Guru's |
: గురుదక్షిణ - ఆత్మసమర్పణ భావము :
ఒకవైపున కార్యకర్తల శ్రద్ధతోకూడిన పరిశ్రమ ఫలితంగా సంఘ కార్యక్రమాలలో పాల్గొనేవారి సంఖ్య పెరుగుతూ రాగా, మరోవైపున సంఘంద్వారా ఎలా పనిచేయాలి స్వయంసేవకులలో గుణనీర్మాణం ఎలా చేయాలి, సమాజంలో పరివర్తన ఎలా తీసికొని రావాలి మొదలైన విషయాల నన్నింటినీ ఆలోచిస్తూ ఆ విషయాలను అవగాహన చేసుకొనే శక్తి వికసించుతూ వచ్చింది. తదనుగుణంగా సంఘ కార్యపద్ధతి వికాసం చెందుతూ వచ్చింది.
ఇప్పుడు సంఘంలో ఎన్నెన్నో విశిష్ట పద్దతులు అమలవుతూ ఉన్నా, అవి ఇప్పుడు మనకు విశేషమైనవిగా కనబడవు. ఈనాడు మనకు గురుదక్షిణ సమర్పించే పద్దతి ఒక సామాన్య విషయంగా కనబడవచ్చు. కాని ప్రారంభంలో ఇతర సంస్థలలో వలెనె చందా సేకరించటం కోసం డాక్టర్జీ కార్యకర్తలను అటూఇటూ పంపిస్తూ ఉండేవారు. స్వయంగా తాను వెళ్తూ ఉండేవారు. కొందరు నెలవారీ చందా ఇవ్వగా, కొందరు వార్షికంగా చందా ఇస్తుండేవారు. వాటిలోనుండే అన్ని రకాల ఖర్చులూ సర్దుకోవలసి ఉండేది. సంఘం కోరుకొని ఉంటే ఇతర సంస్థల మాదిరిగానే, చందాలు సేకరించుకోవటం ద్వారా తన పనిని తాను నడుపుకోగల్గి ఉండేదే. వారిదగ్గరనుండి, వీరిదగ్గర నుండి చందాలు సేకరించుకోవటం అసాధ్యమైన పనేమీ కాదు. అందరూ చేస్తున్న పనిని సంఘంమాత్రం ఎందుకు చేయలేదు? కాని, కొంచెం ముందుకు పోగానే ఈ పద్దతిని మార్పుచేశారు. స్వయంసేవకులు ఆలోచించారు గదా సంఘంలో ఇటువంటి గుణవంతులైన స్వయంసేవకులు ఉంటారు, సమాజంలో ఇటువంటి మంచి మార్పులు తీసికొని వస్తారు, ఇటువంటి నిత్య సంసిద్ధశక్తిని నిర్మిస్తారు, ఇంతటి సామర్థ్యాన్ని ఉత్పన్నం చేస్తారు- ఇలా బాగా ముందుకు దూకే ఆలోచనలు చేస్తున్న కారణంగా ఆత్మ సమర్పణ భావంతో కూడిన ఆలోచనలు ఉబికి వచ్చాయి. వాటిలోనుండే గురుదక్షిణ గురించిన కల్పన ఉత్పన్నమైంది. ప్రారంభంలో స్వయంసేవకులు అయిదు, పది, ఇరవై రూపాయల గురుదక్షిణకూడా చేయలేకపోతుండేవారు. అయితే ఒక వాతావరణం నిర్మాణమైనందున, సంవత్సరం పొడవునా పైసలు జాగ్రత్త చేసుకొని, గురుదక్షిణ ఎక్కువగా ఇవ్వాలనేభావం అంకురించింది. ఈవిధమైన ఆలోచనలు, ఆత్మసమర్పణ భావాల కారణంగానే వంద రూపాయలు, రెండు వందల రూపాయలు.... వేయి రూపాయల వరకు గురుదక్షిణ ఇవ్వగల స్థితి స్వయంసేవకులకు సాధ్యమైంది. స్వయంసేవకుల పాత్రత పెరుగుతూ ఉన్నకొద్దీ, ఒక్కొక్క విషయం రూపుదిద్దుకొంటూ వచ్చింది
బైఠకులలో వర్గలలో ఉపస్థితులైన వారు ఏ విషయాలను అర్ధం చేసుకోగలరో, ఆ విషయాలకు సంబంధించిన అంశాలను, ఆలోచనలనూ డాక్టర్జీ ప్రస్తావించుతూ, వివరించుతూ ఉండేవారు. ఇది ఎటువంటి సమావేశం, ఎవరికొరకు ఏర్పరచిన సమావేశం అనేది గమనించుకొని, పాల్గొంటున్నవారి యోగ్యత, పాత్రత, సామర్థ్యములను అంచనావేసుకొని తదనుగుణంగానే ఏ విషయమైనా ఎంత వరకు చెప్పాలో అంతవరకే చెప్పేవారు. కాబట్టి చెప్పిన విషయం అక్కడ ఉన్నవారందరూ గ్రహించుకోగల్గేవారు. ఆవిధంగా బైఠకులకు వచ్చేవారు అందరూ అక్కడ చెప్పిన విషయాలను విని, తదనుగుణంగా పనిచేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చేవారు.