: భౌతిక-ఆధిభౌతిక జీవనములు రెండింటి గురించీ మనం ఆలోచించాలి :
సామాజిక వ్యవస్థలకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నవి. వాటిని లోతుగా ఆలోచించవలసి ఉంది. సంఘంమీద బాధ్యత పెట్టినట్లయితే, యావత్తు సమాజంలో తగిన వ్యవస్థలను రూపొందించి నడిపించవలసి ఉంటుంది. సంఘం వాళ్లకి బయటివాళ్ళకి ఒక ముఖ్యమైన తేడా ఉంది. మనం భౌతిక జీవనం గురించే గాక, దానిని గురించి ఆలోచించే సమయంలోనే అధిభౌతిక జీవనం గురించి కూడా ఆలోచిస్తాం. కేవలం భౌతికవాదజీవనమే సంపూర్ణ జీవనం కాదని మనకు తెలుసు. దీనికి అతీతమైన జీవితం ఒకటి ఉంది, దానికీ మహత్వం ఉంది అని గ్రహించిన వారం మనం. కాగా ఆధ్యాత్మజీవనానికి సంబంధించి ఏకొంచెంకూడా ఆలోచించడానికి సంఘానికి బయట ఉన్నవారు సిద్ధపడరు. భౌతిక సంబంధమైన విషయాలు గూర్చి ఆలోచించే సమయంలో కూడా ఆధ్మాత్మిక సూత్రాలను విస్మరించరాదని సంఘం కోరుతున్నది. ఆధ్యాత్మిక సూత్రాలను విస్మరించి వ్యవహరించేటట్లయితే మనుష్యులు మనుష్యులుగా ఉండరు, పశువులుగా దిగజారిపోతారు. సంఘంలో మనం ప్రస్తావించే విషయాలలో 95శాతం భౌతిక జీవితానికి సంబంధించినవే ఉంటాయి.
స్థూలమైన మార్పులు చేసినంతమాత్రాన పనిజరగదు. పరిస్థితులను అధ్యయనం చేసి, ఆమూలపరివర్తనకూడా చేయవలసి ఉంటుంది. సంఘం ఈ విషయాలను అధికారికంగా చేపట్టి తన కార్యకలాపాలలో భాగంగా చేయకపోయినా కూడా, ఈ విషయాలను గురించిన జాగరూకత తప్పనిసరిగా ఉండాలి. క్రొత్త విషయాలకూ మహత్యం ఉంటుంది, వాటిని గురించి ఆలోచించాలి. ఇప్పటివరకూ మనం ఆలోచిస్తూ ఉన్న పాత విషయాలకు వాటిని జోడించుకోవాలి. అది పాతకొత్తల మేలు కలయికగా ఉండాలి. కొన్నింటిని వదిలివే యటంకూడా అవసరమౌతుంది కూడా.
ఎవరైతే ఏదన్నా ఇవ్వగలరో వారివెంటనే సమాజం నడుస్తుంది. వారిపట్ల తప్పుడు కల్పన లేవీ నిర్మాణంకావు. వారి ప్రభావం విస్తరిస్తుంది. దీనిని కొందరు సమాజవాదమనో, సామ్యవాదమనో పిలుస్తూ ఉండవచ్చు. కావాలనుకొంటే దీనిని హిందూ సమాజవాదమనీ అనవచ్చు. పేరుకి ఏమంత ప్రాధాన్యం లేదు. వ్యక్తుల యొక్క వ్యవహారం ఎలా ఉంది, ఆచరణ ఎలా ఉంది, వారు ఎటువంటి వైఖరిని, దృష్టికోణాన్ని ప్రదర్శిస్తున్నారు అన్న విషయాలకే మహత్వం ఉంది. సమాజంలోని ఇతర వ్యక్తులతో కలసి మాట్లాడేటప్పుడు స్వయం సేవకులు వారితో సమరసత కల్గినవారై, తమ ఆలోచనలను పంచుకోగల్గినపుడే సమాజంమీద తమదైన ముద్రవేయగల్గుతారు. ఈ కాలానికి తగిన విధంగా ఏయే కొత్త శక్తులు తలెత్తుతున్నవో, అవి ఏవిధంగా తమ ప్రభావాన్ని చూపిస్తున్నవో-వాటిని గ్రహించాలి. హిందూస్థానంలోని వ్యక్తులు ఓడలను అధిరోహించి జావా, సుమత్రా, బాలివంటి దూరదేశాలకు వెళ్లి అక్కడి ప్రజలను సంస్కారవంతులను చేసిన ప్రాచీన పరంపరకు చెందిన వాళ్లం మేము-అనే అభిమానం మనలో ఉండాలి. మధ్యలో చోటుచేసుకున్న కూపస్థమండుకాల కాలంలో మన ఈ అభిమానమనే గొలుసులోని కొక్కెములు తెగిపోయాయి. భ్రాంతితో కూడిన ధోరణులు జనించినవి. మనం ఈ విషయాలన్నింటినీ అవగాహన చేసుకోవాలి. నిత్యమూ క్రొత్త క్రొత్త మలుపులు తిరుగుతూ ఉన్న పరిస్థితులలో ప్రాచీన ఆధారాలు కల్గిన మన ఈ సమాజానికి వికాసమార్గాన్ని ప్రశస్తం చేయడానికి సంఘంయొక్క తాత్త్విక భూమిక నిర్మాణమైందని స్పష్టంగా గ్రహించుకోవాలి.