కార్మికరంగంలో వెర్రి జెండాలు వికటాట్టహాసం చేస్తూ విర్రవీగుతున్న వేళ, పనికిమాలిన పాశ్చాత్య సిద్ధాంతాలు పట్టాభిషేకం చేసుకుని ప్రగల్భిస్తున్న వేళ, అవకాశవాదం, నయవంచన, నక్కజిత్తులే నాయకత్వంగా చెలామణీ అవుతున్న వేళ, కష్టజీవులైన కార్మికుల శ్రేయస్సే పరమావధిగా, బాధ్యతతో కూడిన వాక్కుల పోరాటాలే మార్గంగా, జాతీయవాదమే ఊపిరిగా పనిచేస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్ సంస్థాపకులు దత్తోంత్ ఠేంగ్డీజీ శతజయంతి సంవత్సరం ఇది.
మొక్కలోని సత్తాను చూసి విత్తులోని సత్తువెంతో చెప్పేయవచ్చు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆదర్శమయ పురోగతిని చూసి దాని సంస్థాపకులు దత్తోపంత్‌జీ ఎలాంటి వారో చెప్పేయవచ్చు. ఆయన ప్రేరణతో తయారైన వేలాదిమంది కార్యకర్తల ఆదర్శవాదాన్ని చూసి దత్తోపంత్‌జీ ఎలాంటివారో చెప్పేయవచ్చు. నిజానికి ఆదర్శానికి ఆకృతినిస్తే ఎలా ఉంటుందో దత్తోపంత్‌జీ జీవితం అలా ఉంటుంది. ఆయన జీవితమంతా కార్మిక, కర్షక సంక్షేమానికై తపించారు. స్వదేశీ భావననే ధ్యానించి తరించారు. ఆదర్శవాదం, జాతీయభావం నిండిన కార్మిక నేతృత్వం కోసమే ఆయన శ్వాసించారు.
కొందరు గొప్ప నాయకులవుతారు. కొందరు గొప్ప సిద్ధాంతకర్తలవుతారు. ఇంకొందరు మంచి వక్తలవుతారు. కొందరు రచయితలవుతారు. మరికొందరు గొప్ప వ్యూహకర్తలవుతారు. కొందరు విశ్లేషకులవుతారు. కొందరు మంచి స్నేహితు లవుతారు. కొందరు చక్కటి గురువులవుతారు. కానీ దత్తోపంత్ ఠేంగ్డీజీ ఈ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న మహానేత. ఇన్ని లక్షణాలున్న అసామాన్యుడు అతి సామాన్యుడిలా కనిపించడం అసాధ్యం. కానీ ఠేంగ్డీజీ అత్యంత సామాన్యంగా ఉండేవారు. అందినట్టే ఉన్నా ఆయన అందనంత ఎత్తుకెదిగినారు. అందనంత ఎత్తున ఉన్నా ఆయన అందరివారు. మన తోటివారు.. మనందరివారుగా ఉంటూనే మనందరికీ మార్గదర్శకుడిగా నిలిచారు. గుండెలోతుల్లోంచి పొంగుకొచ్చే ప్రేమతో ఆయన ఎందరి జీవితాలకో బాటలు వేశారు. తన మృదు ఆప్యాయ స్పర్శతో లక్షలాది జీవితాలను మార్చేశారు. ఆయన మనల్ని వీడిపోయి పదిహేనేళ్లవుతున్నా ఆయన ఆలోచనా విధానం నానాటికీ బలోపేతమవుతోందే తప్ప బలహీనపడటం లేదు. ఆయన బాటలో పయనించేం దుకు నడుం కట్టేవారి సంఖ్య పెరుగుతోందే తప్ప, తగ్గడం లేదు.
జాతీయవాద కార్మిక సంఘం – బి.ఎం.ఎస్. :
ఆ రోజుల్లో కార్మిక సంఘాలంటే కమ్యూనిస్టు సంఘాలే. కమ్యూనిస్టుల వితండవాదం, విశృంఖల వాదాన్ని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, ఈ దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, ఇక్కడి సమస్యలకు ఇక్కడి పరిష్కారాలనే ముందుంచాలన్న జాతయవాద దృక్పథంలో ఆయన అత్యంత క్లిష్టపరిస్థితుల్లో బిఎంఎస్‌ను ముందుకు నడిపించారు. అందరూ ‘‘హమారీ మాంగే పూరీ హో… చాహే జో… మజ్‌బూరీహో’’ (మీ నష్టాలతో మాకు పనిలేదు, మా డిమాండ్లను అంగీకరించాల్సిందే) అన్న మొండి ధోరణికి భిన్నంగా ‘‘దేశ్ కే హిత్ మే కరేంగే కామ్, కామ్ కా లేంగే పూరా దామ్ (దేశం కోసం పనిచేస్తాం, పనికి వేతనం తప్పక పొందుతాం) వంటి నినాదాన్ని ముందుకు తెచ్చారు. చీలిక పేలికలై, ముక్క ముక్కలైన వితండ విదేశీవాద కార్మిక సంఘాల ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ వంటి శుష్క నినాదాలకు భిన్నంగా ఆయన ‘దేశభక్తి కార్మికులారా ప్రపంచాన్ని ఏకం చేయండి’ వంటి సార్థక నినాదాన్ని ఇచ్చారు. చీ••ఱశీఅ•శ్రీఱవ •ష్ట్రవ ••శీబతీ, ••శీబతీఱవ •ష్ట్రవ ×అ•బ•తీ•, ×అ•బ•తీఱ•శ్రీఱవ •ష్ట్రవ చీ••ఱశీఅ వంటి అద్భుతమైన నినాదాన్ని ముందుకు తెచ్చారు. వామపక్ష సంస్థల ప్రభావంలో మే డే వంటి విదేశీ కార్మిక దినాలకు బదులుగా ఆయన ‘విశ్వకర్మ’ దివస్‌ను నిర్వహించేలా చేశారు.
అన్నిటికన్నా ప్రధానమైన విషయం ఏమిటంటే కార్మిక సంఘాల నేతలుగా కార్మికులే ఉండాలని, రాజకీయ నాయకులు ఉండకూడదని ఆయన ప్రతిపాదించారు. ఆచరించారు. కార్మికసంఘాలు రాజకీయ పార్టీలకు తోకలుగా ఉండకూడదని ఆయన నమ్మేవారు. అందుకే బి.ఎం.ఎస్‌ను ఏ రాజకీయ సంస్థకూ తోకలా మార్చేయలేదు. ఇలా అత్యంత విలక్షణమైన కార్మికసంస్థగా ఆయన భారతీయ మజ్దూర్ సంఘను రూపొందించారు. ఆయన సరైన లక్ష్యసాధనతోపాటు ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు సరైన మార్గం ఉండి తీరాలని వాదించేవారు. ఆయన ప్రేరణతో పనిచేసే వేలాదిమంది కార్మికులు ఈనాడు నిరంతరం కృషిచేస్తున్నారు. వందేళ్లు దాటినా నూరేళ్లు నిండని వ్యక్తిత్వం ఆయనది. ఆయన ఆకృతి లేకున్నా.. ఆయన ఆదర్శం మనతోటే ఉంది. ఠేంగ్డేజీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..
ఆప్యాయతకు ఆయన మారుపేరు….ఆత్మీయతకు ఆయన మరో పేరు…ఆయన హృదయం పూవంత మెత్తని….ఆయన ఆలోచన ఆకాశమంత ఎత్తున….దేశాభివృద్ధి కోసం వివిధ సంస్థల ఏర్పాటు..
మహా దార్శనికుడు :
ఆయన పార్లమెంటు సభ్యులుగా పలు దేశాలలో పర్యటించిన భారత ప్రతినిధి మండలిలో సభ్యులుగా ఉన్నారు. కార్మికనేతగా చైనా, బంగ్లాదేశ్ సహా పలు దేశాల్లో పర్యటించారు. సంఘ సైద్ధాంతిక భూమికను చిత్రిక పట్టేలా వేలాది ప్రసంగాలు చేశారు. పుస్తకాలను రచించారు. ది థర్డ్ వే, మోడర్నైజేషన్ వెస్టర్నైజేషన్, ది పర్‌స్పెక్టివ్, సంకేత రేఖ వంటి అనేక గ్రంథాలు ఆయన కలం నుంచి జాలువారాయి. ‘ది హిందూ ఎకనామిక్స్’ వంటి సుప్రసిద్ధ సిద్ధాంతవాద గ్రంథానికి ఆయన సుదీర్ఘమైన ముందుమాట వ్రాశారు. ఒక దార్శనికుడిగా ఆయన 1987లోనే 2000వ సంవత్సరపు తొలి సూర్యకిరణాలు నేలను తాకే నాటికి ప్రపంచంలో నుంచి కమ్యూనిజం అంతమైపోతుందని భవిష్యవాణిని చెప్పారు. అలాగే క్యేపిటలిజం కూడా తనలోని అంతర్విరోధాల వల్ల పతనమౌతుందని ఆయన చెప్పారు. ఆ మాటలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. భారతీయ జీవన విధానం నుంచి పుట్టిన స్వదేశీ ఆర్థిక విధానమే ప్రపంచానికి మూడవ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడిప్పుడే ఈ దిశగా ప్రపంచం ముందడుగు వేస్తోంది.
తుది దశ వరకూ దేశ సంక్షేమం, కార్మికుల అభివృద్ధి, జాతీయవాదం పురోగతి కోసం అహరహం శ్రమించిన చివరి వరకూ దేశం కోసమే ఆయన పనిచేశారు. ఇలాంటి విలక్షణ వ్యక్తి దత్తోపంత్ ఠేంగ్డీని భారతీయ మజ్దూర్ సంఘ్, తదితర జాతీయ సంస్థలు, సమస్త కార్మిక రంగం కృతజ్ఞతా భావంతో స్మరించుకుంటోంది. ఆయన శతజయంతిని ఆయన ఆలోచనా విధానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, జాతీయవాద కార్మికోద్యమ విజయాన్ని సాధించేందుకు కృషి చేయడానికి ఉయోగించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. మనలో ఒకరిగా ఉంటూనే, మనల్ని ప్రభావితం చేసిన ఆ మహానేతకి మనసారా నమస్సులు చెప్పుకుందాం.
రండి… దత్తోపంత్‌జీని స్మరించుకుందాంరండి… ఆయన ఆశయాలను సాధిద్దాం.రండి… ఆయన చూపిన బాటలో పయనిద్దాం.
– రాకా సుధాకర్ : సీనియర్ పాత్రికేయులు, భాగ్యనగర్