1971 బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్తాన్ అరాచకాలు
బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో మానవత్వాన్ని మంటగలిపిన అరాచకాలు అనేకం. అలాంటి సంఘటనలను ఎవరు మరచిపోలేరు. ఆనాటి ఆ దారుణాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ బంగ్లాదేశీయుల్లో నిలిచే ఉన్నాయి.
డిసెంబర్ 3, 1971 న పాకిస్తాన్ వంచనతో వాయువ్య భారత వైమానిక స్థావరాలపై దాడి చేయడంతో మూడవ భారత్- పాకిస్తాన్ యుద్దం మొదలైంది. పాకిస్తాన్ అవమానకరమైన ఓటమితో ముగిసిన ఈ యుద్ధం, విముక్తి పోరాటం తరువాత బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించడానికి, సార్వభౌమరాజ్యంగా ఆవిర్భవించడానికి దారితీసింది. అంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం 1971 మార్చి 25 రాత్రి నుండి తన క్రూరమైన అణిచివేతను ప్రారంభించి డిసెంబర్ 16 వరకు సాగించిన మారణహోమం,సామూహిక అత్యాచారాల పూర్తి వివరాలు బయటకు వచ్చాయి.
సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం పాల్పడిన భయంకరమైన దారుణాల గురించి కధనాలు ఇప్పటికే కొంత సమాచారాన్ని ఇచ్చాయి. ఇప్పుడు పూర్తి వివరాలు వెలువడటం ప్రారంభమైంది. గణాంకాల ప్రకారం – మూడు మిలియన్ల మంది ప్రజలు వధించబడ్డారు, 500,000 మంది మహిళలను అత్యాచారం చేశారు ( అధికారిక లెక్క 200,000 మాత్రమే), 10 మిలియన్లకు పైగా శరణార్థులుగా భారతదేశానికి పారిపోయారు, 30 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఇటువంటి భయంకరమైన గాయాలను ఏ దేశమూ మర్చిపోలేదు.
జమాఅత్-ఇస్లామి బంగ్లాదేశ్ (జమాఅత్), దాని విద్యార్థి విభాగం ఇస్లామి ఛత్రా షిబిర్ (1971 వరకు ఇస్లామి ఛత్రా షాంఘా), దాని మిత్రసంస్థలు నెజామ్-ఇ-ఇస్లామి, అల్-బదర్, అల్-షామ్స్, రజాకర్లు తో పాటు ఇతర అనుబంధ సంస్థలు ఈ మారణహోమం, సామూహిక అత్యాచారాల వివరాలు బయటికి రాకుండా శాయశక్తులా ప్రయత్నించాయి. షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్య తరువాత అధికారాన్ని చేజిక్కించుకున్న మేజర్ జనరల్ జియా-ఉర్ రెహ్మాన్ (జియా) కూడా ఈ దారుణాలకు పాల్పడినవారికి పునరావాసం కల్పించడంతో పాటు అవామి లీగ్‌ను పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. బంగ్లాదేశ్ ను ఇస్లామీకరణ చేయాలనే ఆలోచనతో విముక్తి తరువాత 1972 బంగ్లాదేశ్ రాజ్యాంగంలో పొందుపరచబడిన లౌకికవాదాన్ని పూర్తిగా పక్కకుపెట్టి చేసి పాకిస్తాన్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు.
షేక్ ముజిబర్ రెహ్మాన్ ద్వారా స్థాపించబడిన అత్యాచార బాధితుల, హింసించబడిన మహిళల కోసం పునరావాస కేంద్రాలను జియా ప్రభుత్వం మూసివేసింది. ఇది విముక్తి పోరాట బాధితుల పట్ల జియా వైఖరిని వెల్లడించింది. ఆ తరువాత రెండు తిరుగుబాట్లలో ఇద్దరు పౌర అధ్యక్షులను తొలగించిన తరువాత, డిసెంబర్ 11, 1983 న అధికారంలోకి వచ్చిన లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎం ఎర్షాద్ కూడా ప్రజాగ్రహం వల్ల 1990 డిసెంబర్ 6 న అధ్యక్ష పదవికి రాజీనామా చేయవలసి వచ్చే వరకు, అదే విధానాన్ని కొనసాగించారు.
తన పుస్తకం ‘బంగ్లాదేశ్ జెనరల్డర్ మోన్’ (ది మైండ్ ఆఫ్ బంగ్లాదేశ్ జనరల్స్) ప్రస్తావనలో ముంతాసిర్ మామూన్ పాకిస్తాన్ ధోరణిని జనరల్ జియా, ఎర్షాద్ మొదలైనవారు పూర్తిగా అలవరచుకున్నారని వ్రాశాడు. వారిలో ఎర్షాద్ అయితే తీవ్రమైన మతతత్వం, వేర్పాటువాదం, హింస, విపరీతమైన భారతీయ వ్యతిరేకత, పౌర అధికారాన్ని నాశనం చేయడం వంటి వాటికి పాల్పడ్డాడు. 21 మంది బంగ్లాదేశ్ జనరల్స్ లో 20 మంది పాకిస్తాన్ లోని అబోటాబాద్‌లోఉన్న పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందారని, దానివల్ల వారికి తప్పనిసరిగా పాకిస్తాన్ మనస్తత్వం అలవాటైందని మామూన్ తన ప్రస్తావనలో పేర్కొన్నారు. వారిపై శిక్షణ ప్రభావం చాలా బలంగా ఉండడంతో వారు బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొన్నప్పటికీ ఆ మనస్తత్వం నుంచి బయటపడలేకపోయారు. కాబట్టి వారు జమాత్‌తో సహజమైన అనుబంధాన్ని కలిగి ఉండటంలో ఆశ్చర్యం లేదు.
బేగం ఖలీదా జియా ప్రధానమంత్రిగా 1991 నుండి 1996 వరకు సాగిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మొదటి ప్రభుత్వపు ఎజెండా వేరే ఉండేది. జియాను విముక్తి పోరాటపు ఏకైక హీరోగా చూపించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నించింది. అందుకని దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి మూలం, బంగ్లాదేశ్ పితామహుడిగా గుర్తింపు పొందిన షేక్ ముజిబుర్ రెహ్మాన్ పాత్రను మరుగున పరచడానికి ప్రయత్నించింది.
అయినప్పటికి ఆనాటి భయంకరమైన ఆ జ్ఞాపకాలు ఎవరూ మరచిపోలేదు. ముఖ్యంగా బాధిత కుటుంబాలు, వారి పిల్లలు ఇప్పటికి ఆనాటి మారణకాండ, అత్యాచార సంఘటనలను మరచిపోలేదు. సాధారణంగా తరాలు మారేకొద్ది అనేక విషయాలు మరుగున పడిపోతాయి. కానీ బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాట సంఘటనలు మాత్రం అలా మరుగున పడలేదు. దానికి కారణం రెండు గొప్ప సంస్థలు, వాటి నాయకులు.
ఆ రెండు సంస్థల్లో మొదటిది, 1992 జనవరిలో స్థాపించబడిన ఏకాటురర్ ఘటక్ దలాల్ నిర్ముల్ కమిటీ ( 71నాటి సంఘటనలకు బాధ్యులైనవారిని శిక్షించడానికి ఏర్పడిన కమిటీ), 1971 లో పాకిస్తానీయులతో కలిసి అమాయకులను చంపినవారిపై విచారణ జరిపించించడానికి ప్రయత్నించింది. షహ్రియార్ కబీర్ రాసిన పుస్తకం, ఏకాటొరర్ ఘటక్ ఓ దలాల్రా కే కొథాయే (71నాటి హంతకులు) బాధ్యులను గుర్తించడంలో ముఖ్య పాత్ర పోషించింది. పాకిస్తానీయులతో పాటు దారుణాలకు పాల్పడిన జమాత్ నుండి గులాం అజామ్, అలీ అహ్సాన్ మొహమ్మద్ మొజాహీద్,క్వాడర్ అలీ మొల్లా వంటి బంగ్లాదేశీయులపై దృష్టి సారించడం ద్వారా 1971 నాటి జ్ఞాపకాలను సజీవంగా ఉంచడంలో ఈ సంస్థ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. వీరంతా జమాఅత్‌కు చెందినవారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ప్రఖ్యాత బంగ్లాదేశ్ చరిత్రకారుడు ప్రొఫెసర్ ముంటాసిర్ మామూన్ చొరవతో మే 17, 2014 న స్థాపించిన 1971 మారణకాండ మ్యూజియం ఆనాటి జ్ఞాపకాలను భద్రపరచడంలో మరింత ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది మొత్తం దక్షిణాసియాలోని ఏకైక మారణహోమ మ్యూజియం. అందుకనే దీని ప్రాముఖ్యతను గుర్తించిన షేక్ హసీనా ఈ మ్యూజియానికి భూమిని, భవనాన్ని ఇచ్చింది. ఈ మ్యూజియం మార్చి 26, 2016 నుండి తన సొంత ప్రాంగణం నుండి పనిచేయడం ప్రారంభించింది.
ఈ మ్యూజియం మారణహోమం నాటి జ్ఞాపకాలు, దానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ చేసిన పోరాట వివరాలను భద్రపరచడానికి కృషి చేస్తోంది. దీని కోసం అనేక సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తోంది. తాజాగా నవంబర్ 22 మరియు 23 తేదీలలో ఢాకాలో “1971 నాటి మారణహోమం: బంగ్లాదేశ్ గోల్డెన్ జూబ్లీ మరియు బంగాబందు షేక్ ముజిబూర్ రెహ్మాన్ జన్మశతాబ్ది” అనే శీర్షికతో సెమినార్ జరిగింది. ఇందులో షేక్ ముజిబూర్ రెహ్మాన్ జీవితంతోపాటు బంగ్లాదేశ్‌ను స్వాతంత్ర్యం వైపు నడిపించడంలో ఆయన పాత్ర, విముక్తి యుద్ధం, జరిగిన సామూహిక హత్యలు, అత్యాచారాలతో పాటు విముక్తి పోరాటంలో పాల్గొన్న వారికి న్యాయం చేయాల్సిన అవసరం లాంటి మొత్తం విషయాలపై చర్చించారు.
.....హిరణ్మయ్ కార్లేకర్ - Vishwa Smavadam