ఆర్ఎస్ఎస్ మార్చ్ |
: దైనందిన ఏకత్రీకరణ ఎందుకు :
మొదట్లో వివరింపబడిన విషయం గుర్తుతెచ్చుకొంటే సంఘం ఈ హిందూసమాజంలో ఒక విశిష్టమైన పరివర్తన తీసికొని రాగోరుతున్నదని, ఒక నిత్యసంసిద్ధశక్తి రూపంలో ఈ సమాజంలో ప్రతిష్ఠింపబడాలని కోరుతున్నదని స్పష్టమవుతుందికదా! పై రెండు లక్ష్యాలకు అనుగుణంగానే సంఘంయొక్క సంపూర్ణ కార్యపద్ధతికి రూపురేఖలు, కార్యక్రమాలు రూపొందించుకోవటం జరిగింది. నిత్యసంసిద్దశక్తి అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? దీనిగురించి ఎవరికీ స్పష్టమైన కల్పన లేనేలేదు గదా! ఎందుకంటే, అప్పటివరకు నడుస్తున్న సంస్థలన్నీ ఆవసరమనుకున్న సందర్భాలలో సభ్యుల మీటింగ్ కి పిలుస్తూ ఉండేది. హాజరైన సభ్యులు రెండణాలో, నాలుగు అణాలో చందాగా ఇస్తూ ఉండేవారు, సభ్యత్వఫారాలను నింపుతూ ఉండేవారు. అంతటితో తమ పని అయిపోయినదని భావిస్తూ ఉండేవారు. మళ్ళీ ఎప్పుడైనా మీటింగ్ కి పిలిస్తే, హాజరుకావటం, కొన్ని తీర్మానాలను ఆమోదించటం. ఇలా జరుగుతూ ఉండేది. సంఘంకూడా ఇలాగే జరిగేటట్లయితే, మనం కోరుకొంటున్న విధంగా నిత్యసంసిద్ధశక్తిని రూపొందించటమూ, నిలబెట్టటమూ అసంభవం కదా! సంఘం ఆశిస్తున్న పద్ధతిలో నిత్యసంసిద్ధశక్తి రూపుదిద్దుకోవాలంటే, నాలుగురోజుల కొకసారో, వారానికి, పక్షానికి ఒకసారిగానో రావటంకాక ప్రతిరోజూ రావాల్సిందే.
అయితే, ఇటువంటి స్పూర్తిమంతమైన ఆలోచనలు, సూచనలు అన్నీ డాక్టర్టీ ద్వారానే, ఆయననుండే వచ్చినవని అనుకోరాదు. పదిమందికలసి కూర్చొని ఆలోచిస్తున్నపుడు కార్యకర్తలనుండి ఇటువంటి ప్రతిపాదనలు చేయబడాలని డాక్టర్జీ అభిలషించేవారు. అందుకు తగిన విధంగా ఆలోచనలు పంచుకొనే విధంగా అందరినీ ప్రోత్సహించేవారు. డాక్టర్టీ సంఘటన కార్యంలో నిపుణులు. అన్ని విషయాలూ ఆయనే స్పష్టాతి సృష్టమైన శబ్దాలలో ప్రతిపాదించినట్లయితే మిగిలిన వారందరూ బాగుబాగని తల ఊపుతారేగాని, అంతకుమించి లోతుగా ఆలోచించరని ఆయనకు తెలుసు. తల ఊపిన వారందరూ ఆ ఆలోచనను తప్పని సరిగా
స్వీకరిస్తారనే గ్యారంటీ కూడా ఉండదు. క్రమక్రమంగా, ఒక్కొక్కమెట్టుగా, సమయంయొక్క పిలుపుగా, అవసరంగా భావింపబడి, అందుకు అనుగుణమైన పద్ధతిలో వికసింపజేయబడిన పద్ధతులను అందరూ సులభంగా అర్థంచేసుకోవటం, స్వీకరించటమూ జరుగుతుంది. వాటిని అమలుచేసేవారు నెమ్మది నెమ్మదిగా ఆ పనులలో సమర్థులు అవుతారుకూడా.
కాబట్టి ఇటువంటి కార్యపద్ధతి ముందేనిర్ధారించుకొన్న రూపురేఖల పద్దతికన్నా మేలైన పద్ధతి ప్రభావవంతమైన పద్ధతి అవుతుంది. ఈ విషయాన్ని లోతుగా, సంపూర్ణంగా డాక్టర్ హెడ్గేవార్ అర్థం చేసుకున్నారు. కాబట్టి వారు ఏవిధమైన తొందరపాటుతనంగాని, అనవసరమైన హళాహళిగాని లేకుండా పనిని ముందుకు నడిపించారు. అన్ని విషయాలనూ తాను" సూచించటం, మిగిలినవారు అనుసరించటం అనే పద్దతిని అవలంబించకుండా, తన సహచరులనుండి సూచనలు, ప్రతిపాదనలూ వచ్చేటట్లుగా వారు ప్రయత్నించేవారు. సమావేశాల్లో జరిగే చర్చలుకూడా ఈ తీరులోనే ఉండేవి. తనకు ఉన్న ఉద్దేశ్యo నెరవేరడానికి సంఘం ధృష్టితో ఏమేమికావాలి అని ఆలోచించటం జరుగుతూ ఉండేది.
ఈ విధమైన ఆలోచనల కలబోతలలోనే ప్రతిరోజూ కలుసుకొనే కలయిక ఏ రూపంలో ఉండాలనే విషయానికి రూపకల్పన జరిగింది. మనం ఎంత పెద్ద నిత్యసంసిద్దశక్తిని నిర్మించగోరుతున్నామో, సమాజంలో ఎటువంటి మార్పులు తీసికొని రాగోరుతున్నామో అర్థమైన వారందరికీ అప్పుడప్పుడూ సమావేశమై చర్చలు, ఉపన్యాసాలు సాగించటం, చందా చెల్లించుతూ సభ్యత్వంఫారం నింపట-ఇటువంటి పద్దతులద్వారా అవి సాధ్యంకావని కూడా అర్థమైంది. ఒక సమాజం సురక్షితమై జాతీయభావంతో ఓతప్రోతమై, మేల్కొన్నదై ఉన్నపుడు" అప్పుడప్పుడూ జరిగే మంచి కార్యక్రమాల ద్వారా తాను అనుకొంటున్న పనులను నెరవేర్చుకోవచ్చు. కాని మన సమాజంవంటిది- ఇప్పుడున్న స్థితిని గమనిస్తే ఒక్కొక్కవ్యక్తిని యోగ్యునిగా మలచుకొనడానికి ఎంతో శ్రమించవలసి ఉంటుందని వారు గ్రహించారు. ఆ పనిలో భాగంగా ప్రతిరోజూ ఒకచోటకు వచ్చి కలుసుకోవటం అనివార్యం.
మొదట్లో కొన్ని రోజులు అక్కడికీ ఇక్కడికీ తిరగటంలోనే గడిచిపోయాయి. ఇలా రోజూ వచ్చి అక్కడికి ఇక్కడికీ తిరుగుతూ ఉండటం వల్ల ఏమవుతుంది అనే ఆలోచన వచ్చింది. అలాగే ప్రధానమైన సమస్యలపై లోతైనచర్చలు నిర్వహించటం కూడా ప్రతిరోజూ చేయగలిగేది కాదనీ తెలిసి వచ్చింది. ఇలా కొన్నాళ్లు సాగితే, ప్రతి రోజూ రావటం గురించి శ్రద్ధాసక్తులు తగ్గిపోగలవనీ ప్రతిరోజూ వస్తూ ఉండటం కష్టమౌతుందనీ గ్రహించారు. ప్రతిరోజూ వచ్చేవారు వృద్ధులేకాదు, యువకులు సైతం ఏం చేస్తుంటారు? చదరంగమో, పచ్చాలాడటమో (పేకముక్కలాట) చేస్తుంటారు. లేదంటే నగరంలో, తమ వీధిలో ఏమి జరిగిందనే విషయమై పిచ్చాపాటి మాట్లాడుతుంటారు. కొందరు ఎక్కడెక్కడో దేశదేశాల్లో జరిగిన విషయాలు ప్రస్తావిస్తుంటారు. ప్రతిరోజూ వచ్చికూర్చొనేవారు ఇంతకుమించి ఏం చేస్తారు? కాబట్టి తమ విలువైన సమయాన్ని కేటాయించుకొని రోజూ వచ్చేవారు తమ లక్ష్యానికి అనుగుణంగా, దానిని సిద్ధింపజేసుకొనే దిశలో ఎటువంటి కార్యక్రమాన్నీ చేపట్టాలని చర్చ జరిగింది.
ఏదో ఒక అఖాడా (వ్యాయామశాల)కు వెళ్లి వ్యాయామం చేయాలని, దండ (కట్ఱ) త్రిప్పటం వంటివి నేర్చుకోవాలని ఆలోచన వచ్చింది. ఆ రోజుల్లో నాగపూర్లోను, చుట్టుప్రక్కలలోనూ అఖాడాలకు వెళ్లి శరీర సౌష్టవాన్ని పెంపొందించుకోవటం చాలామంది యువకులకు ఇష్టమైన విషయంగా ఉంటుండేది. కాబట్టి వ్యాయామశాలలకు వెళ్లటం రోజువారీ కార్యక్రమమైంది. నాగపూర్లోని ఇప్పటి మోహితే సంఘస్థాన్ కి సమీపంలో ఉన్న గోడమీద 'నాగపూర్ వ్యాయామశాల' అని వ్రాయబడి ఉంది. ఆ వ్యాయామశాల నిర్వాహకుడు డాక్టర్జీకి మిత్రుడు. స్వయంసేవకులు అందరూ వ్యాయామశాలలకు పోవటం, వ్యాయామం చేయటం, వ్యాయామశాలలకు అనుబంధంగా ఉన్న మైదానాలలో దండ త్రిప్పటం అభ్యసించటం మొదలయ్యాయి. కొన్ని రోజుల తర్వాత వ్యాయామశాలలో శిక్షణ పొందుతున్నవారు రెండు ముఠాలుగా విడిపోయి ఒకరినొకరు కొట్టుకున్నారు. కొందరికి తలలుపగిలి నెత్తురు కారింది. అప్పుడు స్వయంసేవకులలో పునరాలోచన మొదలైంది. మనం సంఘటనా కార్యం చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళంగదా, అఖాడాలకు వెళ్లి ఒకరినొకరు కొట్టుకొంటూ ఉంటే, సంఘం అనే భావన బలపడగలదా? అని ఆలోచించారు. దానిలోనుండి మనదైన సంఘస్థాన్లో కలుస్తూ ఉండాలి అనే భావన బలపడింది.
ఆ విధంగా మన సంఘస్థానం, మన కార్యక్రమం-వీటిని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. సంఘంలో జరిగే చర్చలు, ఉపన్యాసాలూ వీటి గురించి కూడా ఆలోచించారు. ప్రారంభంలో సంఘంలోకూడా ప్రసంగాల తర్వాత చప్పట్లు కొట్టి హర్షం వెలిబుచ్చటం జరుగుతూ ఉండేది. క్రమంగా స్వయంసేవకులకు అనిపించింది. ఇవి బహిరంగ సభలుకావు, మనవాళ్ళు చెపుతున్నవి ఊకదంపుడు ఉపన్యాసాలు కావు. మనం నిర్వహించుకొంటున్నవి బౌద్ధికవర్గలు. పెద్దవారు ఒక విషయాన్ని మనముందు వివరిస్తున్నారు, చర్చల్లో కూడా ఏదో ఒక నిర్ణయింపబడిన అంశంపై వివిధ కోణాలలో మన అభిప్రాయాలను ప్రకటిస్తున్నాము, వీటి సారాంశాన్ని గ్రహించటం ముఖ్యం
కరతాళధ్వనులతో వక్తను అభినందించవలసిన అవసరమేమున్నది? ఇలాంటి ఆలోచన వచ్చిన తర్వాత ఒక వక్త మాట్లాడిన తర్వాత కరతాళ ధ్వనులతో అభినందించే అలవాటు మానుకున్నారు.