: సమాజంలోని ఒకానొక విశిష్టస్థాయి సంఖ్య సంఘస్థానానికి రావాలి :
హిందూ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తీ ఎప్పుడో ఒకప్పుడు సంఘస్థాన్కి వస్తాడు అని అనుకోవటం అసంభవమైన విషయమేనన్న ఎరుక సంఘానికి ఉంది. కాగా ఎప్పుడైతే ఒక విశిష్టమైన సంఖ్యలో హిందూసమాజంలోని వ్యక్తులు సంఘస్థాన్కి వచ్చి సంస్కారాలు పొందుతారో, అప్పుడు వారి బలం ఆధారంగా, వారిపట్ల ఉన్న విశ్వాసంతో సమాజంలో మార్పు వస్తుంది.
సంఘస్థాన్ కి హాజరయ్యేవారి సంఖ్యకు తగిన అనుపాతంలోనే నిత్యసంసిద్ధశక్తి నిర్మాణమవుతుంది, దానికి తగిన అనుపాతంలోనే సమాజంపై దాని ప్రభావం ప్రసరిస్తుంది. ఎక్కడైనా సంఘస్థాన్ లో ఒక సార్వజనిక కార్యక్రమం జరుగుతూ ఉన్నపుడు, సంఘ వాతావరణం కారణంగా ఏర్పడే ప్రభావం మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇతరులు నిర్వహించే కార్యక్రమాలలో తమ ఇష్టానుసారంగా ఎక్కడబడితే అక్కడ నిలబడేవారు, కిళ్ళీ నములుతూనో, బీడీలు త్రాగుతూనో ఉండేవారు, తమకిష్టం ఉన్నంతసేపే ఉండి, ఎప్పుడు పోదలుచుకుంటే అప్పుడు దులుపుకొంటూ వెళ్ళిపోయేవారు, తమలోతాము మాట్లాడుకుంటూ ఉండేవారు, సభ ముగింపులో జాతీయగీతం పాడుతున్న సమయంలో లేచి నిలబడకుండా కూర్చొని ఉండేవారు, లేదా బయటకు నడుచుకొంటూ పోయేవారు- వారే సంఘకార్యక్రమాలలో నెలకొని ఉన్న వాతావరణం కారణంగా భిన్నమైన రీతిలో వ్యవహరిస్తారు.
సంఘస్థాన్'లో ఉన్న వాతావరణం వారికి కదలకుండా నిర్దేశితస్థానంలో కూర్చోవాలనీ, కార్యక్రమం పూర్తయ్యేవరకు ఉండాలనీ, ధ్వజారోహణం, ప్రార్థన. ధ్వజావతరణమూ జరిగే సమయాలలో కదలకుండా నిలబడి ఉండాలనీ నేర్పిస్తుంది. ఒక్కొక్కసారి సంఘకార్యక్రమం 3-4 గంటలపాటు సాగినా, ప్రజలు వ్యవస్థితంగా కూర్చొనే ఉంటారు. అయిపోయిన తర్వాత - 'కార్యక్రమం చాలాసేపు నడిచింది, సంఘకార్యక్రమం కాబట్టి కదలకుండా కూర్చొని ఉన్నాం'-అని చెప్పేవారు కనిపించుతారు. అదే బయట జరిగే కార్యక్రమాలలో అయితే, సామాన్యజనం లేచి బయటికి వెళ్ళిపోతారు. అంతేకాదు, జరుగుతున్న కార్యక్రమం తమకు నచ్చకపోతే కేకలు, ఈలలు వేయటంద్వారా అశాంతి కలుగజేస్తారు కూడా. పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులు వచ్చినపుడు కూడా -సంఘంలో లేచి నిలబడినట్లుగా ప్రజలు లేచి నిలబడరని-పాత అనుభవాలను గుర్తుచేసుకొంటూ అనేకమంది ప్రముఖ అధికారులు, నాయకులు సంఘకార్యక్రమాలను చూసిన తర్వాత స్పందించటం మన అనుభవంలో ఉన్న విషయమే. సంఘంలో కార్యక్రమాలను నడిపేతీరుపట్ల స్వయంసేవకుల వ్యవహారంపట్ల అన్ని వైపులనుండి గౌరవభావన ఉంది. ఈవిధంగా సమాజంలో పరివర్తన వస్తుంది.