కార్యకర్త :
జాతీయకార్యం కొరకు ప్రతిరోజూ ఒక గంట సమయం ఇవ్వడానికి సిద్దపడటం స్వయంసేవకునినుండి కనీసంగా ఆశింపబడుతున్నది. అయితే దానితోనే పనంతా అయిపోతుందని అనుకోరాదు. క్రమక్రమంగా సంఘ సంస్కారాలతో ప్రభావితమై, అతని జీవనశైలిలో మార్పురావాలని ఆశింపబడుతున్నది. సమాజ సంఘటనా కార్యం ఎప్పటికప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన జరిగేది కాదు. భారతదేశం ఒక అజేయమైన శక్తిగా గౌరవప్రదంగా మనగలగాలంటే మనమందరమూ సంఘటితులమై వ్యవహరించే స్వభావాన్ని అలవరచుకోవాలి. సంఘం యావత్తు సమాజాన్ని సంఘటితం చేయగోరు తున్నదేగాని, సమాజంలో ఒక భాగానికో, ఒక మూలకో పరిమితమై ఉండే సంఘటననో సంస్థనో నిర్మించదలచటం లేదు.
మరి సంఘకార్యంవంటి విశిష్టమైన కార్యాన్ని జీవిత కార్యంగా తీసికొనకుండా, ఈ బృహత్కార్యం ఎలా సాధ్యమౌతుంది. సంఘం ఈనాడున్న స్థితికి విస్తరించగల్గినదంటే, తమ తమ వ్యక్తిగత బాధ్యతలు నిర్వహించుకొంటూనే, సంఘ కార్యానికి విశేష ప్రాధాన్యమిచ్చి, తమ శక్తినంతా వినియోగించి పనిచేసేందుకు సిద్ధమయ్యే కార్యకర్తలకు కొదవలేనందువల్లే అది సాధ్యమైంది. డాక్టర్ హెడ్డేవారు తన జీవితంలోని ప్రతిక్షణాన్ని దేశకార్యం కొరకు వినియోగించారు. ఆయన నుండి ఆశీస్సులను, శీలనిరాణ కౌశలాన్ని, అవిశ్రాంత కఠోర పరిశ్రమను పొందిన కార్యకర్తలు ఆయన మార్గాన్ని అనుసరించి నడుస్తున్నందున ఆయన స్వప్నాన్ని సాకారం చేసికొనే స్థితికి చేరువవుతున్నది. జాతీయ జీవనంలోని వివిధరంగాలలో ఈ సత్యం ద్యోతకమవుతున్నది.
సంఘకార్య వ్యవస్థలో వెన్నెముకగా నిలిచి కార్యభారాన్ని మోయటంలో కీలకపాత్ర వహిస్తున్న కార్యకర్తలను ప్రచారకులని వ్యవహరించటం జరుగుతున్నది. ప్రచారకులు తమ జీవితాన్ని రాష్ట్రకార్యం కోసం అంకితం చేసిన కార్యకర్తలు. వారు కుటుంబపరమైన బాధ్యతలకు దూరంగా ఉంటూ, సంఘంకోసమే తమ కార్యకలాపాలనన్నింటినీ సాగిస్తూ ఉంటారు. అందరికీ అర్ధమయ్యే వాడుక భాషలో కొందరు చెప్పేవిధంగా వారు ‘సన్యాసులు' కారు. అయితే, జాతీయకార్యానికి తాము పనిచేయటంలో అవరోధాలు, ఆటంకాలు లేకుండా, వారు వివాహబంధానికి దూరంగా ఉంటారు. తమదైన ప్రతి సామర్థ్యాన్ని ప్రతిభనూ, సర్వస్వాన్నీ వారు దేశానికి అంకితం చేసి పనిచేస్తుంటారు.
'ప్రచారక్' పదంలోని పైపై అర్థాన్నిబట్టి వారిని డబ్బా వాయించేవారుగా మనం పొరబడకూడదు. రాజకీయ నాయకుల మాదిరిగా బహిరంగసభల్లో ధాటిగా మాట్లాడుతూ, పత్రికల, టెలివిజన్ చానళ్ళ సౌజన్యంతో వెలిగిపోతూ ఉండాలని అనుకోవటం గాని, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రవచనాలు చేసే మహాత్ముల మాదిరిగా ఉపదేశాలు చేస్తూ ఉండటం గాని, వారి స్వభావంలో ఉండదు. సంఘంయొక్క ప్రచారకులు సమాజంపట్ల అనంతమైన ప్రేమ, అచంచలమైన విశ్వాసం ఉండి, తన తోటి ప్రజానీకంలో దేశభక్తి భావనలు ఉప్పొంగచేసే వ్యక్తి ప్రచారక్. జాతిహితంకొరకు పనిచేసేలా అతడు అందరిని ప్రేరేపించుతాడు. సంఘ వ్యవస్థలన్నీ దేశంయొక్క విశాల ప్రయోజనాలను సాధించేందుకు, పరిరక్షించేందుకు రూపొందింపబడినవే.
జీవితకాలం పనిచేయడానికి ముందుకు వచ్చే ప్రచారకులతోపాటుగా, కొన్ని వాస్తవానికి సంఘటనకర్తలు సంవత్సరాలు సంఘకార్యానికి వినియోగించాలనే నిర్ణయంతో వచ్చేవారూ ఉంటారు. వారు అలా పనిచేసే సమయంలో వారినీ ప్రచారకులనే వ్యవహరిస్తారు. ప్రచారకులుగా విరమించుకొన్న తరువాత సాధారణ కుటుంబ జీవితం గడుపుతూ కూడా వారు తగినంత సమయాన్ని సంఘకార్యం కొరకు కేటాయించి పనిచేస్తూ ఉంటారు. స్వయంసేవకులలో ప్రచారకులుగా వచ్చేవారి సంఖ్య పరిమితంగానే ఉంటుంది. అధిక సంఖ్యాకులు ప్రచారకులు కాకపోయినా, సంఘకార్యంపట్ల నిబద్దతలో వారేమీ తక్కువవారు కాదు. వారు కూడా తాము ఎంత ఎక్కువ సమయమీయగలరో, అంత సమయమిస్తూ, ఈ సంఘటనం ద్వారా దేశానికి, జాతికి తమవంతు సేవ చేస్తూ ఉంటారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క బలం ఎక్కడున్నదలటే - స్వయంసేవకుల స్వార్ధరహితమైన త్యాగభావనలో ఉంది. వారందరూ నిబద్ధతతో పనిచేస్తుంటారు. ఎవరితోనో మోమోటమి కారణంగానో, ఎవరినుండో మెప్పుపొందటం కోసమో పనిచేయటం వారిపద్దతి కాదు. అందువల్లనే, స్వార్థపరులైనవారు ఎన్ని పర్యాయాలు ఎన్నివిధాలుగా సంఘంపై దాడిచేసినా, దెబ్బతీయజూసినా, సంఘం నిరంతరంగా అభివృద్ధి చెందుతూనే ఉంది.