రాధాకృష్ణ ! |
: సౌందర్యమిదే :
మనిషి కావల్సింది కేవలం ఆనందమే పూరిగుడిసెలో ఉన్నా, ఏడంస్తుల మేడలో ఉన్నా ఆనందం లేకపోతే మనిషి మనిషిగా ఉండలేడు. ఆనందానికి ఆడమగ తేడాలేదు. ఆనందాన్ని మించిది ఏదీలేదు అన్నా అతిశయోక్తి కాదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉందనట్లు ఒక్కోక్కరి కి ఏన్నో వ్యాపకాలుండవచ్చు. బంగారం, డబ్బు ఏదైనా ఉండచ్చు. కానీ ఆనందం లేకపోతే ఆ మనిషికి విశ్వామిత్రుడు కోరినట్లు ఏనుగుఅంబారిపై నిలబడి రూకను పైకి విసిరితే ఎంత ఎత్తు కుపోతుందో అంత డబ్బును ఇచ్చినా వారికి లేశమాత్రం ఆనందం పొందడు.
అదే పూరిగుడిసెలో ఉన్నా వారికి తినడానికి, ఉండడానికి లేకపోయినా వారి మనసు ఆనంద పరవశం ఐతే చాలు వారికి ఆ గుడిసే అమరానాధుని స్వర్గలోకంలా వారిచుట్టు ఉండే చెత్త కుప్పలే వారికి నందనోద్యానాలుగా కనిపిస్తాయి. వీటి కంతటికి కారణం కేవలం మనస్సాంనందమే.
ఎవరైనా మనసులో బాధపడుతుంటే వారిని చూసి వారు ఏమీ చెప్పకపోయనా ఏమిటీ నీ మొహం ఇంత డల్‌గా ఉంది. ఏమో ఆలోచిస్తున్నట్టు ఉన్నావే అనేయడం మనకు తరచుగా చూస్తుంటాం కదా. ఇదే అన్నమాట. మనసు ఆనందంతో ఉంటే మ ఖం కళకళలాడుతుంది. ముఖం తళతళ అంటే మనసు మంచి ఉషారుగా ఉందన్నమాట. అదేమానసికానందానికి కారణం. ఆ మనస్సానందానికి డబ్బు అవసరం లేదు.
మన చుట్టూ ఉండే మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, మమతానుబంధాలు హేతువులు. ఇవి కావాలంటే కొనుక్కోవడానికి దొరకవు. కానీ మన చేతుల్లోనే, చేతల్లోనే పుష్కలంగా లభ్యం అవుతాయి. ముందు మనం మారాలి. ప్రేమను పంచడం నేర్చుకోవాలి. మనతో కలసి జీవించేవారిలో ఎన్ని లోపాలున్నా వాటిని మంచి మనసుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అవి దుర్గణాలైతే వాటిని ప్రేమతో వారి నుంచి దూరం చేయడానికి శ్రమించాలి. వారిని సన్మార్గంలో ఉంచేందుకు ప్రయత్నించాలి.
పెద్దలైనా పిల్లలైనా వారికి నీతిగా ఉన్నందువల్లే వచ్చే లాభాలనే కాక వారికి మనస్సంతోషాన్ని చవిచూపించాలి. అపుడు వారు అందులోని ఆనందాన్ని గుర్తిస్తారు. ఆపై వారు చెడును చేయమని ప్రోద్భలం చేసినా చేయరు. మానసికానందం చవి చూసినవారుచేయమన్నా చెడు తలంపులు చేయరు. కనుక అమ్మలంతా పిల్లలకు మంచిమార్గాన్ని చూపాలి. ఇతరులకు చేసిన మేలే మానసికానందాన్నిస్తుందని వారికి ఉదాహరణతో చూపించాలి. అపుడు వారు మానసికానందం కావాలని కోరుకుంటారు. ఇంకా చెడు మార్గాలవైపు వెళ్లరు. వారు బాహ్యసౌందర్యంతోను, మానసిక సౌందర్యంతోను అందరిలో మెప్పును పొందుతారు.
__చివుకుల రామమోహన్