భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి విదేశాలలో ఉంటూ ఎంతో సహకరించిన ప్రఖర జాతీయవాది, దేశభక్తుడు శ్రీ శ్యాం జీ కృష్ణ వర్మ.
ఆయన తన క్రియాశీలక జీవితాన్ని, భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్నపుడు యూరోప్ ఖండంలో గడిపారు. ఈ సమయంలో దేశంలోని స్వతంత్ర్య వీరులకు ఒక ప్రధాన సహాయ కేంద్రంగా, వారి కార్యకలాపాలకు కావలసిన వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ కీలక పాత్రను పోషించారు.
“ఇండియన్ సోషియాలజిస్ట్” అనే మాసపత్రిక ను ప్రారంభించి విప్లవ భావాలను ప్రచారం చేశారు. ఫిబ్రవరి 1905 లో ఆయన “ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ” ని స్థాపించి, భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు.
స్వామి దయానంద సరస్వతి “సత్యార్థ ప్రకాశం ” మొదలైన అనేక పుస్తకాలవల్ల ఆయన సిద్ధాంతాలకు, రచనలకు, జాతీయవాద భావనలకు ఎంతో ప్రభావితులైన శ్యాంజీ కృష్ణవర్మ ఆయనకి అభిమానిగా మారారు. దయానంద సరస్వతి స్పూర్తితో ఇంగ్లాండ్ లో “ఇండియా హౌస్” ను ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్ లో పర్యటించే భారతీయులకు ఇది ఎంతో సహాయంగా ఉండేది. వినాయక దామోదర్ సావర్కర్, లాలా హరదయాల్, బీరెన్ చటోపాధ్యాయ, వివి అయ్యర్ మొదలైనవారు చాలామంది ఈ ఇండియా హౌస్ ద్వారా ప్రయోజనం పొందారు.
శ్యాం జీ కృష్ణ వర్మ తన ఉపన్యాసాల ద్వారా, పుస్తకాల ద్వారా, కరపత్రాల ద్వారా భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తూ ఉండేవారు. తాను నిర్వహిస్తున్న రాజకీయ కార్యకలాపాల కారణంగా ఆయన ఇంగ్లాండ్ ను వీడవలసి వచ్చింది. అక్కడి నుండి ఆయన పారిస్ కు వెళ్లి, భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని సమర్థిస్తూ తిరిగి తన కార్యక్రమాలను నిర్వహించారు.
మొదటి ప్రపంచ యుద్దం కారణంగా పారిస్ లో కూడా ఎక్కువ కాలం ఉండలేక పోయారు. అక్కడి నుండి స్విట్జర్లాండ్ లోని జెనీవాకు వెళ్లి తన శేష జీవితాన్ని అక్కడే గడిపారు. జెనీవాలో మార్చ్ 30, 1930 న శ్యాం జీ కృష్ణ వర్మ పరమపదించారు.