గతంలో చేసిన చారిత్రాత్మక తప్పిదం యొక్క పరిణామాలు
భారతభూమిపై నేడు ఒక పాకిస్థాన్ నిర్మాణమైనదంటే, అది ఈ తప్పు యొక్క పరిణామమే. తండ్రి చేసిన అప్పు తనయుడు తీర్చవలసి ఉంటుందన్నమాటకు నిదర్శనంగా ఉంది. మన పూర్వీకులు దేశానికి రెండు కొసలలోనూ ముస్లిం అల్పసంఖ్యాకవర్గం పెద్ద సంఖ్యలో ఉండేందుకు అవకాశమివ్వటం ద్వారా చేసిన చారిత్రక తప్పిదం యొక్క పరిణామమే ఇది. మన సమాజానికి చెందిన మన సోదరులు మతం మార్చబడగా, వారిని మరల హిందూధర్మంలోకి తీసికొనిరాకుండా వదిలివేసిదానికి ప్రత్యక్ష దుష్పరిణామమిది. గ్రామంలోకి రాత్రివేళ క్రైస్తవ ఫాదరీలు వచ్చి గ్రామంలోని బావిలో డబల్ రోటీ (బ్రెడ్) ముక్కలు పడవేయగా, తెల్లవారిన తర్వాత ఆ గ్రామస్థులు రోజూ మాదిరిగానే ఆ బావి నీరు తీసికొని త్రాగడానికి,ఇతర అవసరాలకు వినియోగిస్తూ ఉంటే, క్రైస్తవులు ఆ బావిలోని నీరు త్రాగిన వారందరూ క్రైస్తవులైపోయినట్లేనని చెప్పేవారు.
అలా ఎందుకవుతుంది అని ప్రశ్నించిన వారికి రాత్రి డబల్ రోటీ ముక్కలు వేశాంగదా, మీ లెక్కప్రకారం క్రైస్తవులు చేతితో తాకిన దేనిని తిన్నా, తాకినా వారు క్రైస్తవులు అయిపోయినట్లే గదా అని వాదించేవారు. బలవంతంగా మహమ్మదీయులుగా మార్చబడిన వారితోనే కేరళలో మోప్లాలు అనే జాతి ఏర్పడింది. కశ్మీరులో కూడా హిందువులను పెద్ద సంఖ్యలో ముస్లింలుగా మతం మార్చటం జరిగింది. అక్కడ రాజు పండితులను పిలిచి వారిని మరల హిందువులుగా చేయవలసిందని చెప్పినపుడు ఒకసారి అన్యమతాలలోకి పోయినవారు మరల హిందూధర్మంలోకి రావడానికి ఎటువంటి ఏర్పాటూ మనధర్మశాస్త్రాలలో లేదని చెప్తూ, వారు ఆ పనిని నిర్వర్తించడానికి నిరాకరించారు. వారు ఎంతదూరంపోయారంటే, మీరుగనుక మామాటను పెడచెవిన పెట్టి వారందరూ హిందువులైనట్లుగా ప్రకటించినట్లయితే మేము-కశ్మీరీబ్రాహ్మణుల మందరం ఆత్మహత్య చేసుకొంటాం-దానివల్ల మీకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొంటుంది అని బెదిరించారు.
ఆరోజులలో ఆలోచనలు ఈ తీరులో ఉండేవి. అయితే సంఘ స్వయం సేవకులు ఈ విధమైన పురాతన పంథీలు (పాతకాలం మనుష్యులు) కారు. ఏ హిందూసమాజంలోని వ్యక్తులైతే చిన్న చిన్న ఓడలలో పయనించి జావా, సుమత్రాలకు వెళ్లారో, ఎవరైతే 'కృణ్వంతో విశ్వమార్యమ్' అని ఘోషించారో (అనగా తాము హిందూస్థానం నుండి బయల్వెడలి దేశదేశాల ప్రజలను కూడా ఆర్యులుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారో) అటువంటి హిందూ సమాజం ఎటువంటి హాస్యాస్పదస్థితికి దిగజారిపోయిందో చూశారా?
భారతదేశం మీదకు శకులు, హూణులు ఆక్రమణలు చేసినపుడు ఈ హిందూసమాజం వారినందరినీ జీర్ణం చేసుకొంది. ఆ సమయంలో సమాజానికి అటువంటి జీర్ణశక్తి ఉండేది. దీనికి మరో కారణం కూడా ఉంది. హూణులుగాని, శకులుగాని యుద్ధంచేసి, విజేతలై రాజ్యం చేయాలనే కోరికతోనే వచ్చారు. మహమ్మదీయులు మాదిరిగా తమ మతాన్ని, జీవనవిధానాన్ని ఇక్కడి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసినవారు కాదు. వారు ఇక్కడ పాలకులు అయిన తర్వాతకూడా ఇక్కడి ధర్మ సంస్కృతులు తమ వాటికంటే శ్రేష్ఠమైనవిగా తోచినవి. దానికి తోడుగా మన సమాజంలో శక్తి ఉన్నది. ఆకారణాన వారిని జీర్ణం చేసుకోవటం జరిగింది. మహమ్మదీయుల దాడులకాలంలో బలవంతంగా మహమ్మదీయులుగా మార్చబడినవారు, మరల తప్పించుకొని తమ పాత మతాలలోకి పోకుండా చూసుకొనడానికి మహమ్మదీయులు చాలా కష్టపడవలసి ఉంటుండేది, కాని హిందూసమాజంలోని ప్రజలు చెప్పుతూ ఉండేవారు కదా - ఒకసారి ఏ కారణంతోనైనా మహమ్మదీయునిగా మారితే అతడు శాశ్వతంగా మహమ్మదీయుడైపోయినట్లే!