విదేశీ నమూనాలు ఏవీ ఇక్కడ ఉపయోగపడవు
ప్రపంచంలో ఏదేశమైనా ఎంత పురాతనమైనదో, దాని చరిత్ర, వారసత్వములు కూడా అంతపురాతనమైనవిగా ఉంటాయి. అమెరికా విషయమే తీసికొంటే, దాని చరిత్ర అంతా కలిపి రెండు రెండున్నర వందల సంవత్సరాలు మాత్రమే. ఆదేశానికి ఉన్న సమస్యలు ఏవైనా కాని, అవి రెండు వందల సంవత్సరాలకంటే ఎక్కువ చరిత్ర కలిగినవై ఉండవు. రష్యా విషయం తీసికొంటే, అది కొంత ప్రాచీనమైన దేశమే. అయితే ఆ దేశంలో ఇప్పుడున్న సమస్యల చరిత్ర చాలా చిన్నది. తక్కువ కాలం చరిత్ర ఉన్న ఈ సమస్యల జటిలత, దురూహత (అంతుబట్టనిస్థితి) కూడా తక్కువగానే ఉంటవి. కాగా మన దేశం యొక్క స్థితి మిగిలిన దేశాలకంటే బాగా భిన్నమైనది. మనకు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇక్కడ ఈనాడు మనముందున్న చిన్న పెద్ద సమస్యల వెనుక కొన్ని వేల సంవత్సరాల గతచరిత్ర ఉంది. అటువంటి స్థితిలో అమెరికా నమూనాగాని, రష్యా నమూనాగాని, మనదేశ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడగలవా? ఏ విదేశీ నమూనాగాని ఇక్కడ పనిచేయదు.
మనదేశ సమస్యలకు పరిష్కార మార్గాలను మనమే పరిశ్రమించి, వెదికి వెలికితీయవలసి ఉంటుంది, లేదా రూపొందించవలసి ఉంటుంది. ఇదీ సంఘం ఆలోచన. ఈ విషయం నలుగురికీ తెలియజెప్పి అర్థం చేయించటం కష్టంకాదు. మారుతూ ఉన్న అంతర్ బాహ్య పరిస్థితులలో ఈ విషయం గ్రహింపజేయటం గతంలో ఎంత కష్టంగా ఉండినదో - ఇప్పుడు అంత కష్టం కానే కాదు. ఇప్పటి అనుకూల పరిస్థితులను మనం ఉపయోగించుకోవాలి. ప్రయోజనం పొందాలి. పరిస్థితులు అనుకూలంగా మారినా, వాటినుండి మేము లాభపడబోము అంటూ సంఘం ఏవిధమైన శపథమూ తీసికోలేదు. బిర్రబిగిసి ఉండిపోదు.