భారతీయులందరి డీఎన్‌ఏ ఒక్కటే. ఇస్లాం ప్రమాదంలో పడిందన్న భయవలయంలో ముస్లింలు చిక్కుకుపోవడం సరికాదు. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ జూలై 4న ఘాజియాబాద్‌లోని మేవార్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన కార్యక్రమంలో అన్నమాటలివి. వందలాది సంవత్సరాల క్రితం ఈ భూమికి చెందిన వారి వారసులమే మనమంతా అన్న సంగతి విస్మరించలేమని అన్నారు. దేశ ఐక్యత లేదా ప్రజల ఐక్యతకు జాతీయతావాదం, ముందుతరాల వారి ఔన్నత్యమే పునాదిగా ఉండాలని ఆయన అభిలషించారు.
‘హిందుస్తానీ ఫస్ట్, హిందుస్తాన్ ఫస్ట్’ అనే అంశంతో ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది.డాక్టర్ ఖ్వాజా ఇ ఫ్తెకార్ అహ్మద్ రాసిన ‘ది మీటింగ్ ఆఫ్ మైండ్స్: ఏ బ్రిడ్జింగ్ ఇనిషియేటివ్’ను కూడా డాక్టర్ భాగవత్ ఆవిష్కరించారు. ఇక్కడ నివసిస్తున్న 130 కోట్ల మంది హిందూ సమాజానికి సంబంధించినవారేనని కూడా ఆయన ముస్లిం సమాజం ఎదుట చెప్పారు. హిందుత్వ పేరుతో ఇతరులను కొట్టి చంపేవారు హిందుత్వకు వ్యతిరేకంగా వ్యవహరించేవారేనని కూడా ఆయన అన్నారు. గోవు హిందువుకు పరమ పవిత్రమే. అయినా ఇతరులను కొట్టి చంపడం హిందుత్వం కాదని నిష్కర్షగా ఆయన వెల్లడించారు. కానీ ఇతరులను కొట్టి చంపిన నేరం మీద కొన్ని దొంగ కేసులు కూడా నమోదవుతున్న సంగతిని కూడా విస్మరించరాదని డాక్టర్ భాగవత్ అన్నారు. ఇక్కడ ముస్లింలెవరు నివసించరాదని ఎవరైనా హిందువు కనుక ప్రకటిస్తే అతడు హిందువు కాదని కూడా ఆర్‌ఎస్‌ఎస్ నేత చెప్పారు.
ఘాజియాబాద్‌లో జరిగిన ఈ సమావేశం ఆరంభంలోనే డాక్టర్ భాగవత్ ఒక విషయం స్పష్టం చేశారు. ఇలాంటి సమావేశాలు తనకు కొత్తకాదనీ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తాను ఇక్కడకు రాలేదని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు కొత్త ఆకర్షణ ఏదో తేవాలన్న ఉద్దేశం కూడా తనకు, సంస్థ సభ్యులకు కూడా లేదని ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటించారు. అయినా ఈ అంశాన్ని హిందూ రక్షకులుగా తమను తాము చెప్పుకుంటున్న పలువురు శంకలు లేవనెత్తడం విశేషం. ఆర్‌ఎస్‌ఎస్ పంథా మార్చుకున్నదేమోనన్నంత అనుమానం వాళ్ల ప్రశ్నలలో కనిపించింది. వాటి గురించి కొంచెం విశ్లేషించుకోవలసి ఉంది. వేల ఏళ్ల క్రితం మన ముందు తరాల వారంతా ఒక్కటేననీ, మన డీఎన్‌ఏ ఒకటేనని హిందువులను, ముస్లింలను కలపి సంబోధించడం కొంతమందికి నచ్చలేదని అనిపిస్తుంది. ఏ విధంగా చూసినా వారు కొంచెం అపార్ధం చేసుకున్నారు.
ముస్లింలు ఇతరులతో మమేకం కావడమనే సమస్య అంతర్జాతీయ అంశం. ఇస్లాం ప్రవేశించినప్పటి నుంచి భారత్ సైతం అదే సమస్యను ఎదుర్కొంటున్నది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ సామాజిక సాంస్కృతిక సమీకరణతో కూడుకున్న ఒక సంఘ సూత్రంతో ఈ అంశం మీద ప్రసంగించారు. ఇందుకు ముస్లిం రాష్ట్రీయ మంచ్ నిర్వహించిన ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం వేదికైంది. అది సరైన వేదికే కూడా. అత్యంత సహజంగానే మోహన్‌జీ ప్రసంగం మీడియా దృష్టిని ఆకర్షించింది. ‘భారతీయులందరిది ఒకే డీఎన్‌ఏ.’ ‘ఇతరులపై భౌతికదాడికి పాల్పడుతున్నవారు హిందుత్వానికి విరుద్ధంగా సాగుతున్నారు’ అనే రెండు ప్రకటనలు మొత్తం చర్చకు ప్రాతిపదికగా నిలిచాయి. ఇందులో ఐదు కీలకమైన నిర్ధారణలు కనిపించాయి. ఈ నిర్దేశిత ప్రశ్నలను హిందూ ప్రయోజనాల స్వయం ప్రకటిత పరిరక్షకులు- మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా- లేవనెత్తారు. వారిలో ఎలాంటి దురుద్దేశం ఉండకపోవచ్చు. కానీ వారు లేవనెత్తిన ప్రశ్నలు కచ్చితంగా లోపభూయిష్టమైనవీ, విధ్వంసకరమైనవే. ప్రశ్నార్థకమైన ముస్లిం మమేకత్వం మీద స్పష్టత కోసం, అపోహలను పటాపంచలు చేయడానికి ఆ ప్రసంగం మౌలికాంశాలను అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది.
1. హిందుత్వ, హిందూ రాష్ట్ర భావనలను సంఘం నీరుగార్చిందా?
సంఘ కార్యకలాపాలకు డాక్టర్ హెడ్గేవార్ నాంది పలికిన నాటి నుంచి వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి పునర్నిర్మాణం అనేది హిందూ సమాజ సంఘటన ధ్యేయంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు కీలక ఆచరణగా వస్తున్నది. మాతృభూమి, సంస్కృతి, వారసత్వం అనే ఉమ్మడి అంశాలతో హిందువుగా జీవించే భావనను గురూజీ ఆవిష్కరించారు. ఎవరైతే ఈ మౌలిక సూత్రాలను ప్రగాఢంగా విశ్వసించి, వారి ఆత్మగౌరవం కోసం పనిచేయడానికి సమాయత్తమవుతారో వారు హిందువులు. సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ఇదే అంశాన్ని ముస్లిం మేధావుల ఎదుట తిరుగులేకుండా పునరుద్ఘాటించారు. దిక్కుతోచని స్థితిలో, హిందుత్వంను అర్థంచేసుకోవడంలో కీలకమైన ఆధ్యాత్మిక జీవన విధానం, అన్ని మార్గాలకు చెందిన ప్రార్థనా విధానాలను అంగీకరించి గౌరవించడం, జీవితంలోని అన్ని కోణాల్లో ఇతరులతో అనుసంధానించే ధర్మాచరణ అనేవి దీనితో నీరుగారిపోతున్నాయి. హిందుత్వ తాలూకు విలక్షణత మన సమాజంలో విలసిల్లుతున్న కారణంగా హిందుస్తాన్ అనేది హిందూరాష్ట్రమే అనే తిరుగులేని ప్రకటనను సర్ సంఘచాలక్ కనీసం రెండు పర్యాయాలు చేశారు.
ఈ హిందూ సౌశీల్యత కారణంగానే ఇస్లాంకు చెందిన వేర్వేరు వర్గాలు భారతదేశంలో శాంతియుతంగా జీవిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని గుర్తించి పరస్పర గౌరవించుకునే పంథాను అనుసరించాలా, వద్దా అనేది ముస్లిం నాయకత్వం విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఒక పటిష్టమైన స్థానంలో ఉన్నప్పటికీ చర్చల కోసం సంఘమే బాహాటంగా ముందుకొచ్చింది. ఇది హిందూత్వ లేదా హిందూ రాష్ట్ర సాధనను నీరుగార్చడంగా పరిగణించరాదు.
2. సంఘం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నదా?
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, అక్కడే ఏర్పాటయిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం అదనుగా చేసుకొని అనేక మంది రాజకీయ రంగు పులమడానికి ప్రయత్నిస్తున్నారు. ఆరంభంలో సర్ సంఘచాలక్ స్వయంగా స్పష్టం చేసినట్టు అది ఒక ముస్లిం సమూహం నుంచి అందిన ఆహ్వానం. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఇదే కార్యక్రమం మూడుసార్లు వాయిదా పడింది.
తన కార్యకలాపాలు, ఆలోచనా పక్రియ గురించి ఇతరులు ఏమనుకుంటున్నది సంఘం పట్టించుకోదు. చిత్తశుద్ధి, నిబద్ధత ఊపిరిగా జాతి పునర్నిర్మాణ సాధన సంఘం అనుసరిస్తున్న పక్రియ. అదే సంఘ ఉద్దేశం కూడా. రాజకీయ లేదా పార్టీ ప్రయోజనాల కన్నా జాతి ప్రయోజనం శిఖరాయమానమైనది. ఒకవేళ ఆర్‌ఎస్‌ఎస్ బుజ్జగింపులకు దిగిన పక్షంలో కఠినమైన చారిత్రక వాస్తవికతలు, దీర్ఘకాలిక ప్రయత్నాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు.
3. సంఘం హిందూ సమూహాలను ఒంటరిని చేసి వారికి సందేశాన్ని ఇస్తున్నదా?
ముస్లింల ద్వారా, ముస్లింల కోసం ఏర్పాటుచేసిన ఒక వేదికపై ఒక ముస్లిం సమూహాన్ని ఉద్దేశించి ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ ప్రసంగించారు. ఆ ప్రసంగం స్వయంసేవకులు లేదా హిందూసమాజం కోసం చేసినది కాదు. హిందూ భావన లోని సహజత్వాన్ని వివరించే క్రమంలో తన గత ప్రసంగాల్లోని అంశాలను ఆయన మరొకసారి చెప్పారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదు. ఏదైనా నేరం జరిగినప్పుడు నిష్పాక్షికమైన దర్యాప్తు జరగాలి. చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి ఇది ఏదేనీ ఒక వర్గం లేదా సమూహానికి వర్తించదు. జాతి ప్రయోజనానికి వ్యతిరేకంగా నిర్దేశిత చర్యలు చోటుచేసుకున్న పక్షంలో వాటిని ఖండిస్తూ ప్రముఖ గళాలు వినిపించాలి. అలాంటి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చే పనిని హిందూ సమాజం చేసింది.
4. స్వయంసేవకులు, భయోత్పాత చర్యలకు పాల్పడే ముస్లింలు ఒకే డీఎన్‌ఏను కలిగి ఉంటారా?
ఉగ్రవాదులను సర్ సంఘచాలక్ లేదా స్వయంసేవకుల పక్కన నిలబెడుతూ అడిగిన అత్యంత అసంబద్ధమైన ప్రశ్న ఇది. భారతదేశంలోని ముస్లింలలో అత్యధికులు మతమార్పిడికి గురైనవారే అన్నది తిరుగులేని సత్యం. ఇస్లాం సూత్రాల ప్రకారం ఐక్యతకు ఉమ్మడి అంశంగా పారంపర్యతను వారు విశ్వసించకపోవచ్చు. కానీ ఇప్పటికీ అనేక మంది ముస్లింలు వారి వ్యక్తిగత జీవితాల్లో ఇస్లామేతర కుటుంబ సంప్రదాయాలను అనుస రిస్తున్నారు. శిఖరాయమైన జాతి ప్రయోజనం అనే భావనతో పాటు, మాతృభూమి, సంస్కృతి, పారంపర్యతలను కలిపి ఉంచడం అనే రెండు మౌలిక విషయాలను ముందు ఉంచిన తర్వాత టెర్రరిస్టులను స్వయంసేవకులతో సమం చేసే ప్రశ్నకు తావు లేదు. ఈ మౌలిక సూత్రాన్ని ఆమోదించకుండా సహజ ఐక్యత సంఘటనగా రూపాంతరం చెందదు అనేది సందేశం అవుతుంది. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్దేశిత చర్యలు చోటు చేసుకున్నప్పుడు పేరొందిన గళాలు వెలుపలకు వచ్చి ఆ చర్యలను ఖండించాలి. అదే పనిని హిందూ సమాజం చేస్తున్నది. ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నది.
5. ఇస్లాం వర్గీయులు పాల్పడిన విధ్వంస పూరిత చర్యలను సంఘం విస్మరిస్తున్నదా?
సర్ సంఘ్‌చాలక్ తరహాలో ఏ ఒక్క ప్రముఖుడు కూడా ఇస్లాం వర్గీయుల విధ్వంసంపై చారిత్రక సత్యాలను ముస్లిం శ్రోతల ఎదుట ప్రస్తావించిందిలేదు. ఇస్లాం ప్రవేశం నుంచి విధ్వంసకారులు ఇప్పటి వరకు సృష్టించిన కల్లోలాల వరకు అన్ని విషయాలు గ్రంథస్తమై ఉన్నాయి. గాయాలు చాలా లోతుగా ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి ఐక్యతకు సంబంధించి సంఘం స్థానాన్ని మీరు అంగీకరించిన పక్షంలో దీర్ఘకాలిక ప్రాతిపదికన తప్పనిసరిగా చేపట్టాల్సిన చర్యలను సైతం స్పష్టంగా రూపొందించాలి. ఇతర సామాజిక వర్గీయుల్లో ఆత్మవిశ్వాసం కలిగించే క్రమంలో ఐచ్ఛికంగా దూకుడు, విధ్వంసంతో కూడుకున్న చర్యలను ఆమోదించడాన్ని సైతం నిర్మొహమాటంగా వెల్లడించాలి.
ఈ విధంగా ముస్లిం వర్గం చూపిన చొరవకు సంఘం సానుకూలంగా స్పందించింది. మంతనాల పక్రియలో మోసపూరితమైన, బలవంతపు మత మార్పిడి, రాడికలైజేషన్, జనాభా పరివర్తన అంశాలపై రాజీ ధోరణికి సంబంధించిన ఎలాంటి సంకేతం రాలేదు. ముస్లిం సమాజంలోని ఒక వర్గం వారి వాడల నుంచి వెలుపలకు వచ్చి వైవిధ్యంతో కూడుకున్న మత విశ్వాసాలను గౌరవించడంపై బహిరంగంగా ప్రకటించడం ప్రారంభించిన పక్షంలో వారిలోని హిందూ భావజాలం అయాచితంగా వ్యక్తమవుతుంది.
ఒక ముస్లిం సమూహం నిర్వహించిన ఆ కార్యక్రమంలో హిందూ రాష్ట్ర సాధనను ముందుకు తీసుకురావడం అత్యధికులకు ఒక నిరర్ధకమైన ప్రయాసగా కనిపించవచ్చు. వాస్తవానికి సర్ సంఘచాలక్ మాటల్లో చెప్పాలంటే విశ్వగురువుగా ప్రశంసలందుకుంటున్న భారతీయ సమాజంలో ఏ ఒక్క వ్యక్తి నిరాదరణకు గురికాడు. కనుక రాజకీయాలకు అతీతంగా మాతృభూమి, సమాజం నాది అనే నిజమైన భావన ప్రాతిపదికగా చర్చలు జరగడం అవసరం.
...ఆర్గనైజర్ సౌజన్యంతో, అనువాదం : మహేశ్ ధూలిపాళ్ల