విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలకు, హిందువుల పట్ల చూపుతున్న వివక్షతకు, నిర్లక్ష్యానికి నిరసన తెలిపేందుకు, హిందువుల ఐక్యతను, సంఫీుభావాన్ని ప్రకటించేందుకు, ఆటంకాలు కలిగిస్తున్న ప్రభుత్వానికి వినాయకుడు సద్భుద్ధిని ప్రసాదించేందుకు, సంప్రదాయబద్ధంగా వినాయకచవితి జరుపుకునే హక్కును ప్రకటించే నిమిత్తం యావత్ హిందూ సమాజం ఘంటానాదం చేయాలని ఏపీ విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం ఒక కరపత్రం విడుదల చేసింది.
ఈ నెల తొమ్మిదోతేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది నిముషాల పాటు ఇళ్ళనుంచి బయటకు వచ్చి, ఇండ్ల ముందు, దేవాలయముల్లో, కూడళ్లలో, గణేశ మండప ప్రదేశాలలో ఘంటానాదం చేయాలని కోరింది. ఈ మహత్తర కార్యక్రమంలో మీరు, మీ కుటుంబం సపరివార సమేతంగా, మీ ప్రభావం వుండే వ్యక్తులను, సంస్థలను, వ్యవస్థలను భాగస్వాములు చేయాలని వీహెచ్‌పీ ప్రాంత కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.
....విశ్వసంవాద కేంద్రము (AP)