: సంఘస్థాన్ లో కనబడే నమూనా పెద్దది కావాలి :
ఏ దేశాల ప్రజానీకంలోనైతే జాతీయ చైతన్యం పొంగులువారుతూ ఉంటుందో ఆదేశాలలో ఏదైనా ఒక ఆలోచనను ముందుపెట్టినపుడు అందరూ దానిని స్వీకరించి, తమ సమాజంలో అవసరమైన పరివర్తనను సాధించుకున్నారు.
మరి మనదేశంలోనేమో సామాన్య మనుష్యుని స్థితి దీనికి భిన్నంగా ఉంది. కొలిమిలో ఉండగా కణకణమని మండుతూ ఉండిన నిప్పుకణికకూడా, దానిని కొలిమినుండి తీసి బైటపెట్టినట్లయితే, అది ఆరిపోతుందన్న ఉదాహరణద్వారా దానిని కొందరు వివరిస్తుంటారు. స్వయంసేవకుల విషయంలోనూ ఈవిధమైన అనుభవం కల్గుతూ ఉంటుంది. సమాజంలోని తగినంత సంఖ్యలో ఉన్న భాగాన్ని మనం సంఘస్థాన్ కి తీసికొనివచ్చి వారిపై ప్రభావవంతమైన సంస్కారాలు ముద్రిత మయ్యేటట్లుగా చూడాలి. అవి ఎంత బలంగా ఉండాలంటే-వారు పోయి బయటి సమాజాన్ని అంతటినీ ప్రభావితం చేయగల్గాలి. బయటనున్న ప్రజలు వారినుండి ప్రభావితులు కావటం లేదంటే, అది మన లోపమేనని గ్రహించుకోవాలి.
సంఘస్థాన్లో ఉన్న వాయుమండలం సమాజమంతటా వ్యాపించాలి. సంస్కారవంతులైన స్వయంసేవకులు పెద్ద సంఖ్యలో ఉన్నపుడు సమాజం ఈ సంస్కారాల ముద్రపడి ప్రభావితం కాకుండా ఎలా ఉండగల్గుతుంది? ఈ సంస్కారాలను పుణికి పుచ్చుకోవటం, తదనుగుణంగా పరివర్తనం చెందటంగాక, మరోమార్గం ఉండదు. కొన్ని పుస్తకాలు, పత్రికలు, కరపత్రాలు పంచినంతమాత్రాననో, అక్కడక్కడా ఉపన్యాసాలు ఏర్పాటుచేసినంత మాత్రాననో ఈ పని జరిగిపోదు. సంఘస్థాన్ లో రూపుదిద్దుకొంటున్న నమూనా ఎంతపెద్దదవుతుందో, తదనుగుణంగా సమాజం ఎంతగా సక్రియ మవుతుందో అంతగా ఈ భావాలను సమాజం గ్రహిస్తుంది.