‘సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం – అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం!!’
భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో మేరునగధీరుడు. సనాతన వైదిక ధర్మానికి విఘాతం కలుగుతున్న సమయంలో జగత్తును జాగృత పరిచేందుకు సదాశివుడి కరుణాకటాక్షాలతో ఆవిర్భవించిన చైతన్యదీప్తి. (భువిని పునీతం చేసిన మహనీయుడు.) జగత్తును ఏకతాటిపై నడిపి మార్గదర్శనం చేసిన జగద్గురువు ఆదిశంకరాచార్య. జీవించింది కేవలం 32 సంవత్సరాలే అయినా యుగయుగాలకు తరగనంతటి ఆధ్యాత్మిక సంపదను ప్రోది చేశారు.ఈ ఏకాత్మ భావనా సిద్ధాంతం (అద్వైతం) ఆయన ప్రతిపాదించిన అనర్ఘ సూత్రరత్నం. జీవాత్మ, పరమాత్మ వేర్వేరుగా అనిపిస్తున్నా, నిజానికి అవి ఒకటే అన్నది అద్వైత సిద్ధాంతం.
పరమాత్మ తనలోనే ఉన్నాడనే ఎరుక కలిగి ఉండాలని, పరమాత్మను సర్వవ్యాపితంగా దర్శించా లన్నదే దీని మౌలిక ఉద్దేశంగా చెబుతారు. అజ్ఞానం, జంతుబలులు లాంటి వామాచారాలు ప్రబలిన తరుణంలో అద్వైతమతాన్ని శంకరులు నెలకొల్పారు. ‘అహం బ్రహ్మాస్మి’ అని మనిషిలో పరమాత్మ ఉనికిని చాటారు. దేహం అశాశ్వతమైనా ఆత్మ నశించే వస్తువు కాదని బోధించారు. మోక్ష మార్గాలలో జ్ఞానం అత్యంత ఉత్తమం, పవిత్రమని, జ్ఞానం ద్వారా పొందిన మోక్షం అక్షయమని ప్రబోధించారు.
వైదిక మతానికి తాత్విక భూమికను అందించడం, వైదిక మతంలో చోటు చేసుకున్న విపరీత తాంత్రిక పూజావిధానాల స్థానంలో సాత్విక పూజా విధానం ప్రవేశపెట్టడం అనే ప్రధాన కార్యాలను నిర్వర్తించారు. మతం పేరిట జరుగుతున్న ఉపాసనలు, జంతు బలులు, మూఢ విశ్వాసాలు, కర్మకాండలను వ్యతిరే కించారు. ‘కర్మకాండ కంటే ఆత్మవిచారణే ప్రధానం. వేదాలే సార్వకాలిక ప్రమాణాలు. వాటిని అనుసరించే బ్రహ్మమే సత్యం. బ్రహ్మకు జీవుడికి అభేదం. జగత్తు మిథ్య. అలా అని ప్రపంచం లేదని కాదు. మసక చీకటిలో తాడును పాముగా భ్రమించినట్లే మిథ్యా జగత్తులో ఉన్నంతసేపు మాయ కమ్మిన జీవుడు దీనిని యథార్ధమని భ్రమిస్తున్నాడు. కలలో కలిగే అనుభవం, ఎండమావిలో నీటి బుడగలా.. నిరంతరం మార్పు చెందేది’ అని శ్రీశంకర వేదంగా చెబుతారు.
అయితే విగ్రహారాధనను సమర్థించారు. అథమ స్థాయిలోని వారిని ఉన్నతమైన ఆధ్యాత్మికమార్గంలో నడిపించేందుకు విగ్రహారాధన అవసరమని భావించి, బోధించారు. వైష్ణవ, స్మార్త, సౌర, శాక్తేయ, గాణాపత్య, శైవమతాలను అవగాహన చేసుకొని ఆయా మతాచారాలు, విధానాలను సంస్కరించి షణ్మత స్థాపకులయ్యారు.
కేరళలోని కాలడిలో శివగురువు, ఆర్యాంబ దంపతులు వరపుత్రుడు శంకరులు. వైశాఖ శుక్ల పంచమి కర్కాటకరాశిలో పునర్వసు నక్షత్రంలో జన్మించారు. సంతానం కోసం శివగురువు దంపతులు భక్తితో సేవించడాన్ని మెచ్చిన వృషాచలేశ్వరుడు ‘పుత్రుడుగా పూర్ణాయుష్కులైన సామాన్యుడు కావాలా? లేక అల్పాయుష్కుడైన మహాజ్ఞాని కావాలా?’ అని ప్రశ్నించగా, ‘స్వల్పా యుష్కుడైనా వివేకం, సర్వజ్ఞుడైన కుమారుడిని ప్రసాదించు’ అని వేడుకున్నాడు. శివయ్య కంటే సర్వజ్ఞుడు ఎవరు? ఆయనే పదహారేళ్ల ఆయువుతో ఆర్యాంబ దంపతుల పంటగా ఉదయించారు. అయినా వ్యాసభగవానుడి ఆశీస్సులతో జగదోద్ధారణకు రెట్టింపు ఆయుష్షును పొందారు.
గురువులకే గురువు :
శంకరుడికి మూడేళ్ల వయసు నాటికి దేశభాషలు, ఐదేళ్ల ప్రాయం నాటికి సంస్కృతం, ఎనిమిదేళ్ల వయసుకే తర్క, వేదాంత, మీమాంసలతో సహా సకల శాస్త్రాలూ కంఠోపాఠం అయ్యాయి. వేదాధ్యయనం అనంతరం ఓంకారేశ్వర్‌కు చేరి గౌడపాదుల శిష్యుడు గోవిందాచార్యుల వారి శిష్యరికంలో సకల శాస్త్రాలు అభ్యసించారు. ఈశ్వరావతారమైన వారికి వేరే గురువు అవసరంలేకపోయినా లోకధర్మాన్ని పాటించారు. శ్రీరామశ్రీకృష్ణులకు గురువు ఉన్నట్లే తనకు గురువు అవసరమని భావించారు. లోకంలో గురు సంప్రదాయాన్ని మరింత పటిష్ట పరిచేందుకు అలా చేశారు. గురువు సమక్షంలో సన్యసించారు.
మాతృభక్తి పరాయణుడు :
వృద్ధాప్యంలోని మాతృమూర్తి సుదూరంలోని నదికి స్నానానికి వెళ్లడం పట్ల కలత చెంది ‘గంగాస్తవం’ చేయగా, ప్రసన్నరాలైన నదీమతల్లి శంకరుని నివాసం వైపునకు తన గమనం మార్చుకుంది. దీనిని ఆయన మాతృభక్తి దివ్యశక్తికి నిదర్శనంగా చెబుతారు. తనకు వివాహం జరిపించాలన్న తల్లి కోరికను మృదువుగా తిరస్కరించి లోకోద్ధరణకు సన్యాసదీక్ష పట్ల గల ఆసక్తిని వ్యక్తీకరించారు. దేశాటనకు సిద్ధమవుతూ, తల్లి అవసానకాలంలో ముందుండి సర్వకర్మలను నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. తల్లి దేహత్యాగంతో అంతిమ సంస్కారాలకు ప్రయత్నించగా, సన్యాసికి కర్మాధికారం లేదంటూ బంధువులు, ఇతరులు ఆ తంతును అడ్డగించి, అవాంతరం కల్పించారు. అయినా శంకరుడు వెనుదీయక యోగాగ్నితో మాతృమూర్తికి అంతిమ సంస్కారం, సమంత్రకంగా ఉత్తరక్రియలు నిర్వహించారు. ‘న• మాతుః పరం దైవతమ్’.. తల్లిని మించిన దైవం లేరన్న శాస్త్ర వాక్యానుసారం లోకాన్ని ఎదిరించి మాతృఋణం తీర్చుకున్న ధన్యుడు శంకరాచార్యులు. కాగా, సాక్షాత్తు సదాశివాంశసంభూతైన కుమారుడితో అంతిమ సంస్కారం జరిపించుకున్న భాగ్యవతి ఆర్యాంబ. శంకరులు యతిదీక్షను ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం చెబుతారు. చతుర్విధ ఆశ్రమాలలో దేశ భ్రమణానికి సన్యాసమే అనుకూలం. ఇతర మూడు ఆశ్రమాలు బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం కంటే సన్యాసాశ్రమం భిన్నమైంది. లోకపర్యటన చేయడమే వేదాంతోపదేశానికి అత్యున్నత సాధనమని శంకరులు దీనిని ఎంచుకున్నారు.
వ్యాససాంగత్యం :
ఆదిశంకరులను పరీక్షించేందుకు వృద్ధబ్రాహ్మణ వేషంలో వచ్చిన వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రంపై సందేహం వెలిబుచ్చగా, దానికి సంతృప్తికరంగా బదులిచ్చారట. ‘నా అభిప్రాయాలను ఎరిగి ఇంత చక్కగా విశదీకరించడం నీకే సాధ్యం. నీ భాష్యం నా మూలానికి వన్నె చేకూరుస్తుంది. నా బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయగలిగిన సమర్థుడవు నీవు తప్ప మరొకరు లేరు. నీ భాష్యం అద్వితీయం. లోకంలో దీనికి సాటి మరొకటి ఉండబోదు. లోకోద్ధారణకు కారణజన్ముడవైన నీవు నీ కర్తవ్య నిర్వహణకు మరో పదహారేళ్లు ఆయుర్దాయం ప్రసాదిస్తున్నాను’ అని ఆశీర్వదించారు. శంకరులు శివాంశులు, వ్యాసులు నారాయణాంశజులు. అద్వైత మత ప్రచారం చేయాలన్న గురువు ఆనతి, వ్యాసాజ్ఞ, మునుల ఆదేశాన్ని అనుసరించి అందులో భాగంగానే ఆసేతుశీతాచల పర్యంతం అనేకసార్లు పర్యటించి దేశం నలుమూలలా పీఠాలు నెలకొల్పారు. ఉత్తరాదిన బదరీనాథ్‌లో జ్యోతిర్మఠం, తూర్పున పూరీలో గోవర్దన మఠం, పశ్చిమాన ద్వారకా మఠం, దక్షిణాదిన తుంగభద్రానదీతీరంలో శృంగేరి మఠాన్ని స్థాపించారు.
కైలాసగిరి నుంచి తెచ్చిన పంచలింగాలలో శృంగేరిలో భోగలింగాన్ని, చిదంబరంలో మోక్షలింగం, నేపాల్‌లో వరలింగం, కేదార్‌లో ముక్తిలింగం, కంచిలో యోగలింగాన్ని ప్రతిష్టించారు. కాశీలో పాదుకాపీఠం లేదా సుమేరు స్థాపించారని చెబుతారు. సమైక్యతను, సునిశితత్వాన్ని ప్రదర్శిస్తూ, పీఠాలలో అర్చనాదులకు స్థానికులను కాకుండా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిని నియమించారు. నేపాల్‌లో కర్ణాటక ప్రాంతంవారిని, బదరీనాథ్‌లో నంబూద్రి బ్రాహ్మణులను నియమించడం అందుకు ఉదాహరణ.
ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మున్నగు ఉద్గ్రంథాలకు మహా భాష్యాలతో పాటు సామాన్యుల కోసం సులభశైలిలో శ్లోకాలు, స్త్తోత్రాదులు రాశారు. నేడు భక్తకోటి స్తుతిస్తున్న స్తోత్రాలలో అనేకం ఆయన గళం నుంచి వెలువడినవే. కనకధారాస్తోత్రం, సౌందర్యలహరి, శివానందలహరి, మహిషాసుర మర్దనీ స్త్త్తోత్రం లాంటివి ఆయనపెట్టిన ఆధ్యాత్మిక భిక్షే. గురుకుల విద్యా సమయంలో భిక్షకు వెళ్లిన ఆయనకు ఒక బ్రాహ్మణదంపతులు ఎండిన ఉసిరి కాయను సమర్పించి తమ దీనస్థితిని చెప్పకచెప్పారు. దానికి కలత చెందిన ఆయన శ్రీమహాలక్ష్మిని స్తుతించి ప్రసన్నం చేసుకొని వారి దారిద్య్రదుఃఖాన్ని తొలగించారు. అదే ‘శ్రీ కనకధారాస్తోత్రమ్’. అమ్మవారు కేవలం ఐశ్వర్య ప్రదాత కాదని, జ్ఞానం, సౌందర్యం, శక్తి సర్వాభీష్టాలు ప్రసాదించే వరప్రదాయని అని కీర్తించారు. శంకరుల ఏకసంథాగ్రాహీత్వానికి ఒక ఉదాహరణ. శిష్యుడు పద్మపాదుడు రచించిన సూత్రభాష్య వార్తికం ఆయన గ్రామాంతర సమయంలో గృహకల్లోలం కారణంగా కనిపించకుండా పోయింది. తిరిగి రాయాలని ప్రయత్నించినా పూర్వభావం జ్ఞప్తికిరాక అసక్తత వ్యక్తపరిచారు. శృంగేరి పీఠంలో ఒకసారి దానిని విన్న శంకరులు ‘నేను చెబుతాను…రాసుకో’ అంటూ ఏకరువు పెట్టారట. ఆ మహనీయుని స్ఫూర్తితో నడిచే దేవుడిగా మన్ననలు అందుకున్న కంచిపరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వరకు ఎందరో మహాపురుషులు సుదీర్ఘ పాదయాత్ర చేసి, వేద సమ్మేళనాలు నిర్వహించి సర్వమాన సౌభాతృత్వాన్ని వికసింపచేశారు.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్