ఆఫ్ఘనిస్తాన్‌లో ఏమైతే మనకేం.. వాళ్లు వాళ్లు కొట్టుకుచావనీ అన్నాడో మిత్రుడు.. ఆఫ్ఘన్‌లో జరుగుతున్న పరిణామాలు అక్కడి వారికి మాత్రమే కాదు.. సమీప భవిష్యత్తులో మనకు కూడా చేటు తెస్తాయనేది వాస్తవం.
ఆఫ్ఘనిస్తాన్ ఒకనాటి అఖండ భారత దేశంలో భాగం అనే చరిత్రను తెలుసుకోవాలి..ఆఫ్ఘనిస్తాన్ అంటే 'అఫ్ఘన్ జాతీయుల ప్రదేశం'.. మహాభారత కాలంలో 'గాంధార్' అని పిలిచేవారు. కందహార్ పేరు గాంధార్ నుంచే వచ్చింది.. రాజధాని కాబూల్ పూర్వ నామం 'కుభ'.. క్రీస్తు పూర్వం పర్షియన్ల (పార్శీల) పాలనతో సమకాలీన చరిత్ర కనిపిస్తుంది. జోరాస్ట్రియన్, బౌద్దం, హిందూ మతాలు అక్కడ బలంగా ఉండేవి.. అలగ్జాండర్ నాయకత్వంలో గ్రీకుల దండయాత్రతో విదేశీయుల ప్రమేయం మొదలవుతుంది. తర్వాత మౌర్యులు, కుషానులు, హూణుల పాలన సాగింది..
ఇస్లాం మతం ఆవిర్భవించాక ఆఫ్ఘన్ మీద అరబ్బుల దండయాత్రలు మొదలయ్యాయి. ఘజనీ, తైమూర్‌ల కాలంలో అక్కడి మన ప్రాచీన ఆరాధనా పద్దతులు దెబ్బతిన్నాయి.. విదేశీ పాలకులైన మంగోలులు, మొఘలులు, హోతాకీ, దుర్రానీ, బారక్దాయి వంశాల పాలనలో చాలా నష్టపోయింది. సిక్కులు కూడా కొంత కాలం పాలించారు.
అఖండ భారత దేశం మొత్తం ఒకే పాలనకింద లేకపోయినా వివిధ రాజ వంశాలు, సామంతులు, సంస్థానాధీషులు, స్థానిక పాలకుల కాలంలో ఒకే సాంస్కృతిక మూలాలు, ఆరాధనా పద్దతులు విలసిల్లాయి. విభజించి పాలించు మనస్థత్వ బ్రిటిష్ కాలం నుంచి మన సరిహద్దులు చెదిరిపోయాయి..
ఆంగ్లో - ఆఫ్ఘన్ యుద్దాలతో ఆఫ్ఘన్ ముందుగా దూరమైపోయింది.. తర్వాత బర్మా, సయాం, శ్రీలంకలను విడదీశారు. నేపాల్, భూటాన్ మనకు రాజకీయ పాలనాపరంగా వేరుగా ఉన్నా సాంస్కృతికంగా మనతో ఇప్పటికీ మమేకంగా ఉన్నాయి. బ్రిటిష్ వారు భారత దేశానికి వదిలిపోతూ మన దేశాన్ని చీల్చి పాకిస్తాన్ (పశ్చిమ, తూర్పు) ఏర్పాటు చేశారు.. పాకిస్తాన్ చీలి బంగ్లాదేశ్ స్వతంత్రంగా ఆవిర్భవించింది..
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో భారత దేశ అఖండత దెబ్బతినడాన్ని గమనించవచ్చు.. తొలిహోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దౌత్యంతో జమ్మూకశ్మీర్ మన దేశంలో సంపూర్ణంగా విలీనమైంది, కానీ పాకిస్తాన్ దురాక్రమణలో కొంత భూభాగాన్ని చెరపట్టింది. దీన్ని సైనికంగా పరిష్కరించే సమయంలో నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి శాశ్వతంగా అంతర్జాతీయ సమస్యగా మార్చేశారు.
బ్రిటిష్‌వారు వెళ్లిపోయిన తర్వాత టిబెట్ రక్షణ బాధ్యత మన దేశం మీదే ఉండేది.. అప్పటికే నెహ్రూ 'హిందీ-చీనీ, పంచశీల' మత్తులో పడ్డారు.. టిబెట్‌ను చైనా ఆక్రమించినా పట్టించుకోలేదు.. పైగా అందరికన్నా ముందుగా టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తించారు. అదే తెగింపుతో చైనా మన లద్దాక్‌లోని అక్సాయ్ చిన్‌ను అక్రమించింది,, పైగా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని దబాయిస్తోంది. మన రక్షణలో ఉన్న భూటాన్‌కు కబలించే ప్రయత్నాలు చేస్తోంది.
శత్రు దేశాలు పాకిస్తాన్, చైనాలు నిరంతరం మన దేశంపై కత్తులు దూస్తున్నాయి. సరిహద్దుల్లో సమస్యలు సృష్టిస్తూ, తీవ్రవాదాన్ని రెచ్చగొడుతున్నాయి. ఈ దేశాల మద్దుతుదారుల (ఇంటి దొంగలు)తో మరింత ప్రమాదం పొంచి ఉంది. తాలిబన్లు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ను అక్రమించారు.. వారి తర్వాత మజిలీ పాకిస్తాన్, కశ్మీర్.. వారి విధానాలు ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశాయి..
ఇప్పడు మనం జాగ్రత్తగా ఉండకపోతే.. ఇప్పుడున్న భారత దేశానికి కూడా ముప్పుఖాయం.. మన దేశంలో రాజకీయంగా విబేధాలు ఎన్నైనా ఉండొచ్చు. కానీ అంతర్జాతీయ పరిణామాలు గ్రహిం'చైనా' ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.