దేశ సంస్కృతి, ప్రజల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు, దేశం బలహీనంగా మారుతుందని, సంస్కృతిని రక్షించుకుంటేనే ఆ దేశానికి మనుగడ ఉంటుందని అలహాబాద్ హైకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే వ్యక్తికి బెయిలు నిరాకరించిన జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌తో కూడిన ధర్మాసనం.. చంపే హక్కు కంటే జీవించే హక్కు ఉన్నతమైనదని తెలిపింది. నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. గోమాంసాన్ని భుజించడం హక్కు కానేకాదని.. నిందితుడిని బెయిలుపై విడుదల చేస్తే మళ్లీ అటువంటి నేరానికే పాల్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గోవు ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న వారిలో ముస్లిం పాలకులు కూడా ఉన్నారని న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఓ వైపు డిమాండ్ ఉండగా గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ, దానికి హాని తలపెట్టే వారిని కఠినంగా శిక్షించేలా పార్లమెంటు ఓ చట్టం తీసుకురావాలని కేంద్రానికి హైకోర్టు సూచించింది. భారత సంస్కృతిలో గోవుకు విశిష్ట స్థానం ఉందని ఈ సందర్భంగా పేర్కొంది.
“నిందితుడిది.. మొదటి నేరం కాదు. ఇంతకు ముందు కూడా అతను గోవధకు పాల్పడ్డాడు “ అని కోర్టు తెలిపింది. దరఖాస్తుదారు బెయిల్‌పై విడుదలైతే, అతను మళ్లీ అదే నేరానికి పాల్పడి సమాజంలోని పర్యావరణాన్ని దెబ్బతీసేలా చేస్తాడు అంటూ బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది కోర్టు. “ప్రాథమిక హక్కు కేవలం గోమాంసం తినేవారికి మాత్రమే కాదు. ఆవును ఆరాధించే వారికి కూడా ఉంటుంది. జీవించే హక్కు చంపే హక్కు మరియు ఆవు మాంసం తినే హక్కు ఎప్పటికీ ప్రాథమిక హక్కుగా పరిగణించబడదని అలహాబాద్ హై కోర్టు తెలిపింది.
___విశ్వసంవాద కేంద్రము