“మృత్యువు నా తలుపు తడుతోంది. నా మనస్సు శాశ్వతత్వం వైపుగా ఎగిరిపోతోంది. .ఇలాంటి ఆనందకర, పవిత్ర క్షణంలో నేను మీకు ఏమి ఇవ్వగలను? స్వతంత్ర భారతమనే స్వర్ణ స్వప్నాన్ని తప్ప..18 ఏప్రిల్,1930నాటి చిట్టగాంగ్ తిరుగుబాటును ఎప్పుడు మరచిపోవద్దు…భారత స్వాతంత్ర్యపు హోమకుండంలో తమ జీవితాలను సమర్పించిన దేశభక్తుల పేర్లను మీ గుండెల్లో పదిలంగా దాచుకోండి.’’ – ఇదీ సూర్యసేన్ చివరిసారిగా తన స్నేహితులకు వ్రాసిన లేఖ.
చిట్టగాంగ్ లోని నౌపారాలో 1894 మార్చ్ 22న సూర్యసేన్ జన్మించారు. 1916లో బెహరాంపూర్ కళాశాలలో బి ఏ చదువుతున్నప్పుడు ఒక అధ్యాపకుడి ద్వారా స్వాతంత్ర్యోద్యమ సంగ్రామం గురించి తెలుసుకున్నాడు. విప్లవకారుల లక్ష్యం, ఆదర్శాలకు ఆకర్షితులైన సూర్యసేన్ అనుశీలన సమితి అనే విప్లవ సంస్థలో చేరారు.
చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడి
1930 ఏప్రిల్ 18న సూర్యసేన్ నాయకత్వంలో కొందరు విప్లవకారులు చిట్టగాంగ్ పోలీసు ఆయుధాగారంపై దాడి చేశారు. ఆయుధాలను చేజిక్కించుకోవడమేకాక టెలిఫోన్, టెలిగ్రాఫ్, రైల్వే మొదలైన వ్యవస్థలను ధ్వంసం చేయడం ద్వారా చిట్టగాంగ్ కు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలను పూర్తిగా తెంచివేయడం ఈ దాడి లక్ష్యం. అయితే దాడిలో ఆయుధాలను స్వాధీనపరచుకున్న విప్లవకారులు మందు సామగ్రిని మాత్రం చేజిక్కించుకోలేకపోయారు. ఆయుధాగారంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయారు. ఇది జరిగిన కొన్ని రోజులకే జలాలాబాద్ కొండల్లో ఉన్న విప్లవకారుల స్థావరాన్ని పెద్ద సంఖ్యలో బ్రిటిష్ బలగాలు చుట్టుముట్టాయి. అప్పుడు సాగిన పోరులో 12మంది విప్లవకారులు అమరులయ్యారు. అనేకమంది పట్టుబడ్డారు. సూర్యసేన్ తో సహా మరికొంతమంది మాత్రం తప్పించుకున్నారు.
అరెస్ట్, మరణం
జలాలాబాద్ నుంచి తప్పించుకున్న సూర్యసేన్ చాలా కాలం పోలీసులకు చిక్కకుండా వేరువేరు ప్రాంతాల్లో తిరిగారు. కార్మికుడిగా, రైతుగా, పూజారిగా, ఇంట్లో పనివాడుగా వివిధ అవతారాలలో పోలీసుల కన్నుగప్పి తిరిగారు. ఒకసారి ఆయన నేత్రసేన్ అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారు. సూర్యసేన్ తమ ఇంట్లో ఉన్నడంటూ నేత్రసేన్ పోలీసులకు సమాచారం అందించడంతో 1933 ఫిబ్రవరి లో పోలీసులు అరెస్ట్ చేశారు. విప్లవకారుడిని పట్టిచ్చినందుకు బ్రిటిష్ వారి నుంచి బహుమానం అందుకోవచ్చని నేత్రసేన్ అనుకున్నాడు. కానీ ఆ బహుమతి అందుకోవడానికంటే ముందే అతను చేసిన మోసానికి శిక్ష అనుభవించాడు. ఒక విప్లవకారుడు అతని తలనరికి చంపాడు. ఉరి తీయడానికి ముందు బ్రిటిష్ వాళ్ళు సూర్యసేన్ ను అమానుషంగా హింసించారు. నోట్లో పళ్ళన్ని పీకారు. గోళ్ళను ఊడబెరికారు. ఎముకలను విరిచారు. ఈ దారుణ హింసకు స్ఫృహ తప్పిన సూర్యసేన్ ను అలాగే ఉరికంబం దగ్గరకు ఈడ్చుకుని వచ్చారు. 1934 జనవరి 12న సూర్యసేన్ ను ఉరి తీశారు.