|| అత్యధిక మహత్వం గల అంశం మన వ్యవహారమే ||
క్రీ.శ. 1920లో చాలామంది తమ వృత్తి వ్యాపారాలను విడిచిపెట్టి, స్కూళ్లు, కాలేజీలు బహిష్కరించి, ఉద్యోగాలనుండి వైదొలగి ఉద్యమాల్లో పాల్గొన్నారు. దానివల్ల సమాజంలో అందరూ వారిని ఎంతగానో గౌరవించారు. అయితే రెండు మూడేళ్ల తర్వాత వారు ఎప్పుడైతే, 'చాలా పొరబాటు జరిగింది, వృత్తి, వ్యాపారాలను వదిలి పెట్టిపోవటంతో చాలా నష్టం జరిగిపోయింది' - అనటం మొదలు పెట్టారో, అప్పటివరకూ ఉన్న సద్భావన ఒక్కసారిగా ఎగిరిపోయింది - ఆర్య సమాజాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో మంచి ఉన్నతస్థాయి ప్రచారకులు వచ్చారు. ప్రజానీకంవారిని గురుతుల్యులుగా, దైవసమానులుగా భావించి ఎంతో గౌరవించింది. వారికి ఎంతో ప్రతిష్ఠను ఆపాదించింది. కాని, రోజులు గడచినకొద్దీ ఆ పరంపర కుంటుపడింది. ఫలితంగా వారిపట్ల ప్రజల శ్రద్ధా గౌరవాలు లుప్తమైపోయాయి. ఉచ్చశ్రేణికి చెందిన వ్యక్తులనుండి ఎటువంటి ప్రవర్తనను ఆపేక్షిస్తూ ఉంటామో, అందులో గనుక దిగజారుడు కనిపించినట్లయితే, ప్రజానీకంలో నిరాశ వ్యాపిస్తుంది. కాబట్టి ప్రచారకుల కీర్తి ప్రతిష్ఠలకు ఆధారంగా ఉన్న ప్రవర్తన, వ్యవహారశైలీ కొరవడని ప్రచారకులు ముందుముందుకూడా రావలని ఉంది. ఇందులో వారు చదివిన చదువు,
విషయవైశారద్యములకు ఎంత ప్రాధాన్యముందో, అంత ప్రాధాన్యం నడవడికీ ఉంది.
ప్రచార తో సంబంధమేర్పడిన ప్రతి ఒక్కరూ అతనిపట్ల ప్రేమ, గౌరవము, శ్రద్ధ తమ మనస్సులలో కలిగి ఉండేలా అతని వ్యవహారం ఉన్నపుడే ప్రచారకపట్ట శ్రద్ధా గౌరవాలు కుదురుకొంటాయి. ఎక్కడా కాలుజారకుండా, కాలుజారడానికి అవకాశమిచ్చే సందర్భాలు చోటుచేసుకోకుండా మెలకువగలిగి జాగరూకత వహించాలి. భోజనం చేస్తున్నపుడుగాని, చాయ్ త్రాగుతున్నపుడుగాని, కూర్చొని లేస్తున్నపుడుగాని, వచ్చిపోతున్నపుడుగాని, అటూఇటూ తిరుగుతున్నపుడుగాని మాట్లాడుతున్నపుడుగాని - ఎంతో మెలకువతో ఉండాలి. సంస్థ పాతబడుతున్న కొద్దీ, పని పాతబడుతున్న కొద్దీ ఈ జాగరూకత మరింత ఎక్కువగా అవసరమవుతూ ఉంటుంది.
ప్రచారకుల పని చాలా విచిత్రమైన పని. అట్టి కార్యానికి అనురూపమైన వ్యవహారం సాగించటమనే బాధ్యత సహజంగానే వచ్చిపడుతుంది. ఈ పని ఎంతో కఠినమైనదయినా, మనం నిభాయించుకొంటూ వస్తున్నాం. ఈ విధంగానే సమాజంలో ఈనాడుకూడా స్వయం సేవకుల గురించి, సంఘంగురించి, ప్రచారకులగురించి, ఒక విధమైన శ్రద్ధా గౌరవాలు చూపించబడుచున్నవి. ఏ ప్రవర్తన, నడవడి కారణంగా ఈ గౌరవం లభిస్తూ, ఉందో, దానిపట్ల మరింత శ్రద్ధ వహించవలసి ఉంది. ధ్యానముంచవలసి ఉంది.
తొలినాళ్ళలో డాక్టర్టీ ప్రచారకులగురించి చాలా ఆలోచిస్తూ ఉండేవారు. ఉన్నత కుటుంబాల నుండి, బాగా చదువుకున్నవారు ప్రచారకులుగా రావాలని వారు పట్టుదలగా ఉండేవారు. సాధారణ కుటుంబాలనుండి, తక్కువ చదువుకున్నవారినుండి ప్రచారకులు వస్తే, వారు అంత సమర్ధంగా ఉండలేకపోతారన్న భావమేమీ ఇందులో లేదు. డాక్టర్జీ స్వయంగా సాధారణ కుటుంబం నుండి వచ్చినవారే గదా! ఆవిధమైన ఆలోచన వెనుకగల కారణం ఒక్కటే- ప్రారంభంలోనే తక్కువ విద్యార్హతలున్నవారు, సామాన్యకుటుంబాలవారు ప్రచారకులుగా వచ్చినట్లయితే ఎవరికైతే ఉజ్జ్వలమైన భవిష్యత్తు సందేహాస్పదంగా ఉందో, అలాంటివారే ప్రచారకులుగా వస్తున్నారనే అభిప్రాయం బలపడే ప్రమాదముంది. ఆ కారణంగానే ఎవరైనా స్వయం సేవక్ హైస్కూలు చదువు పూర్తిచేసికొని ప్రచారక్ గా రాదలుస్తున్నారని చెప్తే, డాక్టర్జీ అతనికి ముందు ఇంటర్మీడియట్ చదువు, ఆ పైన డిగ్రీ చేయి- అని సూచిస్తూ ఉండేవారు. ఎంఎ (పోస్టు గ్రాడ్యుయేషన్) చేయుమనికూడా ప్రోత్సహిస్తుండేవారు. అంతేకాదు ఆ ఎం.ఏలో కూడా ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని పట్టుబట్టేవారు.
స్వయం సేవకులముందు ఆయన సుభాశ్చంద్రబోస్ ఆదర్శాన్ని ప్రస్తావించుతూ ఉండేవారు. సుభాశ్చంద్రబోసు ఐ.సి.ఎస్ (ఇండియన్ సివిల్ సర్వీస్) పరీక్షలలో ఉత్తీర్ణుడైనాడు, కానీ ఉద్యోగం చేయలేదు. అదే విధంగా స్వయంసేవకులుకూడా ఉన్నత విద్యలను అభ్యసించి సమాజసేవకు ముందుకురావాలి. ఉన్నత కుటుంబాలకు చెంది ఉన్నత విద్యావంతులైన స్వయం సేవకులు ప్రచారకులుగా రావాలన్న పట్టుదల చాలాకాలంవరకు ఉండింది. దీనికారణంగా సమాజంలో ప్రచారకులగురించి ఒక శ్రేష్ఠమైన భావన, వాతావరణమూ నిర్మాణమైనవి. అటువంటి వాతావరణం ఏర్పడి ఉన్న కారణంగానే, ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఒకరిద్దరు మెట్రిక్ పాసయినవారు ప్రచారకులుగా వచ్చినా, వారు ప్రజల కళ్లకు ఎం.ఏ. పాసయినవారుగానే కనిపించేవారు.