: పూర్ణకాలిక కార్యకర్తలు కావాలన్న కోరిక :
నాగపూర్ చుట్టుప్రక్కల చిన్నవి, పెద్దవి అయిన కొన్ని శాఖలు ఉండేవి. వాటికి జనులు వస్తుండేవారు. సంఘకార్యం నిమిత్తం తమ గ్రామం విడచిపెట్టి వేరేచోటకుపోయే కార్యకర్తలకు ప్రచారకులనిగాని, విస్తారకులనిగాని పేరు ఏది పెట్టబడలేదు. మహారాష్ట్రలో అప్పటికి కొంతకాలంగా సంఘకార్యం జరుగుతూ వచ్చినందున దీర్ఘకాల ప్రాతిపదికన వచ్చి పని చేసేవారిని పంపించాలని కోరుతూ ఉండేవారు. నెలా, రెండు నెలలు ఉంటే సరిపోదని, ఇంకా ఎక్కువకాలం ఉండేవారు కావాలని కోరుతూ ఉండేవారు. దానిలోనుండి తమ చదువుసంధ్యలు ముగించుకొన్న ఏదో ఒక ఉద్యోగంలో చేరడానికి బదులుగా, సంఘ కార్యం నిర్వహణకే సమయమిచ్చే విధంగా యువకులు ముందుకురావాలన్న కల్పన చేయబడింది. అలా వస్తున్నవారి సంఖ్య పెరుగుతూరాగా, నెమ్మది నెమ్మదిగా ప్రచారకుల పేరుతో పనిచేస్తున్న స్వయం సేవకుల వర్గం రూపుదిద్దుకొంది. తమ చదువు పూర్తి చేసికొనిన స్వయం సేవకులలో ఒక సాంగ్లీకి వెళ్లారు. మరొకరు పుణేకి వెళ్ళారు. మరొకరు ముంబైకి వెళ్లారు. ఈ విధంగా బయటకు వెళ్లి పనిచేసే పద్ధతి నడుస్తూ వచ్చింది.
ఈ పద్ధతిలో పనిచేస్తుండగా, ఎప్పుడైతే సంఘకార్యాన్ని దృఢపరచటంలో సఫలత లభించటం కనిపించిందో అప్పుడు సంఘకార్యాన్ని బాగా వేగంగా విస్తరింపజేయాలంటే, పూర్తి సమయమిచ్చి పనిచేసే ప్రశిక్షిత కార్యకర్తలు-ఎవరినైతే ఆ తర్వాత ప్రచారకులుగా పేర్కొనటం జరిగిందో-పెద్ద సంఖ్యలో మనవద్ద ఉండాలన్న ఆలోచన వచ్చింది. సంఘకార్యం ఏవిధంగా విస్తరించుతూ వచ్చిందో, దానితోపాటు సంఘంలో లభించిన సంస్కారములు, ప్రేరణా కారణంగా సంఘకార్యం చేయడానికి స్వచ్ఛందంగా తమపూర్తికాలాన్ని వెచ్చించడానికి సిద్ధపడినవారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. వారు తమ చదువు పూర్తి చేసుకొని వేఱు వేణు క్షేత్రాలకు వెళ్లి పనిచేయనారంభించారు. అటువంటి కార్యకర్తలు అన్ని ప్రాంతాలకూ వెళ్లారు. ఈనాడు సంఘకార్యం ఇంతగా అన్ని ప్రాంతాలలోకి విస్తరించటానికి, ఇంత పెద్ద సంఖ్యలో శాఖలు నిర్వహింపబడడానికి, స్వయం సేవకులుగా పిలువబడే వారందరూ ఒక విశిష్టమైన నమూనాలో నలువైపులా తీర్చిదిద్దబడడానికి ప్రచారక స్వయం సేవకుల ప్రయత్నాలే ప్రధానమైన ఆధారము.
ప్రచారకులు ఎలా ఉపయోగపడుతారంటే...
ప్రచారకులు ఎలా ఉపయోగపడుతున్నారో గ్రహించడానికి మనం వ్యవసాయానికి సంబంధించిన ఉదాహరణను తీసికొందాం. ఆవుపేడవంటి ఎరువులు వాడినా, రసాయనిక ఎరువులు వాడినా పంట దిగుబడి పెరుగుతుంది. కృషిలో ఉత్పాదనకు మూలాధారం ఆవుపేడ ఎరువే. కాగా రసాయనిక ఎరువులను ఒక నిశ్చితమైన మోతాదులో వాడితే దిగుబడి చాలా ఎక్కువగా వస్తుంది. శాస్త్రం చెప్పే ప్రకారం ఆవు పేడ ఎరువువాడితే ఏళ్ళు గడచినకొద్దీ భూమిలో ఉత్పాదకశక్తి పెరుగుతూ వస్తుంది. భూమిలో ఈ ఉత్పాదకశక్తి ఖాయంగా ఉండి, దానికి రసాయనిక ఎరువునుకూడా జోడించినట్లయితే దిగుబడి ఒక్కసారిగా విశేషంగా పెరుగుతుంది. ఈ విధంగా ఎలాగైతే వ్యవసాయంలో రసాయనిక ఎరువులు వేయటంద్వారా అధికోత్పాదన సాధించటం జరుగుతూ ఉంటుందో, ప్రచారకుల మాధ్యమంగా సంఘకార్యం వేగంగా వృద్ధి చెందుతుంది. స్థానికంగా ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నవారితో, గృహస్థులుగా ఉంటూ వృత్తి, ఉద్యోగ వ్యాపారాలో నిమగ్నమైయున్నవారితో ఆశించిన స్థాయిలో సంఘకార్యం విస్తరించటం లేదు.