స్వరాజ్యం బిచ్చమెత్తితే వచ్చేదికాదు, సంపాదించుకొనేది
నేడు మనదేశంలో చాలా సంస్థలు “డొమీనియన్ స్టేటస్” అనే ధ్యేయాన్ని తమ ముందుంచుకొని ఉన్నవి. దానిలోని సుగుణాలను వర్ణించుతూ పాటలుపాడుతూ ఉన్నవి. అటువంటి ఉపనివేశ రాజ్యప్రతిపత్తిని మనం కోరటం లేదు. ఉపనివేశ ప్రతిపత్తివంటి తక్కువస్థాయి లక్ష్యంకోసం వారు బ్రతిమాలాడుతున్నారు.
స్వరాజ్యం ప్రాధేయపడితే లభిస్తుందా ? ఎక్కడ మనం యజమానులమో, ఎక్కడ సర్వస్వమూ మనదే అయివున్నదో, మనదిగాక మరెవ్వరికీ ఏమాత్రం హక్షులేదో, అటువంటి ఇంటిలో “మాకు ఇది ఇవ్వండి, అదైనా ఇవ్వండి అంటూ అడుక్కోవటం శోభనివ్వదు. అధికారం మనదైన చోట, స్వాభిమానం నిండిన స్వరంతో అధికారపూర్వకంగా, మనం మన ఆకాంక్షలను పూర్తిచేసుకోవలసి ఉంటుంది. మనం బిచ్చమడగటం కోసం మన నోరు తెరవకూడదు. చేతులు చాచకూడదు. మనపై రాజ్యంచేస్తూ చేస్తూ తిష్టవేసిన వారినుండి స్వరాజ్యం మనం అడిగినంతమాత్రాన మనకు లభిస్తుందా ? యజమానిపట్ల భయభక్తులతో మెలగే కుక్కలు ఎలా బ్రతిమాలాడుకున్నాా వాటికి నాలుగు రొట్టిముక్కలు (కుక్కబిస్కెట్లు) మించి ఏమీ దొరకవు. అవే వాటిముందు పడేస్తారు. వాటివల్ల ఆ కుక్క మెడకు బిగించబడివున్న తోలుపట్టా తొలగేదిలేదు. అడుక్కునేవాళ్ళు ఎవరైనా మాకు ఫలాన వస్తువు కావాలి, అదే ఇవ్వండి అని అడుగగల్గుతారా ? బిచ్చగానిగా వ్యవహరిస్తూ ఉన్నంతకాలం దాస్యంగాక మరేదీ లభించదు.