయంలో ఒక పెద్ద దుర్ఘటన జరిగింది.
క్రీ॥శ॥ 1863లో కాశీబాయి అనే పేద బ్రాహ్మణ వితంతువు జోతిరావు స్నేహితులు గోవాండే ఇంట వంటమనిషిగా పనిచేసేది. ఒకప్పుడు ఆమెది బ్రతికి చెడిన కుటుంబం. గోవాండే ఇంటి పొరుగున ఉండే శాస్త్రి అనే వ్యక్తి ఈమెని లొంగదీసుకున్నారు. ఆమె గర్భవతి అయింది. కడుపు తీయించుకుంటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. నిర్భాగ్యురాలైన ఆ స్త్రీ గత్యంతరంలేక ఆ బిడ్డను చంపి గోవాండే పెరడులోని పాడుబడ్డ బావిలో వేసింది. ఇది బయటకు తెలిసింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కోర్టు శిశుహత్యా పాతక నేరంక్రింద ఆమెకు జీవిత ఖైదు విధించి అండమాను జైలుకు పంపించారు. ఈ దుర్ఘటన ఆనాటి సమాజంలో పెను తుఫానును సృష్టించింది. సమస్యలకు పరిష్కారం వెతకటంలో ఫూలే దంపతుల తీరు చెప్పుకోదగ్గది.
క్రీ॥శ॥ 1864లో ఈ దంపతులు ఒక కరపత్రాన్ని ప్రచురించి పూణే నగరమంతా పంచారు. తమ ఇంటినెంబరు ఇస్తూ “వితంతువులయిన గర్భిణీ స్త్రీలు ఈ గృహంలో కనవచ్చు. ఇష్టమైతే ఆ పిల్లలని తీసుకుని వెళ్ళవచ్చు, లేదా ఆ పిల్లల సంరక్షణ మేమే తీసుకుంటాం. ఈ గృహానికి రాలేని వితంతువులు తమ బిడ్డని పెంచలేక పోయిన సందర్భంలో శిశుమందిరంలోని ఉయ్యాల తొట్టిలో వేసి వెళ్ళవచ్చు. ఆ బిడ్డని మేము పెంచుతాం” అని ప్రకటించారు. ఒక్క సంవత్సరంలోనే 32 మంది వితంతువులు అక్కడ పురుడు పోసుకున్నారు. ఈ కాన్పులన్నింటికీ సావిత్రిబాయి దగ్గరుండి పురుడుపోసింది. 56 మంది వితంతువులు తమ బిడ్డలను ఊయలలో వేసి వెళ్ళారు. 1873లో కాశీబాయి అనే మరొక వైష్ణవ వితంతువు బిడ్డను ఫూలే దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ శిశువుపేరు యశ్వంత్. ఆ యశ్వంత్ కు కులాంతర వివాహాన్నే చేశారు. జోతిబాఫులేను బ్రాహ్మణ ద్వేషిగా ఆరోపిస్తుంటారు. వారు బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకించారు.
1873లో బ్రాహ్మణ పురోహితుల అవసరం లేకుండా సత్యశోధన సమాజం ద్వారా యశ్వంత్ కు వివాహం జరిపించారు. “మనందరికీ తల్లి, తండ్రి భగవంతుడు. తల్లి ఎప్పుడూ తమ సంతానం పట్ల వివక్షను ప్రదర్శించదు. భగవంతుని దృష్టిలో మనందరం సమానమే. ఈ కుల అసమానతలు దేవుడి సృష్టికాదు. కొన్ని ఆధిపత్య వర్గాల సృష్టి. ఈ ఆధిపత్య భావనని తొలగించి సమసమాజం నిర్మించటమే సత్యశోధక సమాజం యొక్క లక్ష్యం.”.
జులై 1887లో జోతిబాకు గుండెపోటు వచ్చింది. నాలుగునెలల తర్వాత పక్షవాతం కూడా వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో 1890, నవంబర్ 28న జ్యోతిబా తనువు చాలించారు. తన భర్త అంత్యేష్టిని సావిత్రిబాయే స్వయంగా చేశారు. భర్త మరణించినా ఆమె నీరసించి పోలేదు. జోతిబా ఫూలే కుమారుడు యశ్వంత్ కు చదువు నిమిత్తం బరోడా మహారాజు వెయ్యి రూపాయలను సహాయంగా పంపించారు. ఆ వెయ్యి రూపాయలను ఒక కంపెనీలో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీ రూ॥ 50ను సావిత్రిబాయికి జీవితాంతం అందించే ఏర్పాటు చేశారు.
1893 నుండి 1896 వరకు సత్యశోధన సమాజానికి సావిత్రిబాయి అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 1896లోకరువు ఏర్పడిన సమయంలో ప్రజలను ఎంతగానో ఆడుకున్నారు. 1897లోపూణేలో ప్లేగువ్యాధి వ్యాపించింది. ఆంగ్లేయ అధికారులు ప్లేగువ్యాధి బారిన పడిన ప్రజల పట్ల, రోగులపట్ల ఎంతో కర్కశంగా వ్యవహరించారు. ప్లేగువ్యాధి బాదితులకు వైద్య సహాయం అందించటం కోసం తన కుమారుడు యశ్వంత్ ను మిలటరీ నుండి వెనక్కు పిలిపించింది. ప్లేగువ్యాధి బారిన పడిన రోగులకు సేవచేయటంతో సావిత్రిబాయికి కూడా ప్లేగువ్యాధి సోకింది. దాంతో 1897, మార్చి10న సావిత్రిబాయి తనువు చాలించారు.
సావిత్రిబాయి రచనలు ప్రధానంగా అయిదు ఉన్నాయి.
1. కావ్య ఫూలే, 41 కవితల సంకలనం.
2. జోతిబా ఉపన్యాసాలు.
3. సావిత్రిబాయి జోతిబాకు వ్రాసిన మూడు ఉత్తరాలు.
4. సావిత్రిబాయి ఉపన్యాసాలు.
5. పవన్ కాశీ సుబోధ రత్నాకర్, ఇందులో చరిత్రకు సంబంధించిన అంశాలు, జోతిబా కృషి, సావిత్రిబాయి రచించిన 52 కవితలు ఉన్నాయి.
సావిత్రిబాయి ప్రారంభించిన మహిళా విద్య ఉద్యమాన్ని అనంతర కాలంలో అనేకమంది అందిపుచ్చుకున్నారు. 1854లో బెంగాల్ కి చెందిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బాలికా పాఠశాలను ప్రారంభించారు. వీరేశలింగం పంతులుగారు 1874లో ధవళేశ్వరంలో ఒక బాలికా పాఠశాలను, 1881లో రాజమండ్రిలో మరో బాలికా పాఠశాలను ప్రారంభించారు. శారదామాత ఆశీస్సులతో 1898లో సోదరి నివేదిత కలకత్తాలో ఒక బాలికా పాఠశాలను ప్రారంభించారు. 1905లో హైదరాబాదులో షెడ్యూలు కులాల బాలికల కోసం భాగ్యరెడ్డివర్మ పాఠశాలను ప్రారంభించారు. ఈనాడు బాలికలు, యువతులు పోటీపడి అన్ని రంగాలలో సమానంగా ఉండడానికి ఆనాడు సావిత్రీబాయి వేసిన పునాదిరాయి ఎంతో కీలకమైనది. చదువుకొనే అవకాశం, బయటకు వచ్చే అనుమతి లేని కాలంలో సావిత్రిబాయి చేసిన సామాజిక కార్యాలు నేటికీ మనందరికీ, ప్రత్యేకించి మహిళలకు అడుగడుగునా ఆదర్శప్రాయం కాగలదు.
మామా పరమానంద 1890, జులై 31న సావిత్రిబాయి సేవల గురించి మహరాజ శయ్యాజి గైక్వాడ్ కి వ్రాసిన ఉత్తరంలో ఈ విధంగా పేర్కొన్నారు.
జోతిరావు కంటే సావిత్రిబాయి ఎక్కువ ప్రశంసార్హమైనది. ఆమెను ఎంతగా ప్రశంసించినా సరిపోదు. అసలు ఆమె మూర్తిమత్వాన్ని మాటలతో మనం ఎలా వివరించగలం? తన భర్తకు ఆమె అన్ని విధాలా సహకరించింది. ప్రతిపనిలోనూ కష్టాన్ని, నష్టాన్ని, బాధని పంచుకుంది. ఇటువంటి త్యాగనిరతి ఉన్న మరొక స్త్రీని చూడడం సాధ్యంకాదు. ఈ దంపతులు తమ పూర్తి జీవితాన్ని ప్రజలకోసమే వినియోగించారు.
– K. శ్యాంప్రసాద్, సామాజిక సమరసత జాతీయ కన్వీనర్.