సంఘంయొక్క శక్తిని అంచనావేసేటప్పుడు (లేదా కొలిచేటప్పుడు) లెక్కలోకి రావలసింది సంఘస్థాన్ కి వచ్చి దక్ష-ఆరమ చేసేవారు మాత్రమే కాదు. ఇంతకుముందు, సంఘశాఖకు వస్తూ ఉండి, ఇప్పుడు రాలేకపోతున్నవారు, సంఘశాఖకు రాకపోయినా సంఘం ఆలోచనలతో ఏకీభవిస్తూ సహానుభూతి కలిగియున్నవారినికూడా సంఘం యొక్క శక్తిగా లెక్కలోకి తీసుకోవాలి. సంఘకార్యాన్ని గట్టున ఉండి చూస్తున్నవారు కొందరుంటారు. మనం మన కార్యాన్ని విశాలదృష్టితో చూసి ఏ హిందువూ ప్రక్కన పెట్టవలసినవాడు కాదని గ్రహించుకొని శాఖలను పెంచే ప్రయత్నం చేయాలి. శాఖల ఆధారంగా యావత్తు సమాజంలోకి చొచ్చుకుపోయి అధికాధికంగా సంపర్కం చేస్తూ, వారు మాట్లాడే మాటలలోని శబ్దాలగురించి పట్టించుకోకుండా వారితో సంబంధాలు కొనసాగిస్తున్నట్లయితే ఇలాంటి వారితోనూ అనేక విషయాలలో ఏకీభావం కుదురుతుంది. వారున్నూమనశక్తికి నలువైపులా నిలబడేందుకు తయారవుతారు. సంఘాన్ని గురించి ఇప్పటివరకు వారికి గల అభిప్రాయాలు సరైనవి కావని, ఎవరో కల్పించి చెప్పిన కట్టు కథలని వారికి తెలిసివస్తుంది. వారి గురించి మనలో కూడా కొన్ని భ్రాంతితో కూడిన అభిప్రాయా లున్నట్లయితే, అవీ తొలగిపోతాయి. ఇలా మనస్సులో గూడుకట్టుకొని ఉన్న దురభిప్రాయాలను పరస్పరం తొలగించుకున్నప్పుడు వారందరూ సంఘానికి నలువైపులా వచ్చి నిలబడగలరు.
సమాజాన్ని సుస్థిరంగా ఉంచడానికి అవసరమైన శక్తి అఖిలభారతస్థాయిలో కేవలం సంఘం వద్దనే ఉంది. అయితే అది ఎంతగా ఉండాలో అంతగా ఇప్పుడు లేదు. దేశంలో ఎక్కడ ఏవిధమైన సమస్య లేదా తగాదా ఉత్పన్నమైనా, మనం మన బలం ఆధారంగా దానిని పరిష్కరించగల్గేవిధంగా మన శక్తిని సంపాదించాలి. ఇతరులు ఎవరూకూడా ఈ దేశ ప్రజానీకాన్ని, సమాజాన్ని తప్పుదారి పట్టించి భ్రష్టులను చేయకుండా చూడగల్గేటంత శక్తిని సంపాదించాలి.
అంతర్జాతీయ పరిస్థితులు కూడా వేగంగా, మారుతున్నవి. విధ్వంసకమైన ఆలోచనలు గలవారు బలహీనపడుతున్న స్థితిలో - దేశానికి వెలుపలా, లోపలా రూపుదిద్దు కొంటున్న పరిస్థితులనుండి మనం ప్రయోజనం పొందాలి. 1945-47లలో ఏవిధంగానైతే వేలాదిగా ప్రచారకులు వచ్చి ఎక్కడెక్కడో ఉన్న గ్రామాలకు వెళ్లి వేల సంఖ్యలో శాఖలను నిర్మాణం చేశారో, అదే విధంగా ఇప్పుడూ మనం ఆలోచించవలసి ఉంది. ఎంతమంది ప్రచారకులుగా, విస్తారకులుగా రాగలరో అంతమంది తప్పక ముందుకు రావాలి. పని పాతబడిపోయిందని ఆశలు వదలుకొని కూర్చోవలసిన అవసరం లేదు. సమస్యల మధ్యనుండే మనం మార్గం వెదకవలసి ఉంది.