భ్రమలను తొలగించడానికి విస్తృత ప్రజా సంబంధాలు అవసరం !
అయితే, వ్యక్తి యొక్క భౌతిక జీవితాన్ని గురించిన ఆలోచనలకే సంఘం పరిమితం కాదు. ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు మనముందున్నది ప్రణాళికాబద్ధంగా జరిగిన రచన (నిర్మాణం కాదు. సమాజంలో వ్యవస్థ అనేది ఏదీ కనబడటం లేదు. ఈ పరిస్థితినుండి మార్పురావాలని సంఘం కోరుతున్నది. మన ఏకసూత్రం ఏదైతే ఉన్నదో, దానిని దృష్టిలో ఉంచుకొంటూ, ఇతర తథ్యములనుకూడా పరిశీలించుకొంటూ సముచితమైన రీతిలో సమాజంలో పరివర్తన సాధించాలి. సమాజవాదం యొక్క అర్థం మన సమాజం యొక్క ఉన్నతి, ప్రగతి-ఇదే అయినట్లయితే ఈ విషయం సంఘం మొదటినుండీ ఆలోచిస్తున్నది.
సర్వోదయవాదులు చెప్పేది మన ప్రాచీన విధానాలతో ఏకీభవిస్తూ ఉంటుంది. అందరికీ ఉండటానికి ఇల్లు ఉండాలి, అవసరమైనపుడు మందు-మాకూ లభించాలి-ఇలా ఒక పది సూత్రాలు రూపొందించారు. మరి ఇదే సమాజవాదము, ఇదే సర్వోదయవాదమూ అయినట్లయితే, మనమధ్య జగడాలెందుకు? కాని జరుగుతున్నదేమిటంటే, సోషలిజం నామాన్ని జపిస్తూ సమజాన్ని ప్రక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నవారు కొందరున్నారు. ఆ దారిలో పోరాదని సంఘం కోరుతున్నది. సంఘాన్ని గురించి సమాజంలో పాతుకొని ఉన్న అనేక విధాల భ్రాంతులను దూరం చేయడానికి మన కార్యకర్తలు విస్తృతంగా సంపర్కంచేయవలసి ఉంది. దురభిప్రాయాలను వ్యాపింపజేస్తున్నవారి గురించి ఆలోచిస్తూ బుర్ర ఖరాబు చేసికొనకుండా, నలువైపులా ఉన్న ప్రజలతో మనం సంపర్కం చేసినట్లయితే వారిని సంఘంలోకి తీసికొని రాగల్గుతాము. వారిలో కొందరు సంఘస్థాన్ వరకూ రాకపోవచ్చు. అయినా సంఘానికి సన్నిహితులు కాగలరు.