తిరువనంతపురం: ‘ఆర్‌ఎస్‌ఎస్ స్వయసేవక్ సంజిత్‌ను హత్య చేయడం చాలా దురదృష్టకరం, అత్యంత శోచనీయం. ఈ ఉగ్ర చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, మరణించిన వారి కుటుంబానికి అండగా నిలుస్తాము’ అని ఆర్‌ఎస్‌ఎస్ సహ సర్ కార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య అన్నారు. ఇతర సీనియర్ కార్యకర్తలతో కలిసి, కేరళలోని పాలక్కాడ్‌లో సంజిత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
‘ప్రజాస్వామ్యంగా ఎన్నికైన కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి లక్షిత హత్యలను నిరోధించడంలో విఫలమవడం చాలా దయనీయంగా ఉంది. స్వయం సేవకులను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడంలో అధికార సీపీఎం, ఇస్లామిస్ట్ శక్తుల మధ్య నిశ్శబ్ద అవగాహన ఉందని, మునుపటి అనుభవాల నుండి స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయంపై విచారణ జరిపి హింసకు పాల్పడిన వారిపై వీలైనంత త్వరగా కేసులు నమోదు చేసి శిక్షించాలి’ అని డాక్టర్ మన్మోహన్ వైద్య సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
‘సీపీఎం ప్రభుత్వ హయాంలో న్యాయం జరగకపోతే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. సంజిత్ హత్యకు పాల్పడిన వారికి ఉగ్రవాద సంబంధాలు ఉన్నందున దీనిపై సమగ్ర ఎన్‌ఐఎ విచారణను కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మరింత దర్యాప్తు చేయాలని మేము రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దేశ వ్యతిరేక కార్యకలాపాలు… సమాజంలో మత సామరస్యాన్ని, శాంతిని నాశనం చేయడమే ఏకైక లక్ష్యంతో పనిచేసే పీఎఫ్‌ఐ ఉగ్రవాద సంస్థను నిషేధించండి’ అని అన్నారాయన.
ఈ నెల 15న ఉదయం తొమ్మిది గంటలకు మంబ్రం పాలక్కాడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ తెనేరి మండల్ బౌద్ధిక్ ప్రముఖ్ సంజిత్‌ను దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. సంజిత్‌ను చంపడానికి అనేకసార్లు ప్రయత్నాలు జరిగాయి. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలావుండగా, కొన్ని వారాల క్రితం, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని లొకేషన్ సమాచారాన్ని సేకరించినట్టు సమాచారం. ఈ సంఘటన తర్వాత, తనపై హత్యాయత్నం జరగవచ్చని ఊహించి, సంజిత్ తన భార్య ఇంటికి మారాడు. అయితే, దుండగులు అతని కొత్త ప్రదేశాన్ని ట్రాక్ చేశారు. సంజిత్‌ను హత్య చేయాలనే ఉద్దేశంతో అనేక మంది వ్యక్తులు అతని కదలికలను నిరంతరం అనుసరించారు.
సంజిత్ భార్య అర్షిక తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8.45-9 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే కారులో నలుగురు నుంచి ఐదుగురు వ్యక్తులు వెంటపడి, తమ బైక్‌ను ఆపారు. దుండగుల్లో ఒకరు ఆమెను సంజిత్‌కు దూరంగా నెట్టివేసి గట్టిగా పట్టుకున్నాడు. మరికొందరు సంజిత్‌ను రోడ్డుపైకి నెట్టి కత్తులు, ఇతర ఆయుధాలతో పలుమార్లు నరికి చంపారు. తన భర్తపై దాడి చేయవద్దని అర్షిక ఏడుస్తూ దుండగులకు విన్నవించినా వారు పట్టించుకోలేదు.
సంజిత్ శరీరంలో 31 లోతైన గాయాలు ఉన్నాయి. ఆ రోడ్డుపై వెళ్తున్న నగర పోలీసు అధికారి అతడిని చూసి ఆటోరిక్షాలో సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అయినా ఫలితం లేకపోయింది. కాగా, 27 ఏళ్ల సంజిత్ చాలా చురుకైన, శక్తివంతమైన వ్యక్తి. తన ప్రాంతమైన ఈలపుల్లిలో అన్ని సంస్థాగత కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండేవాడు.
కొంత కాలంగా ఇస్లామిక్ సంస్థలు ఈ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సంజిత్ హత్య జరిగిన వెంటనే, ఇస్లాంవాదులు తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లను ఉపయోగించి అతనిపై ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రారంభించారు. క్రూరమైన హత్యను సమర్థించేందుకు సంజిత్ పాత్రను హత్య చేయడమే లక్ష్యంగా సోషల్ మీడియా పోస్ట్‌లు ఉన్నాయి.
Source: Organiser - vishwa samvada kendram