పులుసు గోపిరెడ్డి (1935-2021) |
ఆలోచనాత్మకమైన రచనలు, కర్తవ్యోన్ముఖులను చేయగలిగిన రచనలు ఆయన సొంతం. ఆయన విద్యావేత్త. చింతనాపరుడు. తెలుగు ప్రాంత తొలినాటి స్వయం సేవకులలో వారు ఒకరు. ఆయన పులుసు గోపిరెడ్డి (1935-2021), మార్చి 31 ను ఆయన కన్నుమూయడంతో తెలుగునాట ఆర్ఎస్ఎస్ ఒక మేధావిని కోల్పోయింది.
1940లో ఆంధ్ర ప్రాంతంలో 'రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్' ప్రారంభం కాగా, తొలి దశాబ్దంలోనే స్వయం సేవకులైన వారిలో గోపిరెడ్డి ఒకరు. వీరి తాతలు పల్నాడుకు చెందినవారు. తరువాత వారి కుటుంబం ఉదర పోషణకు విజయవాడకు వచ్చింది. అక్కడే గోపిరెడ్డి జన్మించారు.
విజయవాడలో డిగ్రీ పూర్తి చేశారు. విజయవాడను వామపక్ష భావాలు ముప్పిరిగొంటున్న సమయంలో కూడా గోపిరెడ్డి జాతీయ భావాల వైపు దేశీయమైన ఆలోచనల వైపు మొగ్గడం నిజంగా ఒక వైచిత్రి. ఆ విధంగా చూస్తే గోపిరెడ్డి విజయం సాధించారు. ఆయన విశ్వాసాలే నిజం. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చదివారు. ఆ రోజులలో (1953-54) విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నడిచిన సంఘ శాఖకు ముఖ్య శిక్షకుడిగా పనిచేశారు. విజయవాడకు తిరిగివచ్చి ఎస్.ఆర్.ఆర్ సి.వి.ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా చేరారు. నాటి ప్రాంత ప్రచారక్ బాపూరత్ మోఘే సలహాపై వరంగల్ జిల్లాలో సంఘ శాఖల వ్యాప్తికి వీలుగా కుటుంబంతో తరలివెళ్లారు. ఆంధ్ర విద్యాభి వృద్ధినీ బహుళార్ధ సాధకోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేశారు. ఆనాడు వీరివద్ద విద్యార్థులుగా ఉండి చదివి పైకి వచ్చినవారు లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్, జిల్లా కలెక్టర్లు అయ్యారు. వారందరూ ఇప్పటికీ గోపిరెడ్డిని తలచుకుంటూ ఉంటారు.
కొద్దికాలం నెల్లూరులోని వెంకటగిరి రాజా కళాశాలలో పనిచేసి, ఆపై వికారాబాద్ లో కొత్తగా ఏర్పరచిన అనంత పద్మనాభ కళాశాలకు ఉపన్యాసకునిగా వెళ్లారు. అక్కడ ముళ్లపూడి సూర్య నారాయణ మూర్తి తదితరుల సాహచర్యం లభించింది. గంగవరం సాహీతీ సమితి పక్షాన, రంగారెడ్డి జిల్లా రచయితల సంఘం పేరున జిల్లా అంతటా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. రాణాప్రతాప్ చారిత్రక నవల అప్పుడు రాసినదే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్శా ఖకు అధ్యక్ష బాధ్యతలు కూడా ఆ రోజుల్లోనే నిర్వహించారు.
1970వ దశకం మధ్యలో మరల విజయవాడకు వచ్చారు. శారదా జూనియర్ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టారు.
ఆ రోజుల్లో విజయవాడలో విద్యారంగం అనేక సమస్యలతో సతమతమవుతూ ఉండేది. విద్యార్థుల మన్న స్పృహ కోల్పోయి నగర వీధులలో కొట్లాటలకు దిగుతుండేవారు. అటువంటి రోజులలో దక్షతతో తన విధులు నిర్వహించి కొత్తగా స్థాపించిన కళాశాలకు మంచిపేరు తెచ్చిపెట్టారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్ బాధ్యతలు స్వీకరించి పదవీ విరమణ వరకూ అక్కడే ఉన్నారు. ఆ రోజులలోనే నాగార్జున విశ్వవిద్యాలయం సెనెట్ మెంబర్ గా బాధ్యతలు నిర్వహించారు.
పదవీ విరమణ తర్వాత అనూహ్యంగా ఆయన వనవాసుల మధ్య పనిచేయడానికి ఉద్యుక్తులయ్యారు, వనవాసీ కళ్యాణాశ్రమం క్షేత్ర ప్రచార ప్రముఖ్ గా బాధ్యత వహించటమే గాక ఛత్తీస్ఘడ్ ప్రాంతంలో సంవత్సరాలు ఉండి వనవాసుల వికాస కార్యకలాపాలలో కొత్త కోణాలను ఆవిష్కరించారు. రచయితగా జాగృతి, ప్రజామత, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాందీపని తదితర పత్రికలలో విరివిగా రచనలు అందించారాయన.
పదవీ విరమణ తర్వాత అనూహ్యంగా ఆయన వనవాసుల మధ్య పనిచేయడానికి ఉద్యుక్తులయ్యారు, వనవాసీ కళ్యాణాశ్రమం క్షేత్ర ప్రచార ప్రముఖ్ గా బాధ్యత వహించటమే గాక ఛత్తీస్ఘడ్ ప్రాంతంలో సంవత్సరాలు ఉండి వనవాసుల వికాస కార్యకలాపాలలో కొత్త కోణాలను ఆవిష్కరించారు. రచయితగా జాగృతి, ప్రజామత, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాందీపని తదితర పత్రికలలో విరివిగా రచనలు అందించారాయన.
శ్రీ కృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడై 500 సంవత్సరాలు గడిచిన సందర్భంగా 2009లో జాగృతి దీపావళి ప్రత్యేక సంచిక వెలువరించింది. అందులో 'యుద్ధ మర్మమెరిగిన మొనగాడు' శీర్షికతో రాయలవారి సమగ్ర వ్యక్తిత్వాన్ని వివరించే ఒక వ్యాసం గోపిరెడ్డి అందజేశారు. అది ఎందరో పాఠకుల ప్రశంసలు పొందింది.
ఆకాశవాణిలో ప్రసంగాలు చేయటమే గాక నాటికలు, రూపకాలు కూడా రాసి యిచ్చారు. వారి రచనలు 30కి పైగా ప్రచురితమయ్యాయి. వాటిలో ఎదిగిన మనిషి (నవల) తరం మారిందింది (కథల సంపుటి), నేతాజీ సుభాష్ చంద్రబోస్ (దీనికి ఆచార్య ఎన్.జి. రంగా ముందుమాట రాసి ప్రశంసించారు),
దారి చూపిన దీపకళిక (శ్రీ గురూజీ శతజయంతి ప్రచురణ) వికసిత సంఘ కుసుమం (సోమేపల్లి సోమయ్య జీవిత పరిచయం), ఆర్.ఎస్.ఎస్. తొలివెలుగులు (మూడు భాగాలు), తెలుగునాట ఆర్.ఎస్. ఎస్ తొలి అడుగులు, నిరుద్యోగ సమస్య - పరిష్కారం, మరువరాని మహామహులు (12 మంది ప్రముఖ దేశ భక్తుల పరిచయం) తదితర గ్రంథాలు ఆయన రాశారు. వనవాసీ కళ్యాణశ్రమ స్థాపకులైన శ్రీ బాలాసాహబ్ దేశ పాండే జీవిత చరిత్రను కూడా 'వనయోగి' పేరుతో తెలుగులో రచించారు.
ఒకవైపు కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తూనే సమాజ సేవా రంగంలోనూ అనేక బాధ్యతలు నిర్వహించారు. విజయవాడ మహానగర్ కి రా.స్వ.సంఘ సంఘచాలక్ గా, భారతీయ విద్యావీఠం ఉపాధ్యక్షులుగా, సొసైటీకి కార్యదర్శిగా చిరకాలం బాధ్యతలు వహించారు.
విజయవాడలోని ఆలోచనాపరుల వేదికగా వర్ధిల్లుతున్న 'సమాలోచన కు గోపిరెడ్డి తొలి అధ్యక్షులు. దత్తోపంత్ ఠేంగ్డీ, ఎస్. గురుమూర్తి, వాకాటి పాండురంగరావు, ప్రొ||బషీరుద్దీన్, రంగా వంటి ఉద్దండులైన వ్యక్తులెందరినో విజయవాడకు ఆహ్వానించి వారిచేత లోతైన ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు. నెలనెలా జరిగే ఈ ఉపన్యాసాల సారాంశాలతో ఏటేటా సావనీర్ విడుదల చేసేవారు. ఈ ఉపన్యాస కార్యక్రమాలలో ఎన్నటికీ మరువలేనిది ఒకటి ఉంది. ప్రఖ్యాత కథకుడు, మేధావి, పత్రికా రచయిత వాకాటి పాండురంగారావు చేత నాలుగు ఆదివారాలు వరుసగా ఉపన్యాసాలు ఏర్పాటు చేయించారు.
ఆలోచనలు రేకెత్తించి మేధస్సును కదపకగల వాకాటి ప్రతిపాదనలను 'అవర్ టుమారో' పేరుతో పుస్తక రూపంలో వెలువరించారు. 2002లో తెలుగు కథా రచయితలతో ఒక విస్తృతమైన - రెండు రోజుల సదస్సును నిర్వహించి, ఆ సదస్సులో సమర్పించిన పత్రాలను తెలుగు కథా సమాలోచనమ్ పేరుతో పుస్తక రూపం ఇవ్వడానికి యత్నించారు. గోపిరెడ్డి సాన్నిహిత్యంతో విజయవాడ నగరం ఆ చుట్టుప్రక్కల జిల్లాలూ ఎంతో లబ్ది పొందినాయి. సాహిత్యరంగం బలోపేతమైంది. జాగృతి వంటి పత్రికలు పుష్టిని సంపాదించుకొన్నాయి. విద్యారంగం సుసంపన్నమైంది. సేవారంగం చురుకుదనాన్ని సంతరించుకొన్నది. అటువంటి వ్యక్తి తన 86వ ఏటా మనలందరినీ విడిచి వెళ్లటంతో ఏర్పడుతున్న లోటు తీరనిదిఆ అమృతమూర్తికి శ్రద్దాంజలి ఘటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ భూతిని తెలియజేస్తున్నాం. జాగృతి