: సంఘటనలోని వివిధ వ్యవస్థలు :
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సంఘటనాత్మక వ్యవస్థలో మూడు రకాల విభిన్న బాధ్యతలు కల్గినవారుంటారు. శాఖా కార్యవాహ, ముఖ్యశిక్షకులు - ఈ స్థాయితో ఆరంభించి మండల, ఖండ, జిల్లా, విభాగ్, ప్రాంత, క్షేత్ర, అఖిల భారత స్థాయివరకు కార్యవాహలు ఉంటారు. ఇది మొదటి ప్రవాహం.
రెండవ ప్రవాహం వివిధ స్థాయిలలో పనిచేసే ప్రచారకులు ఉంటారు. మూడవ ప్రవాహంలో సంఘచాలకులు ఉంటారు. పైకి వెళ్తున్న కొద్దీ ఈ మూడు ప్రవాహాలు కలిసి త్రివేణీసంగమంగా ఏకీకృతమవుతుంది. శాఖస్థాయిలో స్వయంసేవకులు నియమితంగా శాఖకు వచ్చేటట్లుగా ప్రోత్సహించే గటనాయకులు, స్వయంసేవకులను వయస్సును బట్టి బాల, తరుణ, ప్రౌఢ స్వయం సేవకులుగా గణలుగా ఏర్పరచి శారీరిక శిక్షణనిచ్చే గణ శిక్షకులూ ఉంటారు. ఒక శాకలో కార్యక్రమాలన్నీ చక్కగా జరిగేటట్లుగా బాధ్యత వహించేవారు ఆ శాఖ ముఖ్యశిక్షక్ కార్యవాహలు.
ఒక నిశ్చిత కార్యక్షేత్రంలోని శాఖలను కొన్నింటిని కలిపి మండల్ అని వ్యవహరిస్తారు. మండల్లో సంఘకార్యానికి బాధ్యత వహించేవ్యక్తి మండల్ కార్యవాహ కార్యవాహ పదం కార్యదర్శి అనే పదానికి సమానార్థకమైనది అనుకోవచ్చు. మూడు-నాల్గు మండలాలు కలిపి గ్రామీణ క్షేత్రంలో ఒక ఖండ ఏర్పడుతుంది. నగరీయ క్షేత్రంలో నైతే నగరం ఏర్పడుతుంది. ఖండలకు, నగరాలకూ కార్యవాహలు ఉంటారు. వారిని ఖండ కార్యవాహ, నగర కార్యవాహ అని వ్యవహరిస్తారు. ఆపైన జిల్లా కార్యవాహ విభాగ్ కార్యవాహ, ప్రాంత కార్యవాహ ఉంటారు.
(సంఘంలో ఇటీవల జరిగిన ఏర్పాటు ప్రకారం తెలంగాణ ఒక ప్రాంతం, క్రొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మరోప్రాంతం. (సౌకర్యం దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లాకు అనుకుని ఉన్న యానాం కూడా ఇందులో కలపబడి ఉంది). రెండవ ప్రవాహమైన ప్రచారకులు, ముూడవ ప్రవాహమైన సంఘచాలకుల ఏర్పాటు సాధారణంగా ఖండ, నగర స్థాయిలలో ఆరంభమై, పైస్థాయిలలో అనుభవజ్ఞులైన వారు ఆ బాధ్యతలు నెరవేరుస్తుంటారు. సంఘచాలకులు సమాజంలో పదిమందికీ తెలిసి పేరు ప్రతిష్ఠలు కల్గినవారై ఉంటారు. ఈ మొత్తం వ్యవస్థకు శిఖరస్థానంలో సర్-కార్యవాహ ఉంటారు. అతడు సాధారణంగా బాగా అనుభవజ్ఞుడైన ప్రచారక్ అయి ఉంటాడు. సర్ కార్యవాహను ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఎన్నుకుంటారు. సంఘనాత్మక వ్యవస్థలో సర్వోచ్చస్థానంలో సర్-సంఘచాలక్ ఉంటారు. పదవి అంగీకారమైన, గౌరవభాజనుడైన కార్యకర్తను సర్ సంఘచాలక్గా నియుక్తి చేస్తారు. ఆలా సర్ సంఘచాలక్ గా నియుక్తుడైన కార్యకర్త తన జీవితాంతం ఆ బాధ్యతలో ఉంటారు.
సంఘటనాత్మక వ్యవస్థ సక్రమంగా నడిచేటట్లుగా చూడడానికి కేంద్రస్థాయిలో అనేకమంది సదస్యులతో కూడిన రెండు వ్యవస్థలు ఉన్నవి. ఒకటి అఖిల భారతీయ ప్రతినిధి సభ. రెండవది - అఖిల భారతీయ కార్యకారీ మండల్. ఈ రెండూ సంవత్సరంలో ఒకసారి అనివార్యంగా సమావేశాలు నిర్వహిస్తాయి.
ప్రస్తుత కార్యస్థితి :
సంఘకార్య నిర్వహణకై యావత్తు భారతదేశం 30 ప్రాంతాలుగా వ్యవస్థీకరించబడింది. దేశంలో జరుగుతున్న శాఖల వివరాలు ఇలా ఉన్నవి: ( 2014 ప్రతినిధి సభల నాటి స్థితి)
- శాఖలు - 29,624
- ఉపశాఖలు - 44,982
- సాప్తాహిక మిలన్ (వారం వారం సమావేశాలు) - 10,146
- సంఘమండలి (నెలకొకసారి సంఘ అభిమానుల సమావేశం) - 7,387
ఇవిగాక 1,50,000 సేవాకార్యక్రమాలు కూడా స్వయంసేవకులద్వారా నిర్వహింపబడుతున్నవి.
ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రచారకుల సంఖ్య 314 మంది విస్తారకులతో సహా
మొత్తం 2465
సంఘకార్యం దేశవ్యాప్తంగా 797 జిల్లాలలో వ్యాపించి ఉంది. వీటిని 216 విభాగ్ లుగా వ్యవస్థీకరించటం జరిగింది. 4968 ఖండల (తాలూకాలు) లోనూ, 18,247 మండళ్ళలోనూ సంఘకార్యం జరుగుతూ ఉంది. మిగిలిన ఖండలకు, మండళ్ళకూ సంఘాన్ని విస్తరింప చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నవి.