: కార్యానికి ఆధారం ధ్యేయనిష్ఠతోపాటు ఆత్మీయ సంబంధాలు :
మన సమాజస్థితి ఈనాడు ఎలా ఉన్నదంటే, చిన్నచిన్న కారణాలతోనే మనుష్యులు
ఒకరికొకరు విడివడి దూరంగా ఉండిపోతుంటారు. వివిధస్థాయిలలో జరిగే ఎన్నికలు
మనఃస్పర్ధలకు కారణమవుతున్నవి. రాజకీయక్షేత్రంలో పనిచేసేవారికి మనస్సులో అనేకరకాల ఆకాంక్షలు ఉబికివస్తాయి. అహంకారం పెరుగుతుంది. వీటిలోనుండి ఘర్షణలు ఆరంభమవుతాయి. ఇటువంటి సమస్యలు సంఘకార్యకర్తలముందుకు వస్తుంటాయి. తగిన దారిని వెదికిపట్టుకొని వారిని ఆ ఘర్షణలనుండి బయటపడవేయవలసి ఉంటుంది.
ఈ సమస్యలకు ఈనాడు పరిష్కారాలు లభిస్తూ ఉండవచ్చు. అయితే రేపుకూడా ఇలాగే పరిష్కారమవుతాయని చెప్పజాలము. సంఘస్వయంసేవక్ అనుశాసనంతో పెరిగినవాడయినందున, తాను పెరిగిన వాతావరణంలో తనగురించి, స్వీయప్రయోజనాల గురించి
ఆలోచించుకోవటం లేనందున ఇప్పటికి ఇది సాధ్యమవుతూ ఉంది. స్వయంసేవకులలో
మనం పట్టుదలవహించి ధ్యేయనిష్ఠను (సిద్దాంతంతో అనుబంధం) అలవరచినంతవరకే భవిష్యత్తులో ఇది సాధ్యమౌతుంది. ఆలోచన ఉన్నట్లయితే సంస్థతోనూ అనుబంధాన్నీ బలపరిచేది అవుతుంది. ఏ వ్యక్తులు, ఏకుటుంబాలు తగినంత కాలం కలసిమెలసి ఉంటారో వారిలో ఆత్మీయభావం నిర్మాణమవుతుంది. ఈ విధంగా మన సంఘటనా కార్యంలోకి వచ్చిన వ్యక్తులందరిలోనూ ఏకాత్మభావాన్నీ, ప్రేమభావాన్ని జనింపజేయాలి. సంవత్సరాల తరబడి
సంబంధాలు నెలకొని ఉన్న వ్యక్తులు తమ అహంకారం కారణంగానో, మనస్పర్థలకారణంగానో
సంస్థను విడిచిపెట్టి దూరంగా పోవటం జరుగదు.
ఇంటింటా సత్సంబంధాలు కలిగి ఉండటం మన డాక్టర్జీయొక్క స్వభావం. ధ్యేయంపట్ల మనస్సు లగ్నమైయుండటం మనకార్యానికి ఆధారం అయితే మనలోమనం ఆత్మీయ సంబంధాలు కలిగిఉండాలి. సంఘాన్ని, స్వయంసేవకులను విడిచి ఉండటం ప్రాణాన్నీ కోల్పోవటమంత కష్టంగా తోచాలి. అంత దృఢంగా స్వయంసేవకులలో సంబంధాలు ఉత్పన్నమై ఉండాలి. మన కార్యపద్ధతిలో ఈ అంశాలన్నీ భాగమై, తదనుగుణంగా పని జరుగుతున్నది కనుకనే మన శాఖల సంఖ్య వేలలోనూ స్వయంసేవకుల సంఖ్య లక్షలలోకి పెరిగి వర్ధిల్లుతూ ఉంది.
ఇప్పుడు మనం వివిధ రకాల క్షేత్రాలలోకి పోతున్నాం. ఇప్పటివరకు సంఘస్థాన్కి' సంఘ కార్యక్రమాలకీ పరిమితమై మన పరీక్ష జరుగుతున్నందున పెద్దగా సమస్యలేవీ తల ఎత్తటం లేదు. ఇప్పుడు ఎన్నో రకాల సమస్యలు మనముందున్నది. ఇది మనకు పరీక్షా సమయం.