: స్థానీయ కార్యకర్తలు భారం వహించాలి :
సామాన్యజీవితం గడిపేవారు, తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను చేసుకొనేవారు, కుటుంబ బాధ్యతలున్నవారు అన్ని రకాలైన సంఘకార్యాలను చేయటంలో నిమగ్నులైనపుడు సంఘానికి సమాజంలో గౌరవనీయమైన యోగ్యమైన స్థానం లభిస్తుంది. ప్రచారక్ కి పిల్లలు లేరు, కుటుంబభారం లేదు, పనీపాటూ లేవు అని సమాజంలోని ప్రజలు అనుకొంటుంటారు.
కాగా, న్యాయవాదులు, వైద్యులు, ఇతర వృత్తులు చేసుకొనేవారు సంఘచాలకులుగా, కార్యవాహలుగా బాధ్యతలు తీసికొని పనిచేస్తూ ఉన్నపుడు, దాని ప్రభావం సమాజంపై పడుతుంది. కాబట్టి సంఘకార్యభారాన్ని వహించే స్థానీయ కార్యకర్తలు శ్రీఘాతిశ్రీఘ్రంగా ముందుకు వచ్చి నిలబడాలి. సంఘంయొక్క రోజువారీ (రోటీన్) కార్యక్రమాలలోనే ప్రచారకులు చిక్కుకొనిపోయేటట్లయితే, క్రొత్త క్రొత్త చోట్లకు పోవడానికి గాని, సంఘకార్యాన్నియోజనాపూర్వకంగా పెంపొందించడానికిగాని ప్రచారకులకు సమయమే మిగలదు. ఈ రోజుల్లో సాధారణంగా సమయమంతా శాఖలను వ్యవస్థితంగా నడపడానికే వ్యయమైపోతున్నది. క్రొత్త క్రొత్త స్వయం సేవకులను వెదికి పట్టుకోవడానికి సమయమే ఉండదు.
ప్రచారక్ యొక్క భూమిక ఎలా ఉండాలంటే, అతడు కార్యక్రమాలను యోజన చేయాలి, తాను ప్రక్కన ఉంటూ స్థానీయ కార్యకర్తల ద్వారా ఆ కార్యక్రమం పూర్తిగా నిర్వహింపజేయాలి. ఇలా జరిగినపుడు అన్ని కార్యక్రమాలు to the mark, ఎంత బాగా జరగాలో అంత బాగా) జరిగినట్లు అనిపించకపోవచ్చు. కొన్ని విషయాలు పరిపూర్ణంగా సఫలమైనట్లు అనిపించకపోవచ్చు. అయినా ఈ విధమైన దృష్టి కారణంగా సంఘానికి వాస్తవ ఆధారం సామాన్యజీవితం గడిపే స్వయం సేవకులు అవుతారు. కాబట్టి పని అంతా వారి ద్వారానే జరిపించాలి. పనిచేయడానికి సంఘప్రచారక్ 24 గంటలూ అందుబాటులో ఉన్నాడు గదా అన్న భావన గనుక స్వయం సేవకులలో ఉత్పన్నమైనట్లయితే, వారికి వాళ్ళున్నచోట కూర్చొని ఉండటం అలవాటయిపోతుంది.
సామాన్యవ్యక్తి కార్యంలో నిమగ్నం కాకపోతే, దానిలో నుండి అతనిలో దోషాలు నిర్మాణమవుతాయి. సంఘం కాకుండా దేశంలో ఎన్ని పనులు జరుగుతున్నవో, గతంలో జరిగినవో, అవన్నీ సామాన్య వ్యక్తులద్వారానే జరుగుతున్నది. సామాన్య వ్యక్తులనుండి లభించిన ప్రేరణ, ప్రయత్నాల ఫలితంగానే అనేకమంది జైళ్ళకు వెళ్లారు. ఉరికంబాలెక్కారు. ఎన్నెన్నో అద్భుతకార్యాలు చేశారు. సంఘకార్యానికి సైతం ఆధారం ఇటువంటి వ్యక్తులే. సంఘకార్యాన్ని చాలా వేగంగా, నలువైపులా విస్తరింపజేయటం, తద్వారా నిత్యసిద్ధ శక్తిని నిర్మించటం కొరకు ఉద్దేశించినది ప్రచారకుల పద్ధతి. ప్రచారకులు గుణ సంపన్నులు కావాలి.