హిందుస్థాన్ అంటే భయమెందుకు?
క్రాంతి దేవ్ మిత్ర...
ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ జీ ‘హిందుస్థాన్ లో ఉన్నవారు హిందువులే’ అనడాన్ని కొందరు సోకాల్డ్ మేధావులు, రాజకీయ నాయకులు, జాతీయ మీడియా రాద్దంతం చేయడం విచిత్రంగా అనిపపిస్తోంది.. భాగవత్ జీ చెప్పింది వాస్తవం కాదా?.. మన దేశాన్ని ఒకప్పుడు హిందుస్థాన్ అనే పిలిచేవారు కదా? మరి భారత్ గానే ఎందుకు పరిమితమైంది?.. హిందుస్థాన్ మతతత్వం, సంకుచితత్వం ఎందుకైంది?.. ఒక్కసారి ఆలోచించండి..
ప్రపంచంలో ఏ దేశానికైనా ఒకే పేరు ఉంటుంది.. కానీ మన దేశానికి ఇంగ్లీషులో ’ఇండియా’ అంటారు.. హిందీ, తెలుగు ఇతర ప్రాంతీయ భాషల్లో ’భారత్’ అంటున్నారు.. ఇంకాస్త వెనక్కి వెళ్లితే ‘హిందుస్థాన్’ అని పిలిచేవారు.. భాష మారినంత మాత్రాన దేశం పేర్లు ఇలా మారిపోవడం ఏమిటో?.. మన పేర్లను కూడా ఒక్కో భాషలో ఒక్కో రకంగా మార్చుకుంటున్నామా?.. మరి మన రాజ్యాంగ పెద్దలు ఎందుకిలా చేశారు?.. అది తర్వాత విషయం.. స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన దేశాన్ని ‘హిందుస్థాన్’ అనే పిలుచుకునే వాళ్లం.. ‘భారత్’ అనే పేరు కూడా వాడుకలో ఉంది.. మన వివాహాది శుభ కార్యాల్లో ‘జంబూ ద్వీపే.. భరత ఖండే.. అనే సంకల్ప మంత్రాన్ని వినే ఉంటారు.. భరతుడు, భరత ముని నుండి ఈ పేరు వచ్చిందంటారు మన పెద్దలు..
మరి ‘హిందు’ పదం సంగతో?.. నిజానికి మన దేశంలో మెజారిటీ ప్రజలు అనుసరించే ధర్మం సనాతన ధర్మం.. మనకు ఎన్నో రకాల ఆరాధ్య పద్దతులు ఉన్నాయి.. ఎందరో దేవుళ్లను దేవతలను మనం పూజిస్తాం.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఈ ధర్మం తరతరాలుగా కొనసాగుతూ వచ్చింది.. హిందు అనే పేరు సింధు నది నుండి వచ్చింది.. పాశ్చాత్య దేశాల వైపు నుండి చూస్తే మనం సింధూ నదికి ఆవల ఉన్నవారం.. సింధును వారు ఇండస్ లేదా హిండస్ అని పిలిచేవారు .. అలా మనం ఇండియన్స్ అయ్యాం.. సింధూస్ కాస్తా హిందూస్ అయిపోయాం..
హిందుస్థాన్ అంటే అభ్యంతరం ఎందుకు ఉండాలి? ఈ పదాన్నేమైనా మోహన్ భాగవత్ జీ లేదా ఆరెస్సెస్ కొత్తగా సృష్టించిందా?.. స్వాతంత్ర్యానికి ముందు నుండీ వాడుకలో ఉన్నదే కదా.. ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ పాలనా కాలం నాటి దేశ చిత్ర పటాలు హిందుస్థాన్ పేరిటే ఉన్నాయి.. నేతాజీ సుభాష్ బోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ ఇచ్చిన ‘జై హింద్’ నినాదం దేనికి సంకేతం? అది ఇప్పటికీ వాడుకలోనే ఉంది.. మన దేశంలో 136 సంవత్సరాల చరిత్ర ఉన్న ‘ద హిందూ’ పత్రిక, హిందీ-ఆంగ్ల భాషల్లో ప్రచురిస్తున్న హిందుస్థాన్ హిందుస్థాన్ టెమ్స్.. హిందుస్థాన్ మోటార్స్.. ప్రభుత్వ రంగ సంస్థలు మనకు పెట్రోల్, గ్యాస్ సరఫరా చేసే హిందూస్థాన్ పెట్రోలియం (హెచ్.పి.సి.ఎల్) హిందుస్థాన్ షిప్ యార్డ్, హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్.సీ.ఎల్) హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్).. అలాగే బహుళజాతి సంస్థ హిందుస్థాన్ లీవర్ కంపెనీ.. ఇవన్నీ దేనికి ప్రతీకలు.. నేటికీ పాకిస్థాన్తో సహా మన ఇరుగు పొరుగు దేశాలు, గల్ఫ్ దేశాలు మన దేశాన్ని హిందుస్థాన్ గానే గుర్తిస్తున్నాయి.. మహమ్మద్ ఇక్బాల్ ‘సారే జహాసె అచ్చా.. హిందూ సితాహ్ హమారా’ ఆలపించలేదా? 40,50 ఏళ్ల క్రితం వరకూ కూడా మన దేశంలో చరిత్ర పుస్తకాలు ‘హిందూ దేశ చరిత్ర’ పేరిట ఉండేది.. వీటిని మన ప్రభుత్వమే ముద్రించింది.. కానీ కాల క్రమంలో ఈ పుస్తకాల పేర్లు ‘భారత దేశ చరిత్ర’గా మారిపోయాయి.. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ వెళ్లితే హిందూ దేశ చరిత్ర పుస్తకాలు చూడొచ్చు.. తరం మారగానే చరిత్ర మారదు.. కానీ నెహ్రూ, ఇందిరల హయాంలో చరిత్ర రచన అంతా వామపక్ష మేధావుల చేతిలో పడింది.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా వారి సైద్ధాంతిక పైత్యంతో చరిత్ర రచనలో గందరగోళానికి తెరలేపారు.. అలా ‘హిందుస్థాన్’ అనే పదానికి పాతరేశారు..
హిందు అనే పేరు ఒక మతానికికే పరిమితం ఎలాగైంది?.. ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘ్ చాలక్ విశాల దృక్పథంతో హిందుస్థాన్ గురుంచి మాట్లాడితే అందులోని వాస్తవ కోణాన్ని గమనించకుండా కోడి గుడ్డుపై ఈకలు పీకడం ఎందుకు?.. ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ వారు, అమెరికాలో అమెరికన్స్, చైనాలో చైనీస్, పాకిస్తాన్లో పాకీస్తానీస్ ఉన్నట్లే మన హిందుస్థాన్లో ఉండే వారంతా హిందూసే.. అందులో తప్పేముంది?.. సో.. ‘గర్వ్ సే కహో.. హమ్ హిందుస్థానీ హై..’ జై హింద్..
Courtesy : MKD Mitra