ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద సేవకుల సంస్థగా పేరెన్నికగన్నది " రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ". అయితే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్వరూప స్వభావాలుగాని, ఆశయ ఆకాంక్షలుగాని, కార్యపద్ధతిగాని, బయటనుండి చూసేవారికి -మరీ ముఖ్యంగా వేర్వేరు రంగాలలో పనిచేసే అనేక సంస్థలను చూసే కళ్లద్దాలతో, వాటిని బేరీజు వేసేందుకు ఉపయోగించే ప్రమాణాలతో దీనినీ చూడగోరేవారికి ఈ సంస్థ ఒక పట్టాన అంతుపట్టదు.ఆ కారణాన ఈ సంస్థ గురించి ఎన్నో రకాల భ్రమలు, అనుమానాలు, భయాలు వ్యాపించి ఉన్నవి.
సంఘంలోచేరి పనిచేస్తున్న కార్యకర్తలకుకూడా తమజాతి(రాష్ట్రం)పట్ల అభిమానమూ, తమ జాతీయులపట్ల ప్రేమ, తమ సంస్కృతిపట్ల గౌరవమూ, తాము పనిచేసే తీరులో నిబ్బరమూ లేనట్లయితే, వారి కార్యశైలిలో హళాహళీ, తొందరపాటు, ఏదో సాధించినట్లు చాటుకోవాలనే అహంభావమూ చోటుచేసుకున్నట్లయితే అలాంటివారికి కూడా సంఘాన్ని అర్థం చేసుకోవటం కష్టమే.
మరి ఇన్ని కష్టాలూ, షరతులూ ఉంటే సంఘాన్ని అర్థం చేసుకొనేదెలా? అని సందేహించేవారికి - సంఘంలో పనిచేస్తూనే, సంఘాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తుండాలని పెద్దలు చెప్పుతుంటారు. అలా అర్థం చేసుకొనడానికి ఉపయోగపడే పుస్తకంగా 1965లో ఆనాటి సర్కార్యవాహ, అనంతర కాలంలో 22 సం||రాలపాటు సర్ సంఘచాలక్ గా సంఘాన్ని విజయపథంలో నడిపించిన, కార్యదక్షతను నిదర్శనమైన వ్యక్తి అయిన బాళాసాహబ్ దేవరస్పం జాబ్ ప్రాంత పర్యటనలో కురుక్షేత్రంలో కార్యకర్తల ముందుంచిన విషయాలు ఇప్పుడు తెలుగులో పుస్తకరూపంలో అందిస్తున్నాం. సంఘ సిద్ధాంత భూమికకు, కార్యపద్ధతికి, సంబంధించిన వివిధ కోణాలు, కార్యకర్తలు అలవరచుకోవలసిన గుణగణాలు ఈ వ్యాసాలలో హృద్యమైన శైలిలో వివరింపబడియున్నవి.
ఈ వ్యాసాలు పాఠకులకు సంతృప్తి కలిగించగలదని మా విశ్వాసం.
-ప్రకాశకులు
బాళాసాహబ్ దేవరస్
విషయసూచిక :
🚩🚩🚩🚩🚩🚩🚩