విశ్వహిందూ పరిషత్ (వి.హెచ్.పి) నూతన జాతీయ అధ్యక్షుడిగా బీహార్ కు చెందిన ప్రముఖ ఎముకల వైద్యులు డాక్టర్ పద్మశ్రీ రవీంద్ర నారాయణ్ సింగ్ గారు ఎన్నికయ్యారు. హర్యానా రాష్ట్రంలోని ఫరిదాబాద్‌లో రెండు రోజుల పాటు జరుగుతున్న వి.హెచ్.పి జాతీయ సమావేశాల్లో ఆయనను నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.
అంధ విద్యార్థులకు ఉచిత పాఠశాలలు, పేదలకు వైద్యాలయాలు, నిరుపేద విద్యార్థులు చదువుకునేందుకు అనేక రకాల సహకారాలు అందిస్తూ.. ప్రత్యక్షంగా అనేక సేవా కార్యక్రమాలల్లో రవీంద్ర నారాయణ్ సింగ్ గారు పాల్గొంటూ నిర్వహిస్తున్నారు. ఎముకల వైద్యంలో నిష్ణాతులైన వీరి వద్దకు వైద్యం కోసం బీహార్ రాష్ట్రం నుండి మాత్రమే కాక జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వస్తారు. వీరు గతంలో విశ్వహిందూ పరిషత్ దక్షిణ బీహార్ అధ్యక్షులుగా, కేంద్రీయ ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు.
అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీ మిలింద్ పరాండే గారు విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ మహామంత్రిగా ఎన్నికయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న వి.హెచ్.పి నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నారు. మతమార్పిళ్లు, దేవాలయాల రక్షణ, పశ్చిమ బెంగాల్ లో హిందువుల పై జరిగిన దాడులు వంటి అంశాలతో పాటు కోవిడ్-19 మూడో దశకు సంబంధించి వి.హెచ్.పి ఆధ్వర్యంలో చేపట్టనున్న ముందస్తు సేవా కార్యక్రమాల గురించి సమావేశంలో చర్చించనున్నారు.
__విశ్వ సంవాద కేంద్రము