RSS - Path Sanchalan march |
: కార్యానికి ముఖ్యమైన ఆధారం సామాన్యస్వయం సేవకులే :
ప్రచారకులుగా ఉన్నవారు కార్యాన్ని పెంచేవాళ్లే, అయితే సంపూర్ణకార్యానికి ముఖ్య ఆధారం సమాజంలోని సామాన్య వ్యక్తులే-చదువుతూ ఉన్నవారు, చదువు ముగించి వృత్తిలో, వ్యాపారంలో ప్రవేశించినవారు, గృహస్థులై ఇంటిని నడిపించుతూ ఉన్నవారు-మొదలైనవారే. యుద్ధ మైదానంలోకి వెళ్లి నిలబడే సైనికులకు కూడా ఇల్లూ, కుటుంబం ఉంటుంది. సైనికులు ఉంటేనే దేశంపై జరిగే ఆక్రమణలను ఎదుర్కొంటాము, అంతర్గత సమస్యల పరిష్కారానికి ప్రయత్నం జరుగుతుంది - అనే దృష్టికోణం ఏర్పడితే అది హాస్యాస్పదమవుతుంది. సమాజంలోని నలుగురూ ఎలా ఉంటున్నారో, వారిలాగే గృహస్థులుగా ఇంటి బాధ్యతలను వహిస్తూ ఉన్న సామాన్య స్వయం సేవకులే సంఘానికి వాస్తవమైన ఆధారం. ప్రచారకుల జీవితం ఒకవిధంగా అస్వాభావికమైనది.
సంఘచాలక్, కార్యవాహలవంటి బాధ్యతలలో ఉంటూ సర్వసాధారణ జీవితం గడుపుతూ ఉన్న స్వయంసేవకులు ఎన్నో రకాలుగా తమమీద వచ్చి మీద పడుతున్న వ్యక్తిగత సమస్యలను, మోహాలను, అనుబంధాలను, సుఖదుఃఖాలనూ, తమవృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే ఇబ్బందులను, ప్రమాదాలనూ లెక్కజేయకుండానో, పరిష్కరించు కొంటూనో, భరిస్తూనో-ఇన్నింటి మధ్యలో ఉంటూ కూడా సంఘకార్యాన్ని నిర్వహించే ఆకాంక్షతో ముందడుగువేస్తున్న కార్యకర్తలే సంఘానికి వాస్తవికమైన ఆధారం. కాబట్టి వారిద్వారానే సంఘాన్ని నడిపించే ప్రయత్నం చేయాలి. మన పనిని ప్రచారకులమీద ఆధారపడి జరిగే ప్రచార కానువర్తిగా చేయరాదు. సామాన్యజీవనం గడుపుతూ ఉన్నవారిలోనుండి ఒక బృందంగా కొందరు కార్యకర్తలైనా బాధ్యతలు వహించడానికి సిద్ధపడకపోయినట్లయితే, సంఘకార్యం సంతులితముగా ఉండజాలదు. రకరకాల సమస్యలతో సతమతమయ్యే స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించుకొని సంతులితంగా సంఘకార్యాన్ని నిలబెట్టవలసి ఉంటుంది.
RSS Swayam Sevaks |
-
సంఘకార్యాన్ని వేగంగా విస్తరింపజేయడానికి, అన్నిచోట్లా ఒకే తీరులో పనిచేసే విధంగా ఒక నమూనా కార్యవ్యవస్థను నిర్మించడానికి ప్రచారకులు అవసరమవుతారు. ఇతర సంస్థల మాదిరిగా ఇక్కడ కూడా కార్యకలాపాలు డీలాగా జరిగేటట్లయితే నిత్యసిద్ధశక్తి నిర్మాణం సాధ్యంకాదుగదా! సంఘకార్యం కొరకు అంకితులైన ప్రచారకులు మంచిసంఖ్యలో ఉన్నట్లయితే, మన కల్పనను అనుసరించి సంఘకార్యాన్ని మంచిగాను వేగంగానూ ముందుకు తీసికొనిపోగలము. ప్రచారకుల ఉపయోగిత మనకు స్పష్టంగా కనబడుతున్నందున ఈ వర్గం యొక్క అస్తిత్వాన్ని నిలిపి ఉంచటం అవసరమవుతున్నది; అంతేకాదు, వీరిసంఖ్య పెరుగుతూ ఉండాలనే విషయంలోనూ ఎల్లప్పుడు శ్రద్ధ, పట్టుదల కలిగి వ్యవహరిస్తాము. ఈ విధమైన ఆలోచన మనముందు ఉన్నప్పటికీ, సంఘానికి వాస్తవమైన ఆధారం సామాన్య జీవితం గడిపే స్వయం సేవకుల వర్గమేనన్న విషయాన్ని మరచిపోరాదు. ఈ ఆలోచన ఏనాడూ మనదృష్టిపథం నుండి తప్పించుకొనిపోకుండా నిత్యసంస్మరణలో ఉంచుకోవాలి. ఈ విషయంలో అశ్రద్ధవహించినట్లయితే ఎన్నో దోషాలు మన పనిలో ప్రవేశించగలవు.
డాక్టర్జీకి అత్యంత సన్నిహితంగా ఉండిన వ్యక్తి, సహచరుడు శ్రీ అప్పాజీ జోషీ. వారితో కలసి ఒకసారి మాట్లాడుతున్నపుడు ప్రచారకులవర్గం ఒకటి ఉన్నందున సంఘానికి లాభం కలిగినట్లుగానే, కొన్ని చోట్ల, కొన్ని సందర్భాలలో హానికూడా జరిగింది అన్నారు. ప్రచారక్ ఒకరు అందుబాటులో ఉన్నందున స్థానికంగా ఉండే సంఘచాలకులు, కార్యవాహలూ మొదలైన కార్యకర్తలు పర్యటనచేయటం ప్రచారక్ పని అనుకోనారంభించారని చెప్పారు. ప్రచారక్ 24 గంటలూ ఇదేపని చేయటం కోసమని వచ్చాడు గదా! అతనికి ఇది తప్ప వేరే పనిలేదుగదా, కాబట్టి ఎవరెవరిని కలసి మాట్లాడవలసి ఉంటుందో, అది ప్రచారక్ పనే- అని అనుకోవటం వల్ల స్థానీయ కార్యకర్తలకు పనిచేసే అలవాటు తగ్గిపోతుంది. ప్రచారక్ అందుబాటులో లేనపుడు వీరందరూ పర్యటనలు చేసి, క్షేత్రంలో విస్తరించియున్న కార్యకర్తలందరినీ సంపర్కం చేస్తుండేవారుగదా! తొలినాళ్ళలో స్థానీయ కార్యకర్తలు తాము తలమునకలుగా ఉండే తమ తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను చేసుకొంటూనే ఏదో ఒక విధంగా కొంత సమయం తీసి సమీప గ్రామాలకు, పట్టణాలకు వెళ్ళి సంఘకార్యం నడిపించటం తమ బాధ్యతగా స్వాభావికంగానే భావిస్తుండేవారు. వివిధ స్థానాలకు ప్రచారకులు చేరుకున్న తర్వాత ఈ ప్రవృత్తి తగ్గిపోయింది. ప్రచారక్ ఉన్నాడు, అతడు 24 గంటలు సంఘం పనిచేస్తుండాలి అనే ఆలోచన రావటమే దీనికి కారణం.