శాఖ - స్వయంసేవక్ :
ఆర్.ఎస్.ఎస్. కార్యపద్ధతిలో ప్రతిచోటా నిర్వహింపబడే కార్యక్రమాన్ని శాఖ అంటారు. ఇందులో శాఖలోని వారందరూ ప్రతిరోజూ కలుస్తూ ఉంటారు. శాఖ కార్యక్రమాలలో శ్రద్ధగా పాల్గొనే వారందరినీ 'స్వయంసేవక్' అని వ్యవహరిస్తారు. తనకు రోజువారి పనుల ఒత్తిడి ఎంతగా ఉన్నా, ఆ పనుల మధ్యలోనే రోజుకు ఒక గంట సమయాన్ని కేటాయించుకొని స్వయంసేవక్ నిత్యమూ శాఖకు హాజరౌతూ ఉండాలని అపేక్షింపబడుతున్నది.
ప్రతిరోజూ ఒక నిశ్చిత సమయంలో (ఉదయం జరిగే శాఖలను ప్రభాత్ శాఖలని, సాయంకాలం జరిగే శాఖలను సాయం శాఖలనీ, చీకటిపడిన తర్వాత జరిగే శాఖలను రాత్రిశాఖలనీ వ్యవహరిస్తారు) ఒక నిశ్చిత స్థలంలో (సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే మైదానంలో) శాఖను నిర్వహిస్తారు. శాఖ నిర్వహించే స్థలాన్ని 'సంఘస్థాన్' అని వ్యవహరిస్తారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో అసాధారణమైన వేవీ ఉండవు. సమీపప్రాంతాల్లో నివసించే స్వయంసేవకులు నిశ్చిత సమయానికి చేరుతారు. భగవాధ్వజం (కాషాయ వర్ణంలో ఉండే జెండా) ను ఆరోహణ (ఎగురవేయటం) చేస్తారు. దానికి ప్రణామం చేసిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు ఆరంభమవుతాయి. కొన్ని ఆటలు, విపిధ రకాల శరీర వ్యాయామాలు గణల వారీగా గాని, సామూహికంగా గాని నిర్వహిస్తారు. ఆపైన అందరూ కలిసి ఒక దేశభ్తి గీతాన్ని పాడటం, సంస్కృతంలోనో తమ మాతృభాషలోనో ఉండే ఒక మంచి పద్యాన్ని వల్లెవేయటం, వాటికి అర్థం చెప్పుకోవటం, చరిత్రనుండి ఒక కథ చెప్పుకోవటం లేదా జాతిగురించి, సమాజం గురించి చర్చించటం, ప్రశ్నలు - జవాబులు వంటి కార్యక్రమాలు - కూర్చొని నిర్వహించుకుంటారు.
ఈ కార్యక్రమాలన్నీ ఆడుతూ పాడుతూ అలవోకగా జరిగిపోతాయి. అయితే అంతర్లీనంగా క్రమశిక్షణాయుతంగా అవి నిర్వహింపబడుతూ ఉంటాయి. ఆ తర్వాత అందరూ వరుసలలో నిలబడి మాతృభూమికి, పరమేశ్వరునికి నమస్కరిస్తూ ప్రార్ధన చెప్పటంతో, భగవాధ్వజాన్ని అవరోహణ చేయడంతో (దించివేయటం) ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది. కొద్ది నిమిషాలు ఒకరినొకరు పరిచయం చేసుకొంటూనో, కుశల ప్రశ్నలు వేసుకుంటూనో గడిపి, వారందరూ గృహెన్ముఖులవుతారు. రాష్ట్రకార్యంలో (జాతీయ కార్యంలో) పాల్గొనడానికి సంసిద్ధుడయ్యే స్వయంసేవక్ నుండి ఈ కార్యక్రమంలో రోజూ పాల్గొంటూ ఉండటం కనీసంగా అపేక్షించబడుతున్నది.
ఈ విధంగా ఆటలు ఆడుతూ, సర్వసామాన్యమైన విషయాలు చర్చిస్తూ స్వయం సేవకులు సంఘటనా పాఠాలను అభ్యసించుతారు. క్రమశిక్షణను, దేశభక్తిని అలవరచుకుంటారు. ఆదర్శ పౌరునిలో ఉండవలసిన సద్గుణాలు కూడా వారికి అలవడుతాయి. వ్యక్తికి గల మానసిక బౌద్ధిక క్షమతలు విశాలమవుతాయి. మాతృభూమిపట్ల ప్రేమాభిమానాలు, తోటి ప్రజానీకుతో కలసిమెలసి మెలగాలనే భావన, సోదరభావమూ వృద్ధి చెందుతాయి. యావత్తు జాతీయసమాజంలో తాను ఒక భాగమనే స్పృహ మేల్కొంటుంది. ఫలితంగా ఇతర స్వయంసేవకుల కుటుంబాలలో తటస్థపడే కష్టసుఖాలను తానుకూడా వారి కుటుంబసభ్యుడై పంచుకుంటాడు. ఇలా కొత్తవారితో కలసి సంచరించే వినూత్నమైన అనుభవాలలోనుండి తనదైన దేనినైనా దేశం కోసం సమర్పించే సంసిద్ధతను అలవరచుకుంటాడు. ఈ విధమైన పద్ధతులద్వారా అతడు తనలోని పూర్వపు లక్షణాలకు భిన్నంగా తనను తాను తీర్చిదిద్దుకొంటాడు. సమాజశ్రేయమే తన పరమ గమ్యంగా నిర్దేశించుకొని, సమాజం నుండి ఆదరాభిమానాలను పొందేవ్యక్తిగా మలచబడతాడు. సంఘంలో వ్యక్తులను నిర్మించే లేదా తీర్చిదిద్దే ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది.
స్వయంసేవకులలో సమానతాభావాన్ని, ఆత్మనిర్భరతను (తన కాళ్ళపై తాను నిలవటం - ఇతరులపై ఆధారపడకపోవటం) నేర్పటం కోసం ఎవరికివారుగా స్వయం ప్రేరణతో పనిచేయడానికి ప్రోత్సహించుతారు. సంఘంలో జరిగే శిబిరాలలోను శిక్షావర్గలలోనూ స్వయంసేవకులు వంట, వడ్డన వంటి పనులలో భాగస్వాములవుతారు. భోజనం చేసిన తర్వాత తమ కంచాలను తామే కడుక్కుంటారు. ఆ విధంగా స్వయంసేవకులు ఒక బృందంగా కలిసి పనిచేయటం నేర్చుకొంటారు. ఏ పనినుండి గాని తప్పించుకుని పారిపోవాలనుకోరు. ఒకపని గొప్పది, మరొకపని అల్పమైనది నీచమైనది - అనే భావనలు వారిలో ఉండవు. వారు సంపన్నులైనా, పేదవారైనా, సాధారణ వృత్తులు చేసికొనేవారైనా, పెద్ద ఉద్యోగాలలో ఉన్నవారైనా, స్వయంసేవకు లందరూ ఒకే పంక్తిలో కలసి కూర్చొని సామూహికంగా భోజనం చేస్తారు.
ఇటువంటివి ప్రతిరోజూ ఏ మాత్రం ఆర్భాటమూ, హడావుడీ లేకుండా జరిగిపోతుంటాయి. కులాలకు, హెచ్చుతగ్గు భేదభావాలకుూ సంఘంలో తావులేదు. సంఘంలోని ఈ అంశాన్ని స్వయంగా పరిశీలించి గ్రహించిన గాంధీజీ "ఏ పని చేయాలని నేను ఆరాటపడుతున్నానో ఆ పనిని సంఘం నిశ్శబ్దంగా చేసేసింది” అని ప్రశంసించారు. డా|॥భీమరావ్ అంబేద్కర్ కూడా ఈ విషయంలో ముగ్గులై సమాజంలోని భేదభావాలను తొలగించే మహత్కార్యాన్ని ఎప్పటికైనా సంఘమే చేయగల్గుతుందని తన విశ్వాసాన్ని ప్రకటించారు.
సమాజసేవా కార్యంలో స్వయంసేవకులు ఎప్పుడూ ముందుంటారు. వీరంతా సేవ చేయడానికే ఉన్నారు గదా అని వారిని తమ పార్టీ మహాసభలలో వాలెంటీర్లుగా వాడుకొందామని ఆలోచించిన నాయకులు లేకపోలేదు. అటువంటి వారందరికీ ఆశాభంగమే మిగిలేది. స్వయంసేవకులను వాలెంటీర్లుగా పంపించమని కోరిన వారందరికీ డా|| హెడ్గేవారు 'అవకాశం లేద'ని స్పష్టంగా చెప్పేవారు. ప్రారంభదినాలనుండి కూడా స్వయం సేవకులు చేసేపనికి గౌరవాన్ని ఆపాదించేయటం పట్ల డాక్టర్జీ శ్రద్ధ వహించేవారు.