అన్ని క్షేత్రాలనూ సరిదిద్దాలి :
సంఘం అన్ని క్షేత్రాలలోకి వ్యాపించగోరుతున్నది. మొదట్లో సంఘానికి ఇటువంటి ఆలోచన లేదని కొందరు చెప్పుతుంటారు. ఆ రంగంలోకి వెళ్లు, ఈ రంగంలోకి వెళ్లు రాజకీయరంగంలోకి వెళ్లు, కో-ఆపరేటివ్ సంస్థలను ప్రారంభించు, పాఠశాలలు, కళాశాలలూ స్థాపించు, అధ్యాపకుల రంగంలోను, ట్రేడ్ యూనియన్ రంగంలో పనిచెయ్యి- అని సంఘం ఇప్పుడే చెప్పుతున్నదని వారు అనుకొంటున్నారు. కాని సంఘానికి సంబంధించి డాక్టర్జీ ప్రారంభంనుండి ఈవిధమైన కల్పన ఉండినది. అప్పుడుకూడా సంఘం ఏమి చేయాలి. వ్యక్తులు ఏమిచేయాలి అనే విషయంలో స్పష్టమైన దృష్టి ఉంది.
సంఘం అన్నీ చేస్తుంది. సంఘం ఏమీ చేయదు-అన్నమాట చెప్పబడుతూ ఉండేది. సంఘం అన్నీ చేస్తుంది అన్నమాటకు అర్థం ఏమిటంటే-తగినంతగా శక్తిని మేల్కొల్పటంద్వారా సంఘం ఈ సంపూర్ణ సమాజంలో అవసరమైన మార్పు తీసికొనివస్తుంది. సంఘం ఏమీ చేయదు అనే మాటను తత్కాలీన పరిస్థితులనుబట్టి, మనకు ఉండే హద్దులు, పరిమితులనుబట్టీ చెప్పటం జరుగుతుంది. ప్రభావవంతమైన సంఘటనను నిర్మించకుండా, సమాజంలోని వివిధ రరగాలలో సంఘం చేయగలిగేది ఏమీ ఉండదు-ఈమాట చాలా స్పష్టంగా గ్రహించుకోవాలి. ప్రారంభదినాల్లో ఈకార్యాన్ని శాఖా కేంద్రితంగా జరిగేపనిగా చెప్పి ఉండకపోతే, ఆనాటి విదేశీ ప్రభుత్వం దీనిని నడవనిచ్చేది కాదు. పరిస్థితులనన్నింటినీ సాకల్యంగా బేరీజువేసుకున్న తర్వాతనే అన్ని రంగాలకూ దూరంగా ఉంటూ సంఘస్థాన్ కార్యకలాపాలపైనే దృష్టిని కేంద్రీకరించటం జరిగిందన్నది వాస్తవం. సంఘం కేంద్రంగా పనిచేయాలనే పట్టుదల ఆనాడు లేకుండినట్లయితే ఈనాడు సంఘం చూడడానికి మిగిలిఉండేదికాదు. సంఘం నిర్మాణం చేస్తున్న శక్తిని ఆరంభదశలోనే అణగద్రొక్కి ఉండేవారు.
అయితే సంఘం అన్ని రంగాలనూ సరిదిద్దవలసియున్నదని మనకు తెలియకపోలేదు. అందుకనే సంఘం అన్నీ చేస్తుంది-సంఘం ఏమీ చేయదు అని చెప్పటం జరిగింది. సంఘంగా ఏమీచేయవద్దు, అయితే సంఘ స్వయంసేవకులు వ్యక్తులుగా అన్ని పనులూ చేయవలసి ఉంటుంది అని వివరింపబడింది.