Revolutionary hero Ramprasad Bismil |
ఓపరమేశ్వరా! వంద జన్మలెత్తినా…ఈ పవిత్ర భారతదేశంలోనే పుట్టే వరమివ్వు… భరతమాత సేవలో మరణమైనా నాకు అమృతమే ….. అంటూ నవ్వుతూ ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు రాంప్రసాద్ బిస్మిల్.. నేడు ఆయన జయంతి.
మాతృ భూమి కోసం తన ప్రాణాలను నవ్వుతూ త్యాగం చేసిన విప్లవ వీరుడు రాం ప్రసాద్ బిస్మిల్. విదేశీ ప్రభుత్వం ఎన్ని బాధలకు గురి చేసినా, అనుక్షణం పోలీసులు వెంటాడి వేధించినా, తోటి వారే మోసగించినా జంకక గొంకక అను నిత్యం పోరాడి బానిసత్వాన్ని దగ్దం చెయ్యగల విప్లవ జ్యోతిని వెలిగించిన వీరుడు, కాకోరి రైలు దోపిడీకి నాయకత్వం వహించిన సాహసి, గొప్ప విప్లవ కవి రాం ప్రసాద్ బిస్మిల్. జూన్ 11 ఆయన జయంతి సందర్భంగా ఆ వీరుణ్ణి ఓసారి స్మరించుకుందాం.
ఓ వీరమాత పుత్రుడు, ధీశాలి :
ఒక నడి వయస్కురాలు, ఆమె భర్త, మరో యువకుడు గోరఖ్ పూర్ సెంట్రల్ జైలులో ఆ మరునాడే ఉరి తీయబోయే ఓ ఖైదీని కలవబోయారు. సంకెళ్ళతో బంధించబడిన ఆ వీర కిశోరాన్ని వారి ముందుకు తీసుకొచ్చారు. ఎదురుగా నిలుచున్న ఆ స్త్రీ మూర్తిని చూడగానే, అతని పెదాలు ‘అమ్మా’ అంటూ ఆర్తిగా పిలిచాయి. ఆ వెనువెంటనే జలజలమంటూ కన్నీళ్లు. ఆ కన్నీళ్లు చూడగానే ఆ తల్లి “నేను నా కొడుకు గొప్ప వీరుడనుకున్నాను. నా కొడుకు చావుకు భయపడతాడని నేనెన్నడూ అనుకోలేదు. ఇలా రోదించే బదులు ఉద్యమంలో పోల్గొనకుంటే పోయేదిగా?” అన్నది. ఆమె పలుకులు విన్న జైలు అధికారులు సైతం నివ్వెరపోయారు. “ఇవి కన్నీళ్లు కాదమ్మా నీవంటి వీరమాత పుత్రుడనైనానన్న ఆనందంతో పొంగిన ఆనంద భాష్పాలు” అన్నాడా యోధుడు. అతడే రాం ప్రసాద్ బిస్మిల్, ‘కాకోరీ దోపిడీ’ సంఘటనలో ప్రధాన నాయకుడు. ఆ వీరమాత ఆయన తల్లి మూలమతీ దేవి.
బాల్యం:
ఈయన 1897వ సంవత్సరంలో చంబల్ నదీ తీరాన ఉన్న గ్వాలియర్ సంస్థాన భూభాగంలోని ధోమర్ గఢ్ లో జన్మించాడు. అప్పటికి భారతదేశంలో బ్రిటిష్ వారి నీడ సోకని ప్రాంతాల్లో అదొకటి. తండ్రి మురళీధర్ షాజహాన్ పూర్ పురపాలక సంఘంలో ఉద్యోగం చేస్తూ మానివేసి బళ్ళను అద్దెకిచ్చే వ్యాపారం చేస్తూండేవాడు. రాంప్రసాద్ ఏడేళ్ళ వయసులో తండ్రి అతనికి హిందీ నేర్పాడు. మౌల్వీ వద్ద ఉర్దూ నేర్చుకున్నాడు. రాంప్రసాద్ ఉర్దూ నవలలు ఇష్టంగా చదివేవాడు. ఆ తర్వాత తండ్రికి ఇష్టం లేకపోయినా తల్లి ప్రోద్బలంతో ఆంగ్ల పాఠశాలలో చేరాడు.
తల్లిదండ్రులు మురళీధర్, మూలమతీ దేవి |
ఇంటికి సమీపంలో ఉండే ఆలయానికి కొత్తగా వచ్చిన పూజారి రాంప్రసాద్ ను ఆప్యాయంగా చేరదీశాడు. ఆయన సాంగత్యంలో రాంప్రసాద్ కొన్ని దైవ ప్రార్ధనలు నేర్చుకున్నాడు. మున్షీ ఇంద్రజిత్ అనే పెద్ద మనిషి రాంప్రసాద్ కు సంధ్యావందనం చెయ్యడం నేర్పి ఆర్య సమాజ్ ను పరిచయం చేశాడు. స్వామి దయానంద రచించిన “సత్యార్ధ ప్రకాశము’ అనే గ్రంధ ప్రభావంతో బ్రహ్మచర్య వ్రత దీక్ష ప్రాముఖ్యతను గ్రహించి మనసా, వాచా, కర్మణా ఆ వ్రతాన్ని ఆచరించాడు రాంప్రసాద్.
దేశరక్షా కార్యంలోకి:
స్వతహాగా మేధావి, దేశభక్తుడు అయిన ఆర్య సమాజ నాయకులు స్వామి సోమదేవజీ షాజహాన్ పూర్ వచ్చారు. సహజంగానే రాంప్రసాద్ ఆయనకు చేరువయ్యాడు. ఆయన సూచన మేరకు రాంప్రసాద్, భాయి పరమానందజీ వ్రాసిన “జన వాసిక్ హింద్” అన్న గ్రంథాన్ని చదివాడు. పరమానందజీపై రాంప్రసాద్ కు భక్తి కుదిరింది. అయితే 1916 లో లాహోర్ కుట్ర కేసులో భాయి పరమానంద్ కు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. ఈ విషయం తెలిసిన రాంప్రసాద్ రక్తం మరిగిపోయింది. పరమానంద్ జీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటానని సోమదేవజీ పాదాల సాక్షిగా ప్రమాణం చేశాడు రాంప్రసాద్. రాంప్రసాద్ విప్లవ మార్గాన్ని ఎంచుకోవడానికి అదే నాంది.
విప్లవమార్గంలో..
లక్నోలో జరుగనున్న కాంగ్రెస్ సమావేశాలకు విచ్చేసిన తిలక్ మహాశయుణ్ణి సాధారణంగా కారులో తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులు భావించారు. కానీ రాంప్రసాద్ దానిని అడ్డుకుని తిలక్ ను ఒక బండిపై ఎక్కించి పూల జల్లుల నడుమ ఘనమైన ఊరేగింపుగా లక్నో వీధుల్లో తీసుకెళ్ళారు. లక్నో కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా రాంప్రసాద్ కు కొందరు విప్లవకారులతో పరిచయమైంది. ఆయన విప్లవకారుల కమిటీ సభ్యుడయ్యాడు. ఆ కమిటీకి ఆర్ధిక వనరులు తక్కువగా వున్న విషయాన్ని గుర్తించి విప్లవ సాహిత్యాన్ని ముద్రించి అమ్మితే వారి సిద్దాంతాలకు ప్రచారము, కార్యానికి ధనము రెండూ చేకూరుతాయని భావించి తన తల్లి దగ్గర 400 రూపాయలు అప్పుగా తీసుకుని ‘అమెరికాకు స్వాతంత్ర్యం ఎలా వచ్చింది?’ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. జిందాలాల్ దీక్షిత్ అనే విప్లవకారుడికి బ్రిటిష్ ప్రభుత్వం విధించిన జైలు శిక్షను నిరసిస్తూ ‘దేశ ప్రజలకో సందేశం’ శీర్షికన ఒక కరపత్రాన్ని ప్రచురించాడు. ఈ రెంటినీ ఆంగ్ల ప్రభుత్వం నిషేదించింది. అమ్మకు అప్పు తీర్చగా మిగిలిన 200 రూపాయలతో కొన్ని ఆయుధాలు కొనుగోలు చేసి రహస్యంగా షాజహాన్పూర్ చేర్చాడు.
తృటిలో తప్పిన ప్రాణాపాయం :
తమ బృందాన్ని పోలీసులు వెంటాడుతున్న విషయాన్ని పసిగట్టి షాజహాన్పూర్ ను వదిలి ప్రయాగ చేరి ఒక సత్రంలో బస చేశారు మిత్ర బృందం. ఒక రోజు సాయంత్రం మిత్రులతో కలిసి యమునా నది ఒడ్డుకు వెళ్లి ధ్యాన మగ్నుడై ఉన్న రాంప్రసాద్ చెవి పక్క నుంచి ఒక తుపాకి గుండు దూసుకుపోయింది. తేరుకునే లోగా మళ్ళీ వెంటనే మరొకటి. తన తోటే ఉన్న మిత్రులు పారిపోవడంతో రాంప్రసాద్ మనసు వికలమైపోయింది.
కవి,హాలికుడు,శ్రామికుడు :
ఆ తర్వాత రాంప్రసాద్ తల్లి సలహా మేరకు కొంతకాలం గ్వాలియర్లోని బంధువుల ఇంట వుండి వ్యవసాయం చేశాడు. పశువులను మేపాడు. ఆ సమయంలో బోల్షివిక్ విప్లవం, క్యాథరిన్, స్వదేశీ రంగు వంటి అనేక రచనలు చేశాడు. ‘యోగ సాధన’ అనే అరవిందుని రచనని, మరొక పుస్తకాన్ని అనువదించాడు. అనేక స్వీయ రచనలు కూడా చేశాడు. ఇవన్నీ సుషీల్ మాలా ప్రభ మరికొన్ని పత్రికల్లో ముద్రించబడ్డాయి. ఆయన కలం పేరే ‘బిస్మిల్’.
కుటుంబ ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారడంతో కుటుంబ భారాన్ని మోయడానికి సిద్దపడ్డాడు రాంప్రసాద్. ఒక పరిశ్రమలో మేనేజర్ గా చేరాడు. ఒక పట్టు పరిశ్రమను కొంత పెట్టుబడితో స్థాపించి, అహోరాత్రాలూ శ్రమించి ఒక్క ఏడాదిలోనే లాభాల బాట పట్టించాడు. తన చెల్లెల్ని ఒక జమీందారుకిచ్చి వివాహం చేశాడు.
మళ్ళీ విప్లవోద్యమం వైపు :
1921లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని విరమించుకున్న తర్వాత విప్లవోద్యమం మరలా ఊపందుకుంది. విప్లవోద్యమానికి ప్రజల సమర్ధన కూడా తోడయింది. కానీ నిధుల కొరత వుంది. రాంప్రసాద్ నాయకత్వంలో నిధుల కోసం ఒకటి రెండు గ్రామాలు దోచుకున్నారు విప్లవకారులు. అయితే “దోచుకున్నదెవర్ని? సాటి భారతీయులనే కదా?” అన్న ఆలోచన బాధించింది రాంప్రసాద్ ను.
ఒకరోజు షాజహాన్పూర్ నుంచి లక్నో వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న రాంప్రసాద్ రైలు ప్రతి స్టేషన్లో ఆగడం, గార్డు క్యారేజిలో ధనపు సంచులు వేస్తూ వుండడం, వాటికి రక్షణ ఏర్పాట్లు కూడా ఏమీ లేకపోవడం గమనించాడు. తమ విప్లవ కార్యకలాపాలకు ధనం సమకూర్చుకోవడానికి ఆ ధనపు సంచులను దోచుకోవడమే మార్గమని ఆలోచించాడు రాంప్రసాద్.
కాకోరీ రైలు దోపిడీ :
లక్నోకు దగ్గరలో వున్న గ్రామం కాకోరీ. ఆగష్టు 9, 1925వ సంవత్సరం. కాకోరీ గ్రామం చేరుకుంటున్న రైలును రాంప్రసాద్ తన తొమ్మిది మంది మిత్రులతో కలిసి గొలుసు లాగి ఆపి దోచుకున్నాడు. ఈ జట్టులో చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఉన్నారు. ఈ దోపిడీతో ఆంగ్లేయ ప్రభుత్వాన్ని కుదిపేసినట్లయింది. ఆంగ్ల ప్రభుత్వం విసిరిన వలలో ఒక్క చంద్ర శేఖర్ ఆజాద్ మినహా నిందితులందరూ చిక్కుకున్నారు. రాంప్రసాద్, అష్ఫాకుల్లా, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరిలకు ఉరిశిక్ష విధించబడింది. ఈ యువ కిశోరాలను విడిచిపెట్టవలసిందిగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అయినా ఆంగ్లేయ ప్రభుత్వం కనికరించలేదు.
Revolutionary hero Ramprasad Bismil |
చిరునవ్వులతో భారతమాత ఒడిలోకి :
1927 డిసెంబరు 18 రాజేంద్ర లాహిరిని ఉరి తీసిన రోజు. 19న రాంప్రసాద్, ఆష్ఫాకుల్లాలను, 20న రోషన్ సింగ్ ను ఉరి తీశారు. ఒక్కరి ముఖంలోనూ దుఃఖపు ఛాయలు లేవు. నవ్వుతూ నవ్వుతూ ఉరికంబమెక్కారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించారు.
వంద జన్మలెత్తినా...
“ఓ పరమేశ్వరా! భారతదేశంలో నాకు వంద జన్మలనియ్యి. ప్రతి జన్మలోనూ నా మాతృభూమి సేవలో రాలిపోయే వరమియ్యి.” ఇవి రాంప్రసాద్ బిస్మిల్ రచనలలోని పంక్తులు. ‘బిస్మిల్’ ఆయన కలం పేరు. తన ఉరిశిక్షకు ముందు రాంప్రసాద్ తన ఆత్మ కథ వ్రాసుకున్నాడు. హిందీ సాహిత్యంలో అది అత్యుత్తమ రచన. అందులో తన తల్లిని సంబోధిస్తూ “నాకు జన్మనిచ్చిన ఓ ప్రియమైన తల్లీ! చివరిక్షణం వరకూ నా హృదయం చలించకుండా నన్నాశీర్వదించు. తల్లి భారతి పవిత్ర చరణాల వద్ద నా జీవన కుసుమాన్ని సమర్పించనివ్వు” అని వ్రాసుకున్నాడు.
మాతృ భూమి కోసం తనువు చాలించడం తమకు దక్కిన మహదవకాశంగా భావించిన వీరులు వారు. మాతృభూమి దాస్య విముక్తి కోసం తమ జీవితాలను తృణప్రాయంగా సమర్పించిన భరతమాత వీరపుత్రులెందరో ఈ గడ్డపై ఉద్భవించారు. వారందరూ భారత స్వాతంత్య్రోద్యమ వినీలాకాశంలో తారలై నిలిచిపోయారు. వారిలో రాంప్రసాద్ బిస్మిల్ ఒక అవిస్మరణీయ ధృవతార.
__విశ్వ సంవాద కేంద్రము