: మాటలలో సంయమం తప్పని సరి :
ఇప్పుడు రకరకాల పనులు వచ్చిపడుతున్నవి. వాటికారణంగా ప్రచారక్ పై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ స్థితిలో అన్నింటికంటే ఎక్కువ మహత్వపూర్ణ గుణం అన్ని విషయాలనూ, పరిస్థితులనూ గమనించుకొంటూ కుశలతాపూర్వకంగా అందరినీ సంబాళించుకొంటూ రావటమే. అన్ని పరిస్థితులనూ సంబాళించుకోగల్గటంతోపాటు తన మాటలపై అదుపు (సంయమం) ఉంచుకోవటం కూడా ఎంతో అవసరం. ఎవరినైనా మనం ఉపయోగించే భాష, శబ్దాలు ఆధారంగానే పనిలో దిగేటట్లుగా చేయగలము. ప్రచారక్ నోటినుండి వెలువడే ప్రతిమాటా అవసరమైనది, ఉద్దేశపూర్వకమైనది, యోజనాపూర్వకమైనదీ కావాలి. ఏమాట ఎప్పుడుచెప్పాలో అప్పుడే చెప్పాలి. ఈ రోజు చెప్పవలసినమాటనే ఈ రోజు చెప్పటం మంచిది.
ఒక విషయం అర్థం చేయించే ప్రయత్నం చేసినపుడు దానిని అర్థం చేసుకోగల స్థితి ఉంటే, ఇప్పుడే అర్థం చేయించాలి. అటువంటి స్థితి అవతలి వ్యక్తిలో ఈనాడు లేకుంటే, నెలా, రెండు నెలల ఆగి, ఆ స్థితి ఏర్పడిన తర్వాతనే వివరించి అర్థం చేయించాలి. ఈ విధమైన వ్యవహారంలో ఎక్కడైనా పొరబాట్లు సంభవించినట్లయితే, ఆ పొరపాట్లను వీలయినంత త్వరగా సరిదిద్దుకోవాలి. పని తొందరలో ఒక్కొక్కసారి కోపం వస్తుంది. అది మాటల ద్వారానో, నడవడి ద్వారానో వ్యక్తమవుతుంది కూడా. కాని దానివల్ల లాభమేముంటుంది? మనస్సును బాధపడేటట్లు చేసే ఘటనలు జరిగినప్పటికీ, క్షోభపెట్టకుండా వ్యవహరించాలి. శాంతంగా ఉండాలి.
దీనిని సరిచేయటం ప్రచారక్ బాధ్యత. అవతలి వ్యక్తులనుండి ప్రతిక్రియ వ్యక్తమైనపుడు కోపతాపాలు చూపించవలసి వస్తుంది. అయితే అవి తప్పనిసరిగా వ్యక్తం చేయటమే మంచిది, అలా వ్యక్తపరచటమే లాభదాయకమవుతుంది అనుకున్నపుడు మాత్రమే వాటిని వ్యక్తం కానివ్వాలి. తాను ఇతరులతో వ్యవహరిస్తున్నపుడు సంబంధాలు తగినంత దృఢంగా ఉండి, తాత్కాలికంగా కోపతాపాలు వ్యక్తపరిచినా అవి ప్రయోజనదాయకమే అవుతాయి కాని, నష్టదాయకం కాదు అన్నస్థితి నిర్మాణమై ఉన్నపుడే వీటిని చూపించవలసి ఉంటుంది.