: పని జరగాలంటే సమయం ఇవ్వాలి :
సంఘ స్వయం సేవకులందరూ సంవత్సరంలో 2-3-4 నెలలైనా సంఘకార్యానికి పూర్తి సమయం ఇవ్వగల్గే విధంగా తమ జీవితపు ముసాయిదా రూపొందించుకోవాలి.
స్వయం సేవకులు డాక్టర్లు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు. ఇతర ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలలో ఉన్నవారు కావచ్చు - ఎవరైనా సరే కొన్ని సంవత్సరాల సమయాన్ని సంఘకార్యానికి ఇవాలి. వారు తమ పనికి వ్యాపారానికి తాళంవేసిగాని, లేక తమ్మునికి అప్పగించిగాని ఏవిధంగా వీలయితే ఆవిధంగా తాము సమయమిచ్చి పని చేయడానికి ముందుకు రావాలి. అనేక దేశాలలో వయస్సులో ఉన్నవారందరికీ సంవత్సరంలో నెలా రెండు నెలలు అనివార్యంగా సైనిక శిక్షణ ఇచ్చే విధానం అమలులో ఉంది.
సంఘంకోసం కనీసంగా ప్రతిరోజూ ఒక గంట ఇస్తున్నపుడు మనకుకూడా అసాధ్యమైంది ఏదీ ఉండదు. సంఘ స్వయం సేవకులు తమ జీవితంలో కొంతకాలమైనా సంఘానికి కేటాయించి పనిచేయగలి. దీని ప్రభావం యావత్తు దేశం పైన ఉంటుంది. ఈ పద్ధతిలో సంఘకార్యం చేస్తున్నవారి సంఖ్య ఎంతగా పెరుగుతుందంటే, అలా పనిచేస్తున్న వారిని లెక్కించటం కూడా కష్టమౌతుంది. ఎగుడుదిగుడులతో కూడిన జీవితం గడుపుతున్న అనుభవజ్ఞులైన వారిలోనుండి వ్యవహారజ్ఞానం కల్గిన విస్తారకులు పెద్ద సంఖ్యలో వచ్చినపుడు, నలుగురిని ఎలా ఆకట్టుకోవాలో, వారిని తమకు తోడుగా ఎలా నడిపించుకోవాలో తెలిసి అనుభవం గడించినవారు తమ ఇల్లూ వాకిలీ విడిచిపెట్టి 2-3-4 నెలలు సంఘకార్యం కొరకు బయటకు వచ్చినపుడు, సంఘకార్యం ఎంతో వేగంగా వృద్ధి చెందుతుంది.
గ్రామ గ్రామాన ఎక్కడ ఏ స్వయంసేవక్ ఉన్నాడో గుర్తించి, వారితో సంబంధాలు నెలకొల్పుకొని
సంఘం అనే గొలుసులో ఒక కొక్కెంలాగా మరల ఆబద్ధులను చేయాలి. శాఖలు లేనిచోట్ల శాఖలు మొదలు పెట్టాలి, నిలబెట్టాలి. యోజనాపూర్వకంగా పనిచేసినపుడు కొద్ది సమయంలోనే, మంచి సంఖ్యలో శాఖలు నిర్మాణమవుతాయి. స్వయం సేవకులు తయారవుతారు. కొన్ని శాఖలు మూతబడినా, పెద్దసంఖ్యలో శాఖలు నడుస్తుంటాయి. శాఖలు నడవకుండా, ఆగినచోట్ల కూడా ముగ్గురు, నల్గురు స్వయం సేవకులు అందుబాటులో ఉంటారు. దగ్గరలో జరిగే కార్యక్రమాలకు పిలుస్తూ ఉండటంద్వారా సంపర్కమూ, సంబంధమూ నిలిచి ఉంటాయి. వారిలోనూ - 'నేను స్వయం సేవకుడిని' అనే అభిమానం నిలిచి ఉంటుంది. సంఘకార్యాన్ని తీవ్రమైన వేగంతో వికసింపజేయవలసిన సమయం వచ్చింది. ఇప్పటి ఈ అనుకూలతలవల్ల మనకు లాభం ఎప్పుడు ఉంటుంది? ఈ దృష్టితో ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే. సంఘకార్యం ఇంతకాలంగా జరుగుతూ, ఇంత పెద్ద సంఖ్యలో స్వయం సేవకులు ఉండికూడా ఇప్పటి ఈ పరిస్థితులనుండి లాభం పొందకపోయినట్లయితే దానికి మనమే దోషులమవుతాం.