: సంఘం యథాస్థితివాది కాదు :
రాజకీయ రంగంలోకి వెళ్ళి పనిచేస్తున్న స్వయం సేవకుల ఉదాహరణ తీసికొని పరిశీలించుదాం. వీళ్ళందరూ మంచివాళ్ళు, శీలవంతులు, జాతీయవాదులు, చైనానుండిగాని,మరో విదేశంనుండి గాని యుద్ధపరిస్థితులు ఏర్పడినపుడు వీరి ఆలోచనలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, కాని దేశంలో ప్రణాళికా రచనా, సామాజిక సమస్యలు, ఆర్థికప్రణాళికలు మొదలైన విషయాలు, సమస్యలు చర్చకు వచ్చినపుడు ఇవి సంఘంవాళ్ళ విషయాలుకావు- అనే అభిప్రాయం ప్రజానీకంలో ఏర్పడి ఉంది. దీనికి ఒక్కటే కారణం.
మనవాళ్ళు మాట్లాడేటప్పుడు ప్రాచీనపరంపర, వారసత్వాలగురించి, సంస్కృతి ఆధ్యాత్మిక జ్ఞానాలగురించి, ధర్మంగురించి ప్రస్తావన చేస్తూ, వాటికి సంబంధించిన పదజాలాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది తప్పనిగాని, దోషమని నేను అనుకోవటం లేదు. అయితే ఈనాటి అత్యంత ఆధునికుల మనుకొనేవారు-వారు కమ్యూనిస్టులు కావచ్చు, సోషలిస్టులు కావచ్చు, లేదా కాంగ్రెసువారు కావచ్చు-వారు తమ ఉపన్యాసాలలో ఒక విశిష్టమైన భాషను, కొన్ని పడిగట్టుపదాలనూ వినియోగిస్తుంటారు. అలాగే మనవాళ్ళు కూడా తమదైన విశిష్టభాషను ఉపయోగిస్తున్నారు. అందులో ఆనవాయితీగా మారిపోయిన పదప్రయోగాలను బట్టి ప్రజలలో ఇటువంటి భ్రమలు ఏర్పడుతున్నవి.
సమాజంలోని వివిధ క్షేత్రాలలో, వివిధ సందర్భాలలో సంఘ స్వయం సేవకులకు సంపర్కం ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో రకరకాల విషయాలపై చర్చలు, వార్తాలాపాలూ జరుగుతూ ఉంటాయి. మహమ్మదీయుల విషయమో, క్రైస్తవుల విషయమో వారిద్వారా నిర్మాణమవుతున్న సమస్యల విషయమో వచ్చినపుడు స్వయం సేవకులు కొంచెం వేడిగా, వాడిగా స్పందిస్తారు. ఆధ్యాత్మిక విషయాల ప్రస్తావన వచ్చినపుడు తమకు ధర్మంపట్ల ప్రేమ, శ్రద్ధ ఉందని తెలియజెప్పే తీరులో రెండుమూడు మాటలు చెప్తారు. కాగా ఇతర విషయాలు పేదల సంక్షేమ పథకాలు, ప్రణాళికారచన, బ్యాంకుల నిర్వహణ, వివిధ ఇజాలగురించిన చర్చలు- ఇలాంటివి చర్చకు వచ్చినపుడు- ఇది మన విషయం కాదన్నట్లుగా ఉండిపోతారు. సాంస్కృతిక క్షేత్రమే మనది. ఆర్థిక, సామాజిక విషయాలప్రస్తావన వచ్చినపుడు సోషలిస్టులో,కాంగ్రెసు వారో ఆ విషయాలు చూసుకొంటారనే ధోరణిలో ఉంటారు. ఇతర ప్రజానీకం భావిస్తున్న తీరులోనే స్వయం సేవకులు కూడా తమ మనస్సుల్లో అభిప్రాయాలు కలిగి ఉన్నట్లయితే, అది ప్రయోజనకరం కాదు. దానివల్ల ఏపనీ జరగదు.
ప్రజల్లో గూడుకట్టుకొని ఉన్న సందేహాలు తీరేటట్లుగా, భ్రాంతులు దూరమయ్యేటట్లుగా మనం వ్యవహరించవలసి ఉంది. సంఘంవాళ్లు గతంలోని విషయాలపట్ల అభిమాన మున్నవాళ్లు, ఆ విషయాలను వాటికిగల హద్దులలో ఆలోచించుతూ ఉండేవాళ్లు అయినప్పటికీ, ఇప్పటినలువైపులా ఉన్న పరిస్థితి గురించి, ఉత్పన్నమవుతున్న సమస్యలగురించి కూడా అంటే నేటి కాలప్రవాహాన్నికూడా బాగా గమనిస్తూ ఉన్నవారు, సరియైన అవగాహన ఉన్నవారు అని బయటివారికి అనిపించాలి. హిందువుల పురాతన పరంపరలోనే అన్ని విషయాలు ఉన్నాయి అన్న ధోరణిలో ఆలోచించటం సంఘస్వయంసేవకులకు తగినదికాదు. నేటి వాస్తవిక భౌతిక స్థితి గతులగురించి ఏమి ఆలోచిస్తున్నాము? ఒకవేళ ఏ కారణంతోనైనా గాని, స్వయం సేవకులు ఈ ధోరణిలోనే ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ఇతర ప్రజానీకం మీద మనం ఏవిధమైన పైచేయి సాధించాలనుకొంటున్నామో, దానిని సాధించజాలము.
ఇప్పుడున్న పరిస్థితులే ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనుకొనే యథాస్థితి వాదులం కాదు మనం. హిందువుల మూలతత్త్వం ఏదైతే ఉందో, దానిని తిరిగి సాధించడానికి సమాజంలో పెనుమార్పు రావాలని కోరుకొనే హిందువులం మనం. అందులో ఏమి ఉంది, ఇందులో ఏమి ఉంది? - అంటూ
పెద్ద పెద్ద విషయాలను చర్చిస్తూ కాలం గడిపేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. 'ప్రపంచమంతా ఒక్కటే,' బ్రహ్మసత్యం, జగత్ మిథ్య' అంటూ పెద్ద సిద్ధాంతాలను ఏకరువ్వు పెట్టుతుంటారుగాని, వారు అనుసరించే వాస్తవిక ధర్మము, తత్త్వజ్ఞానము అత్యంత సంకుచితమైనవిగాను, వారి వంటింటి ఆచారాలకు గిరిగీసుకున్నవిగానూ ఉంటాయి. భోజనము మొదలైన విషయాలలో నియమనిష్ఠలు గలిగి వ్యవహరిస్తూ, వీలైనంత ఎక్కువ సమయం పూజలలోనో, ధ్యానంలోనో గడుపుతూ ఉండేవారినే నేటి ప్రపంచం పైపైన చూసి సత్యవాదులుగా, ధర్మాత్ములుగా భావిస్తున్నది. వాస్తవానికి ఇవన్నీ మిగుల సంకుచితమైన విషయాలు.
మనం పరాయిపాలనలో దాసత్వాన్ని అనుభవిస్తున్నకాలంలో మనదృష్టికోణం సంకుచితమై పోయింది. తత్కారణంగా మన సమాజంలో ఆలోచించే తీరుకూడా సంకుచితమైంది. 'అదితినవద్దు', 'వీరితో వివాహ సంబంధాలు పెట్టుకోవద్దు' మొదలుగాగల సంకుచితమైన ఆలోచనల కారణంగా మన సమాజం కుంచించుకుపోయి పరాజయాల పాలయిన స్థితి ఉత్పన్నమైంది. పరాజయాలతో సమాజం మరింతగా చిన్నదైపోయింది. కాలగమనంలో మధ్యలో వచ్చి చేరిన వికృతజీవనశైలినికూడా అభిమానించటం ప్రాచీన పరంపరను అభిమానించటం కాజాలదు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి.