సీతామాత ! |
: భారతీయ మహిళాదర్శం :
రామాయణం భారతీయుల ప్రాచీన ఇతిహాసం, గొప్ప ఇతిహాసం సీతారాములు భారతీయులకు ఆదర్శప్రాయులు. పిల్లలందరూ, ముఖ్యంగా బాలికలు సీతను ఆరాధిస్తారు. పవిత్రురాలు, భక్తురాలు, సహనశీలి అయిన సీతను పోలి ఉండటంకంటే భారతీయ మహిళ కోరదగ్గ ఉన్నతి మరొకటి లేదు. ఈ పాత్రను పరిశీలించినప్పుడు, పాశ్చాత్యుల ఆదర్శంకంటె భారతీయుల ఆదర్శం ఎలా వేరైనదో మీకు స్పష్టమౌతుంది.
జాతి యొక్క సహనానికి సీత ఆదర్శమైవుంది. “చేతల్లో శక్తి చూపించండి” అంటారు పాశ్చాత్యులు. “సహనంలో మీ శక్తిని చూపించండి” అంటారు. భారతీయులు. ఒక వ్యక్తి ఎంత సంపద గడించవచ్చు అనే సమస్యను పరిష్కరించినవారు పాశ్చాత్యులు. ఒక వ్యక్తి సంపదను ఎంతగా త్యాగం చెయ్యగలడు అనే సమస్యను పరిష్కరించినవారు భారతీయులు. చూశారా రెండు పరమావధులు. ఆదర్శ భారత నారికి సీత ఉత్తమ ఉదాహరణ. సీత అనే స్త్రీ నిజంగా ఒకప్పుడుండేదా, ఆమె కథ నిజమా, కాదా అనే ప్రశ్నలు మనకొద్దు. సీత అనే ఆదర్శం ఉందని మనం ఎరుగుదుం. సీతాదర్శం మాదిరి దేశవ్యాప్తంగా జాతీయ జీవనంలోకి అంత గాఢంగా చొచ్చుకొనిపోయి భారతీయుల ప్రతి రక్తకణంలోను కలిసిపోయిన పౌరాణికగాథ మరొకటి లేదు. మంచికిగాని, పవిత్రతకుగాని, పాతివ్రత్యానికిగాని, భారతీయ మహిళాధర్మానికిగాని సీత పెట్టింది పేరు. పురోహితుడు ఒక స్త్రీని ఆశీర్వదించేటప్పుడు సీతవలె ఉండమనే ఆశీర్వదిస్తాడు.
ఒక శిశువును దీవించేటప్పుడు సైతం అతడు సీతలా ఉండమనే అంటాడు. వారంతా సీతమ్మ పిల్లలు. సీతమ్మగా అవటానికి ప్రయత్నిస్తున్నారు. సీతామాత సాక్షాత్తు భూమాత, క్షమాశీలి. విశ్వాసపూర్ణ, పరమసాధ్వి. దుర్భర కష్టాలు అనుభవించే సమయంలో కూడా ఆమె నోటి వెంట రాముణ్ణి గురించి ఒక్క కటువైన మాటకూడా వెలువడలేదు. అంతా తన విధిగా భావించి, తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. ఆమెను అరణ్యంలో వదలివెయ్యటం ఎంత ఘోరమైన అన్యాయమో ఆలోచించండి. కాని ఆమెలో ఏమాత్రం పరుషత లేదు.
లోకంలో ఇప్పటికున్న వాఙ్మయాన్ని అంతటినీ, ఇకముందు ఏర్పడబోయే వాఙ్మయాన్ని అంతటినీ గాలించినా మీకు సీతకు సాటి మహిళ కానరాదు. సీత అద్వితీయురాలు, అలాంటి శీలం ఒక్కసారి సీతగా మూర్తీభవించింది. నాటికీ, నేటికీ, ఆమే ఆదర్శమహిళ. రాముడిలాంటి పురుషులు పలువురు ఉండవచ్చునేమోగాని సీతవంటి మహిళ లేనేలేదు. పవిత్రమైన భారతీయ మహిళకు ఆమే సరైన లక్ష్యం. ఉత్తమ భారతీయ మహిళా ధర్మాలన్నీ ఆ సీతాదేవి జీవితచరిత్ర నుండే ఏర్పడ్డాయి. వేలకొద్ది సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఈ ఆర్యావర్తమంతటా పురుషులచేత మహిళల చేత, శిశువులచేత ఆమె ఆరాధించబడుతోంది. పవిత్రతకన్న పవిత్రురాలు, క్షమానిధీ అయిన ఈ సీత ఇలాగే ఎల్లప్పుడూ ఉంటుంది. విసుగు గొణుగు లేక అన్ని ఇక్కట్లూ అనుభవించినదీ, అవిచ్ఛిన్న పాతివ్రత్య పవిత్రతలుగల సాధ్వీ, మానవులకూ దేవతలకూ సైతం ఆదర్శ మహిళ మా దేశ దేవత, మహానుభావురాలూ అయిన సీత శాశ్వతంగా ఉండాలి
మా దేశంలో అందరం సీతను చక్కగా ఎరుగుదుం. కాబట్టి ఆమెను వర్ణించటం అక్కడ అనవసరం. మా పురాణాలన్నీ మాయమై పోయినా మా వేదాలు సైతం పోయినా, మా సంస్కృత భాష పునరావృత్తి లేక అంతరించినా. ఐదుగురు భారతీయులైనా జీవించి ఉంటే, వారు అతి పురాతన గ్రామీణ భాషతెలిసినవారైనప్పటికీ వారు సీతచరిత్రను అనుసంధిస్తూనే ఉంటారు. నా మాటలను మెలకువతో గుర్తించండి. మా జాతి ఆయువుపట్టులోకి చొచ్చుకుపోయింది సీత. భారతీయుల్లో ప్రతి పురుషుని, ప్రతి స్త్రీ రక్తంలో సీత ఉంది. మేమంతా సీత బిడ్డలం. స్త్రీలను సీతాదర్మానికి దూరమై నవ్యపద్ధతులకు తెచ్చే ప్రయత్నంలో వారు ఆ సీతాదర్శనానికి దూరమై పోవలసివస్తే, ఆ ప్రయత్నం వెంటనే భంగపడుతుందని అనటం మేము ప్రతిరోజు చూస్తున్నాం. భారతీయ మహిళలు పెంపొందటానికి, శ్రేయస్సు గాంచటానికి సీతామార్గాన్ని ఒక్కదాన్నే అనుసరించాలి, వేరే మార్గం లేదు.