కార్యక్షేత్రంలో - సంకటాలను ఎదుర్కొనడానికి సిద్ధం కావాలి.
మనకూ ఒక్కొక్కసారి సందేహం కలుగుతూ ఉంటుంది. 'సంఘం ఉండగా కూడా దేశంలో ఇన్ని అనుచితకార్యాలు ఎందుకు జరుగుతున్నవి?' అని. మనం అర్థం చేసుకోవలసిన అంశం ఒకటే - అటువంటి అనుచితకార్యాలు జరగకుండా ఆపడానికి మనవద్ద ఎంత యోగ్యత, శక్తి ఉండవలెనో అంతగా అవి లేవు. మనకు ఎంతటి యోగ్యత, శక్తి ఉంటాయో, వాటికి అనుగుణంగానే మనకు ఏవైనా సిద్ధిస్తాయి. దోషం పరిస్థితిలో ఉండదు. ఆ ఆ పరిస్థితులలో మనభూమిక ఏమిటి, ఆ పరిస్థితిలో నిభాయించుకొనడానికి మన యోగ్యత, సామర్థ్యమూ ఏమిటి- అన్నదే మహత్వపూర్ణమైన అంశం. మనం ఎల్లప్పుడూ మన భూమికగురించి ఆలోచించుకోవటమే మంచిది.
పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నా, స్వయం సేవకులు కదలకుండా కూర్చొని ఉంటే, అనుకూల పరిస్థితులు అందజేయగల లాభమేముంటుంది? పరిస్థితుల నుండి లాభాన్ని పిండుకోవటమనేది మనం చేయవలసినపని. సంఘం అనేక రకాల పనులను నడిపించుతూ ఉన్నపుడు, వాటి కారణంగా కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమౌతాయి. మన దగ్గరకు వచ్చే వందలాది వ్యక్తులలోనుండి మెరికలను ఎంపిక చేసుకొని (చేటలో గింజలను చెరిగినపుడు పొట్టు ఎగిరిపోయి గింజలు మిగిలినట్లుగా) వారిని కార్యమగ్నులను చేయాలి. వారు నిలదొక్కుకునేటట్లుగా చూడాలి. మనం వేసుకొనే అంచనాలు అన్ని వేళలా ఫలించవు. సమస్యలు రానేరావు అని అనుకోకూడదు. కార్యకర్తలను ఎంపిక చేసుకోవటంలో అంచనాలు తప్పే ప్రమాదం ఎంతోకొంత ఉంటుంది. ప్రచారకు పెద్ద సంఖ్యలో రావాలని అనుకొంటున్నపుడు-కొన్ని ఇళ్ళలో ఇబ్బందులు కలుగుతాయి. నష్టాలు వాటిల్లుతాయి.
కొందరు వ్యక్తులు తమ జీవిత ప్రగతియాత్రలో వెనుకబడిపోతారు. (వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అవకాశాలు కోల్పోతారు). అయితే ఇలా పదిమందో, యాభైమందోవ్యక్తిగత జీవనంలో నష్టపోవటంలోనుండే ప్రచారకులు దృఢంగా నిలబడుతున్నారు. ఇటువంటి వ్యక్తుల ఆధారంగానే సంఘకార్యం వృద్ధి చెందుతూ ఉంది. శక్తిని సంతరించుకొంటున్నది. యుద్ధం జరిగినపుడు ఎన్నివిధాల కష్టనష్టాలకు సిద్ధమై ఉండవలసి ఉంటుందో, ఆ విధంగానే దేశకార్యంలో కూడా - ప్రమాదాలను, కష్టనష్టాలను భరించవలసి ఉంటుంది. నెపోలియన్ గురించిన ఒక ఉదంతం ఉంది. స్పెయిన్ కి వెళ్ళేందుకు ఒక దగ్గరి దారి ఉంది. అయితే, ఆ దారికి నలువైపులా పెద్ద పెద్ద పర్వతాలున్నాయి. ఆ పర్వతాలకు పైన, అవతలివైపునా శత్రు సేనలు పెద్దసంఖ్యలో ఉన్నవి. పర్వతాలపై శత్రువులు మోహరించి ఉండగా, ఆ దారిలోనుండి నెపోలియన్ తన సైనికులకు తీసికొని వచ్చే ప్రశ్న ఉండబోదని శత్రువులు అనుకున్నారు. అయితే నెపోలియన్ ఏం చేశాడు? శత్రువుల గ్రుడ్డి అంచనాను అవకాశంగా తీసికొని ఆ దగ్గరిదారిలోనే దూసుకుపోవలసిందిగా నెపోలియన్ తన సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. కొండలమీదనుండి కొమ్మబూరలు (బిగుల్స్) ఊదటంతో అటుప్రక్కన ఉన్న శత్రుసైన్యాలకు దడపుట్టి, పలాయనం చిత్తగించారు. ఏవిధంగానైతే యుద్ధంలో ఒక ప్రమాదం ఎదురైనపుడు దానికి మూల్యం చెల్లించి ముందుకు సాగిపోవలసి ఉంటుందో, అదేవిధంగా అన్ని రకాల ప్రమాదాలకు సిద్ధపడినవారికే కార్యక్షేత్రంలో విజయం లభిస్తుంది. ముందు ముందు ఎటువంటి పరిస్థితులు రానున్నవో, అందుకు తగిన విధంగా ఒక ముసాయిదాను, చట్రాన్ని ఇప్పటినుండే తయారు చేసుకోవాలి. రాబోయే 2-3 సంవత్సరాలలో పనిని బాగా పెంచేందుకు యోజన చేసుకొని ప్రయత్నం చేసినట్లయితే, పరిస్థితుల మూలంగా చేకూరే లాభమూ వచ్చికలుస్తుంది. ఆ విధంగా చాలా వేగంగా మనకార్యం వ్యాప్తి చెందగల్గుతుంది.
ఈ సమాజాన్ని చిరస్థాయిగా నిలిపి ఉంచే సాధనం సంఘమేనన్న భావన ప్రజలందరిలో తప్పక బలపడుతుంది. భయంతోనో, ఇతర కారణాలతోనో, ఇప్పుడువచ్చి మనప్రక్కన నిలబడలేని వారుకూడా మన ప్రక్కకు వచ్చి నిలబడగల్గుతారు. అప్పుడు ఒక చాలా పెద్ద శక్తి నిర్మాణం కాకుండా ఉండదు. ఇప్పుడు అందరి దృష్టి సంఘంవైపు కేంద్రీకృతమౌతున్నది. ప్రజలందరూ వచ్చి, మనకు నలువైపులా వత్తాసుగా నిలబడగా, వారి సహకారంతో మనం ఒక శక్తిశాలి సమాజాన్ని నిర్మించటంలో తప్పక సఫలురమౌతాము. ఆ రోజు ఎంతో దూరంలో లేదు.
♦♦♦♦