అన్నిరకాల పరిస్థితులలోనూ కార్యం జరుగుతూ ఉండాలి !
పరిస్థితులు అనుకూలంగా లేనట్లయితే, ఆ పరిస్థితులను మార్చడానికి కార్యం అవసరమౌతుంది. కాబట్టి కార్యం చేస్తుండాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వాటినుండి లాభం పొందుతూ కార్యాన్ని పెంచవలసి ఉంటుంది. అనుకూల పరిస్థితులలో వచ్చే ప్రతిఫలం ప్రతికూల పరిస్థితులలో ఎంతో ఎక్కువ పరిశ్రమచేస్తేగాని లభించదు. నలువైపులా కొండరాళ్లు ఉండగా, వాటి మధ్యనుండి ప్రవహించే నది యొక్క ప్రవాహమార్గం చాలా వెడల్పుగా ఉండదు, కాని ఎప్పుడైతే అది మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తుందో అప్పుడు వేగంగా ముందుకుసాగుతూ ప్రవాహం భూమిని కోసివేస్తూ తన గర్భాన్ని బాగా వెడల్పుగా చేసుకొంటుంది. జబల్‌పూర్‌లో కొండరాళ్ల మధ్య నర్మదానది గర్భం ఎంత చిన్నదిగా ఉంటుందంటే, దానిని ఒక కోతి సైతం దూకి వెళ్లిపోగల్గుతుంది. అందుకని అక్కడ దానిని 'బందర్ కూదీ' అంటారు. కాని అదే నది మైదానంలోకి వచ్చినతర్వాత తగినంతగా వెడల్పు అవుతుంది. సంఘకార్యంలోనూ ఇలాగే ఉంటుంది. విషమ పరిస్థితులలో దీని విస్తృతి చాలా వెడల్పుగా ఉండకపోవచ్చు, కాని అనుకూల పరిస్థితులు ఏర్పడినపుడు ఈ కార్యం విశాలమైన రూపాన్ని సంతరించుకొంటుంది. అందుచేత రెండురకాల పరిస్థితులలోనూ ఈ పనిని చేస్తూ ఉండవలసిందే.
ఈ రోజుల్లో దేశవిదేశాలలో ఉన్న పరిస్థితులను గమనిస్తే, ఇవి సంఘకార్య విస్తరణకు తగినంత అనుకూలంగా ఉన్నవి. వీటినుండి అధికాధికంగా లాభం పొందవలసియున్నది. ఈ అనుకూలత క్రమక్రమంగా పెరుగుతూ ఉండేట్లుగా కనబడుతున్నది. పెరుగుతూ ఉన్న కొద్దీ సమాజంపై దీని ప్రభావం విస్తృతం పంది. అయినప్పటికి, సంఘకార్యానికి ఎంతటి యశస్సు (సాఫల్యము, కీర్తి) లభించవలసి ఉండెనో, అంత యశస్సు లభించటం లేదు. దీనికి కారణం-కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలూ-ఎవరి భావజాలమైతే సంఘ ఆలోచనలతో పొసగకుండా ఉందో -వారు సంఘం గురించి రకరకాలుగా భ్రాంతులను వ్యాపింపజేస్తున్నారు.
కొంతకాలంపాటు ఈ దేశంమీద, ఈ సమాజంమీద ఒక పార్టీ యొక్క ఆ పార్టీ యొక్క ఒకానొక నాయకుని యొక్క గట్టిపట్టు ఉండినది. ఆయన ఆలోచనలు బొత్తిగా సంఘంతో పొసగనివి కావటంతో ఆయన ఎల్లప్పుడూ సంఘాన్ని వ్యతిరేకిస్తూ ఉండేవారు. ఆ వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నందున ఆయన అన్ని రకాల సాధనాలనూ, మార్గాలనూ వినియోగించుకొని, సంఘాన్ని వ్యతిరేరించాడు. ఈ రకమైన వ్యతిరేకతల కారణంగా సంఘానికి అపేక్షితస్థాయిలో యశస్సు పొందటంలో అవరోధాలు వచ్చాయి.